ఉక్రెయిన్‌ కీలక భూభాగాలు రష్యా పరం?

ఉక్రెయిన్‌ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో తాను ఇప్పటికే ఆక్రమించిన నాలుగు భూభాగాలను శాశ్వతంగా కలిపేసుకోవడానికి రష్యా మొదలుపెట్టిన జనాభిప్రాయ సేకరణ మంగళవారం ముగిసింది. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా

Updated : 28 Sep 2022 05:43 IST

ముగిసిన జనాభిప్రాయ సేకరణ

కీవ్‌: ఉక్రెయిన్‌ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో తాను ఇప్పటికే ఆక్రమించిన నాలుగు భూభాగాలను శాశ్వతంగా కలిపేసుకోవడానికి రష్యా మొదలుపెట్టిన జనాభిప్రాయ సేకరణ మంగళవారం ముగిసింది. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలను రష్యాలో కలిపేసుకునే కార్యక్రమం లాంఛనంగా ఈ నెల 30న పూర్తికావచ్చు. ఉక్రెయిన్‌లో పారిశ్రామిక కేంద్రమైన డాన్బాస్‌ ప్రాంతంలోని లుహాన్స్క్‌, దొనెట్స్క్‌లు ఎనిమిదేళ్లుగా మాస్కో అనుకూల వేర్పాటువాదుల చేతుల్లోే ఉన్నాయి. జనాభిప్రాయ సేకరణతో వాటిని సాధికారకంగా విలీనం చేసుకోవడం రష్యా లక్ష్యం. అమెరికా, నాటో దేశాలు ఈ జనాభిప్రాయ సేకరణ బూటకమని కొట్టివేస్తూ ఉక్రెయిన్‌ పక్షాన గట్టిగా నిలిచాయి. రష్యా సైనికులు తుపాకులతో ఇంటింటికీ వచ్చి ఉక్రెయిన్‌వాసులతో బలవంతంగా ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించాయి. అసలు ఏడు నెలల యుద్ధం వల్ల ఇప్పటికే అత్యధిక ప్రజలు ఇళ్లూవాకిళ్లూ వదలి పరారు కాగా, మిగిలిన కొద్దిమందితోనే జనాభిప్రాయ సేకరణ తంతు ముగించేస్తున్నారు. యుద్ధానికి ముందు మేరియుపొల్‌ జనాభా 5,41,000 కాగా ఇప్పుడు లక్ష మంది మాత్రమే నగరంలో మిగిలారు. వారితోనే రష్యా సైనికులు నిర్బంధంగా ఓట్లు వేయించారని నగర మేయర్‌ వాడిం బోయ్చెంకో ఆరోపించారు.

పుతిన్‌ అణ్వస్త్రాల హెచ్చరిక

ఉక్రెయిన్‌లో కొత్తగా ఆక్రమించుకున్న ప్రాంతాలతో పాటు తన ప్రధాన భూభాగాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే అణ్వస్త్ర ప్రయోగానికీ వెనుకాడబోమని రష్యా హెచ్చరించింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ గత వారం నుంచే అణ్వాయుధాల గురించి ప్రస్తాస్తున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో నాటో ప్రత్యక్షంగా తలదూర్చదని ఆశిస్తున్నామని రష్యా నాయకుడు దిమిత్రీ మెద్వెదేవ్‌ మంగళవారం ఉద్ఘాటించారు. యుద్ధంలో అణు బాంబులు ప్రయోగిస్తే రష్యా చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ ఎన్‌.బి.సి టీవీ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. కానీ, రష్యా అణు హెచ్చరికలను తేలిగ్గా తీసుకోకూడదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వ్యాఖ్యానించారు.

ఎలక్ట్రోమేగ్నటిక్‌ పల్స్‌తో దాడి?

ఉక్రెయిన్‌లో ఓడిపోయే పరిస్థితిని తప్పించుకోవడానికి రష్యా భారీ అణు బాంబులను కాకుండా చిన్నపాటి టాక్టికల్‌ అణ్వస్త్రాలను ప్రయోగించవచ్చని నిపుణుల అంచనా. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా నేరుగా అణ్వస్త్ర ప్రయోగానికి దిగకుండా అక్కడ నేల మీద కానీ, గాలిలో నిర్ణీత ఎత్తులో కానీ చిన్నపాటి అణు బాంబును పేలిస్తే, దాని నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ప్రాణ నష్టం కలిగించకుండా విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను మాత్రం నిర్వీర్యం చేస్తాయి. దీంతో ఉక్రెయిన్‌లో పోరాట స్థైర్యం తగ్గిపోవచ్చు. 1962లో నాటి సోవియట్‌ ప్రభుత్వం కజక్‌స్థాన్‌ గగనతలంలో ఇలాంటి ఎలక్ట్రోమేగ్నటిక్‌ ఆయుధాన్ని ప్రయోగాత్మకంగా పేల్చింది. ఉక్రెయిన్‌లో ఏ తరహా అణ్వస్త్రం పేలినా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లో సంభవించిన దాని కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ నష్టం ఐరోపాలో సంభవిస్తుంది.

జపోరిజియాలో 93.11% అనుకూలం

ప్రజాభిప్రాయ సేకరణలో జపోరిజియా ప్రాంతంలో 93.11% మంది ప్రజలు రష్యాలో విలీనానికి మద్దతుగా స్పందించారని రష్యా నియమించిన ఎన్నికల అధికారులు ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శుక్రవారం పార్లమెంటును ఉద్దేశించి చేసే ప్రసంగంలో రిఫరెండం గురించి మాట్లాడవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల విలీనాన్ని అక్టోబరు 4న శాసనకర్తలు పరిగణనలో తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని