King Charles III: శతాబ్దాల సంప్రదాయానికి కింగ్‌ ఛార్లెస్‌-3 స్వస్తి?

బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌-3 (King Charles III)కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఈసారి ఆయన ఏళ్ల నాటి సంప్రదాయాన్ని వీడనున్నట్లు సమాచారం.  

Published : 22 Jan 2023 12:05 IST

లండన్‌: బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 (King Charles III), ఆయన సతీమణి క్యామిల్లా పట్టాభిషేకం  ఈ ఏడాది మే నెలలో వైభవంగా జరగనుంది. ఈ వేడుకలో శతాబ్దాల సంప్రదాయానికి కొత్త చక్రవర్తి స్వస్తి పలకనున్నట్లు సమాచారం. పట్టాభిషేక (coronation) సమయంలో రాజ దుస్తులను ధరించే ఆచారానికి ఆయన దూరంగా ఉండనున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ఇండిపెండెంట్‌’ వెల్లడించింది.

మునుపటి పట్టాభిషేకాలలో, చక్రవర్తి సాంప్రదాయకంగా పట్టు మేజోళ్లు (silk stockings), చల్లడాల (breeches)ను ధరించేవారు. అయితే, కింగ్ ఛార్లెస్-3 (King Charles III) ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజ దుస్తులకు బదులుగా సైనిక యూనిఫారంలోనే ఆయన పట్టాభిషేకం (coronation)లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. తన వద్ద ఉన్న సీనియర్‌ సలహాదారులను సంప్రదించిన తర్వాత కొత్త చక్రవర్తి ఈ నిర్ణయానికి వచ్చారని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంప్రదాయ దుస్తులు కాలం చెల్లివనిగా ఉండడం వల్లే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌-3 (King Charles III)కి మే 6న అధికారికంగా పట్టాభిషేకం (coronation) జరగనుంది. వెస్ట్‌మినిస్టర్‌ అబేలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు. తర్వాతి రోజు విండ్సర్‌ క్యాజిల్‌లోనూ పట్టాభిషేక (coronation) మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున జరపనున్నారు. ఈ కార్యక్రమానికి కొన్ని వేల మంది సామాన్య ప్రజలను కూడా అనుమతించనున్నారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్‌-2 గత ఏడాది సెప్టెంబర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం బ్రిటన్‌ నూతన రాజుగా ఛార్లెస్‌-3 (King Charles III) బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని