రష్యా బంగారంపై కొరడా

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై మరిన్ని చర్యలకు పశ్చిమ దేశాలు సంసిద్ధమయ్యాయి. ఆ దేశం నుంచి బంగారం దిగుమతులను నిషేధించేందుకు ‘జీ7 కూటమి’ రంగం సిద్ధంచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం ఇక్కడ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనివల్ల రష్యా ఆర్థికంగా మరింత ఏకాకిగా మారుతుందని చెప్పారు.

Updated : 27 Jun 2022 05:44 IST

దిగుమతులను నిషేధించనున్న జీ7 దేశాలు
జర్మనీలో కూటమి శిఖరాగ్ర సదస్సు ప్రారంభం

మ్యూనిక్‌: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై మరిన్ని చర్యలకు పశ్చిమ దేశాలు సంసిద్ధమయ్యాయి. ఆ దేశం నుంచి బంగారం దిగుమతులను నిషేధించేందుకు ‘జీ7 కూటమి’ రంగం సిద్ధంచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం ఇక్కడ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనివల్ల రష్యా ఆర్థికంగా మరింత ఏకాకిగా మారుతుందని చెప్పారు. ఈ అంశంపై జీ7 దేశాలు మంగళవారం లాంఛనంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. చమురు, సహజవాయువు తర్వాత రష్యా నుంచి ఎక్కువగా ఎగుమతయ్యేది బంగారమే. ఆ దేశం నుంచి వెళ్లే స్వర్ణంలో 90 శాతం జీ7 దేశాలకు చేరుతోంది. అందులోనూ 90 శాతం బ్రిటన్‌కు వెళుతోంది. పసిడి లక్ష్యంగా రష్యాపై చర్యలకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా సమ్మతి తెలిపారు. దీనివల్ల క్రెమ్లిన్‌ అనుకూల ధనికులపై నేరుగా ప్రభావం పడుతుందని చెప్పారు. తరిగిపోతున్న తన వనరులను.. దారుణ యుద్ధం కోసం పుతిన్‌ వాడుతున్నారని పేర్కొన్నారు. ఆయన ప్రభుత్వానికి నిధులు అందకుండా చేయాలన్నారు.

రష్యా, చైనాకు చెక్‌..

బవేరియన్‌ ఆల్ప్స్‌ ప్రాంతంలోని షోల్స్‌ ఎల్‌మావ్‌లో మూడు రోజుల పాటు జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ఇంధన సరఫరాలను రక్షించుకోవడానికి ఉన్న మార్గాలపై బైడెన్‌, జీ7 కూటమి దేశాలు చర్చిస్తాయి. రష్యాపై ఒత్తిడిని కొనసాగించే వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. చమురుపై రష్యా లాభాలను తగ్గించే ఉద్దేశంతో ఇంధన ధరలపై పరిమితి విధించే అంశాన్నీ కూటమి నేతలు పరిశీలిస్తున్నారు. వర్ధమాన దేశాల్లో రష్యా, చైనా పెట్టుబడులకు ప్రత్యామ్నాయాలను అందించేందుకు కొత్తగా ‘ప్రపంచ మౌలిక వసతుల భాగస్వామ్యాన్ని’ ఏర్పాటు చేయనున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. ఈ దిశగా ఏడు దేశాలూ కలిసి 600 బిలియన్‌ డాలర్లను సమకూర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. శిఖరాగ్ర సదస్సుకు ముందు జరిగిన సమావేశంలో జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌తో షోల్జ్‌తో బైడెన్‌ భేటీ అయ్యారు. రష్యాను ఎదుర్కోవడంలో కూటమి ఐక్యంగా సాగిందన్నారు. దీన్ని కొనసాగించాలని కోరారు. దీనికి ఒలాఫ్‌ స్పందిస్తూ.. అందరం ఏకతాటిపై ఉన్నామని, దీన్ని పుతిన్‌ ఊహించలేదని చెప్పారు. జీ7 శిఖరాగ్ర సదస్సు జరుగుతుండగా పుతిన్‌ సర్కార్‌.. ఉక్రెయిన్‌ లక్ష్యంగా దాడులు చేయడం చర్చనీయాంశమైంది. దీన్ని బైడెన్‌ ఖండించారు. జీ7లో అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని