Updated : 16 Aug 2022 09:55 IST

భవిష్యత్‌ ప్రమాదాన్ని కళ్లకు కట్టిన ‘నింజా’

వెలుగులోకి కొత్త ఆయుధాల సత్తా 

స్వయంప్రతిపత్తి అస్త్రాలతో పెను ముప్పు

నిపుణుల ఆందోళన 

రహస్య ఆపరేషన్‌తో అల్‌ఖైదా అధినేత అయమన్‌ అల్‌ జవహరీని అంతమొందించడం ద్వారా అమెరికా.. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వానికి, అగ్రరాజ్యానికి మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచింది. అయితే ప్రమాదకరమైన మరో అంశాన్నీ వెలుగులోకి తెచ్చింది. అంతర్జాతీయ ఆయుధాల అభివృద్ధిలో చోటుచేసుకుంటున్న వేగాన్ని ఇది కళ్లకు కట్టింది. అల్‌ జవహరీని హతమార్చడానికి ఉపయోగించిన హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌ ‘నింజా’ క్షిపణి సామర్థ్యాన్ని విశ్లేషిస్తున్న నిపుణులు ఈ అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

హెల్‌ఫైర్‌ క్షిపణి ప్రాజెక్టు 1970ల్లో ప్రారంభమైంది. సోవియట్‌ యూనియన్‌ ట్యాంకులను ధ్వంసం చేసేందుకు దీన్ని అమెరికా అభివృద్ధి చేసింది. 1990ల నుంచి ఈ అస్త్రంలో వేగంగా మార్పులు జరిగాయి. భిన్న సామర్థ్యాలతో అనేక వెర్షన్లు వచ్చాయి. వాటిలో విస్ఫోటక పేలోడ్లను భిన్న సమయాల్లో విభిన్న రీతుల్లో పేల్చే వెసులుబాటు కూడా ఉంది. లక్ష్యాన్ని తాకడానికి ముందు కానీ తర్వాత కానీ అవి పేలిపోతాయి. తదుపరి దశలో హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌ ‘నింజా’ వచ్చింది. ఇది తన లక్ష్యాన్ని నాశనం చేయడానికి పేలుడు పదార్థంపై ఆధారపడదు. వేగం, కచ్చితత్వం, గతిజశక్తి, చివరి క్షణాల్లో విచ్చుకునే బ్లేడ్లే దీని బలం.


సూపర్‌ ఆయుధం

ఒక వ్యక్తిని అత్యంత కచ్చితత్వంతో చంపడానికి నింజా క్షిపణి అద్భుత ఆయుధం. ఇందులో ఎలాంటి పేలుడుకు ఆస్కారం లేనందువల్ల భారీ వినాశనం సంభవించదు. లక్షిత వ్యక్తికి చుట్టుపక్కల ఉన్నవారికి నష్టం జరిగే అవకాశం తక్కువ. ఈ తరహా ఆయుధాలను ‘సూపర్‌ వెపన్స్‌’గా చెబుతారు. హైపర్‌సోనిక్‌ క్షిపణుల రూపంలో రష్యా కూడా శక్తిమంతమైన అస్త్రాలపై పెట్టుబడులు పెడుతోంది. అమెరికా, నాటోల సాంకేతిక ఆధిపత్యాన్ని తగ్గించడం ఈ కసరత్తు ఉద్దేశం. రష్యాకు చెందిన అవన్‌గార్డ్‌ అస్త్రానికి భూ వాతావరణం వెలుపలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల అది అలవోకగా ఎటైనా వెళ్లే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. ఈ తరహా అస్త్రం విరుచుకుపడుతున్నప్పుడు ముందే గుర్తించడం, మార్గమధ్యంలో అడ్డగించడం చాలా కష్టం. చైనాకు చెందిన డీఎఫ్‌-17 హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ క్షిపణికీ ఇలాంటి సామర్థ్యాలు ఉన్నాయి. 


స్వయం ప్రతిపత్తి శకం

నేడు ఆయుధ మార్కెట్లలోకి మెషీన్‌ గన్‌లు కలిగిన చిన్నస్థాయి రోబో శునకాలు వచ్చేస్తున్నాయి. స్వయంప్రతిపత్తి కలిగిన నాలుగు రకాల డ్రోన్లను టర్కీ తయారుచేసింది. ఇది ప్రత్యర్థులను గుర్తించి, చంపేయగలదు. ఈ క్రమంలో మనిషి నుంచి ఆదేశాలు, జీపీఎస్‌ దిశానిర్దేశం దీనికి అవసరంలేదు. ఇలాంటి స్వయంప్రతిపత్తి డ్రోన్లను లిబియాలో ఖలీఫా హఫ్తర్‌ సాయుధ ముఠాకు చెందిన వాహనశ్రేణిపై దాడికి ఉపయోగించినట్లు ఐరాస నివేదిక చెబుతోంది.

భవిష్యత్‌లో ప్రధాన దేశాల మధ్య జరిగే యుద్ధంలో జీపీఎస్‌ నేవిగేషన్‌ ఉపగ్రహాలను పేల్చివేసే అవకాశం ఉంది. అందువల్ల నేవిగేషన్‌ లేదా శత్రు లక్ష్యాలపై గురిపెట్టేందుకు జీపీఎస్‌ సంకేతాలపై ఆధారపడే ఆయుధ వ్యవస్థల సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ లోటును భర్తీ చేయడానికి జీపీఎస్‌ దిశానిర్దేశం అవసరంలేని స్వయంప్రతిపత్తి ఆయుధాలు వచ్చేస్తున్నాయి. కక్ష్యలోని ఉపగ్రహాలను ధ్వంసం చేయగల అస్త్రాలను చైనా, రష్యా, భారత్‌లు అభివృద్ధి చేశాయి. అయితే ఇలాంటి సామర్థ్యాలను కృత్రిమ మేధతో కలగలపడం మరింత ప్రమాదకరమవుతుంది.


కొత్త నిబంధనలు

ప్రమాదకరమైన స్వయంప్రతిపత్తి ఆయుధ వ్యవస్థలు ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్నాయి. వీటిలో మెషీన్‌ లెర్నింగ్‌, ఇతర రకాల ఏఐ విధానాలు ఉంటాయి. అవి మానవ నియంత్రణ అవసరం లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకోగలవు. ఇలాంటి ఆయుధ వ్యవస్థలతో వచ్చే సమస్యలను గుర్తించడానికి ఐరాస, అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌, సిప్రీ వంటి సంస్థలు దాదాపు దశాబ్దకాలంగా నిపుణులతో చర్చలు జరుపుతున్నాయి. అయినా వాటి వినియోగాన్ని నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం లేదా చట్టమేదీ ఇంకా రూపుదిద్దుకోలేదు.


ఇవి అవసరం..

‘స్టాప్‌ ద కిల్లర్‌ రోబోస్‌’ అనే సంస్థ స్వయంప్రతిపత్తి ఆయుధ వ్యవస్థల నిషేధానికి ఉద్యమిస్తూనే ఉంది. మరోవైపు ఈ అంశంపై జరుగుతున్న ఐరాస చర్చల్లో అప్రకటిత ప్రతిష్టంభన ఏర్పడింది. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, రష్యా, దక్షిణ కొరియా, అమెరికాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. అలీనోద్యమంలోని 125 సభ్య దేశాలు మాత్రం ఇలాంటి ప్రమాదకర ఆయుధాలపై ఆంక్షలు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నాయి. భద్రతా మండలిలోని రష్యా, చైనా, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకు వీటో అధికారం ఉంది. అందువల్ల తప్పనిసరిగా కట్టుబడాల్సిన ఒప్పందం ఖరారు కాకుండా ఇవి అడ్డుకట్ట వేయవచ్చు. మొత్తంమీద.. భవిష్యత్‌తరం ఆయుధాల జోరుకు కళ్లెం వేయడానికి కొత్త చట్టాలు లేదా ఒప్పందాలు సాకారం కాకుంటే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని