తైవాన్‌తో వాణిజ్య ఒప్పందాలకు అమెరికా ఆసక్తి

చైనా నుంచి ఆక్రమణ ముప్పును ఎదుర్కొంటున్న తైవాన్‌తో విస్తృతస్థాయి వాణిజ్య చర్చలు జరిపి, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అమెరికా ఆసక్తి చూపుతోంది. ఈ చర్య ప్రజాస్వామ్య ప్రాతిపదికన స్వయంపాలిత దీవిగా కొనసాగుతున్న తైవాన్‌కు తమ

Published : 19 Aug 2022 04:55 IST

బీజింగ్‌: చైనా నుంచి ఆక్రమణ ముప్పును ఎదుర్కొంటున్న తైవాన్‌తో విస్తృతస్థాయి వాణిజ్య చర్చలు జరిపి, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అమెరికా ఆసక్తి చూపుతోంది. ఈ చర్య ప్రజాస్వామ్య ప్రాతిపదికన స్వయంపాలిత దీవిగా కొనసాగుతున్న తైవాన్‌కు తమ మద్దతుగా వాషింగ్టన్‌ భావిస్తోంది. దీవిలో అమెరికా బృందాల పర్యటన తర్వాత తైవాన్‌ను హెచ్చరించడానికి చైనా జరిపిన సైనిక విన్యాసాల నేపథ్యంలో గురువారం అమెరికా ఈ ప్రకటన చేసింది. 2.4 కోట్ల జనాభా ఉన్న  తైవాన్‌ స్మార్ట్‌ ఫోన్లలో వాడే ప్రాసెసర్‌ చిప్‌ల ఉత్పత్తికి ప్రపంచ దేశాలకు ప్రధాన వనరుగా ఉంటోంది. కాగా, చైనా సైనిక విన్యాసాల క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా తైవాన్‌ కూడా గురువారం హువాలీన్‌ వైమానిక స్థావరం నుంచి మిలటరీ డ్రిల్‌ నిర్వహించింది.

చైనా, జపాన్‌ అధికారుల చర్చలు

‘తైవాన్‌’ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర చైనాలో జపాన్‌, చైనా అధికారుల నడుమ బుధవారం చర్చలు జరిగాయి. ఇటీవలి సైనిక విన్యాసాల్లో జపాన్‌ ప్రత్యేక ఆర్థికమండలి పరిధిలోకి చైనా క్షిపణులు దూసుకుపోవడాన్ని టోక్యో ఆక్షేపించింది. పైగా తైవాన్‌ చుట్టూ చైనా చేస్తున్న యుద్ధోన్మాద చర్యలను నిరసిస్తూ జి7 దేశాల ప్రకటనలో జపాన్‌ సంతకం చేసింది. దీనికి పర్యవసానంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల స్థాయిలో జరగాల్సిన చర్చలను బీజింగ్‌ రద్దు చేసింది. దీంతో తాజా చర్చలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని