అత్యంత ఖరీదైన నగరాలు న్యూయార్క్‌, సింగపూర్‌..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్‌, సింగపూర్‌ నిలిచాయి.

Published : 03 Dec 2022 05:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్‌, సింగపూర్‌ నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. 172 ప్రధాన నగరాల జాబితాలో న్యూయార్క్‌, సింగపూర్‌ సంయుక్తంగా తొలి స్థానం దక్కించుకున్నాయి. గతేడాది అగ్రస్థానంలో నిలిచిన ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌ నగరం.. ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. హాంకాంగ్‌, లాస్‌ ఏంజెలెస్‌(అమెరికా) సంయుక్తంగా నాలుగో స్థానాన్ని పొందాయి. జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌), జెనీవా (స్విట్జర్లాండ్‌), శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా), ప్యారిస్‌ (ఫ్రాన్స్‌) వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో నిలిచాయి. కోపెన్‌హ్యాగెన్‌ (డెన్మార్క్‌), సిడ్నీ (ఆస్ట్రేలియా) ఉమ్మడిగా పదో స్థానాన్ని దక్కించుకున్నాయి. 

కాగా.. ప్రపంచంలోనే అత్యల్ప జీవన వ్యయమున్న నగరాలుగా సిరియా రాజధాని డమాస్కస్‌, లిబియాలోని ట్రిపోలి ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఈ 172 నగరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు, అద్దె, రవాణా తదితర 400 వ్యయాలపై సర్వే చేసి ఈ జాబితా రూపొందించారు. ఈ నగరాల సగటు జీవన వ్యయం గతేడాదితో పోలిస్తే 8.1శాతం పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. ఉక్రెయిన్‌ యుద్ధంతో సరఫరా గొలుసుకు ఆటంకం ఏర్పడటం, ఇతరత్రా కారణాలతో సగటు జీవన వ్యయాలు పెరిగినట్లు ఈఐయూ సర్వే తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని