Putin: భారత్‌తో ఆటలొద్దు.. పశ్చిమ దేశాలకు పుతిన్‌ హెచ్చరిక!

భారత్‌ అనుసరిస్తోన్న విదేశీ విధానంపై (Foreign Policy) ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin).. అలా పాటించడం నేటి ప్రపంచంలో అంత సులభం కాదన్నారు.

Updated : 26 Jan 2024 17:40 IST

మాస్కో: భారత్‌ అనుసరిస్తోన్న విదేశీ విధానంపై (Foreign Policy) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) మరోసారి ప్రశంసలు కురిపించారు. అలా పాటించడం నేటి ప్రపంచంలో అంత సులభం కాదన్నారు. ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బయటనుంచి ఆటలు ఆడే ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదన్నారు. ‘రష్యన్‌ స్టూడెంట్‌ డే’ సందర్భంగా కాలినింగ్రాడ్‌ ప్రాంతంలోని యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించిన పుతిన్‌.. ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించారు.

మోదీ సారథ్యంలో..

‘స్వతంత్ర విదేశీ విధానాన్ని (Foreign Policy) భారత్‌ అనుసరిస్తోంది. నేటి ప్రపంచంలో అది అంత తేలిక కాదు. సుమారు 150 కోట్ల జనాభా కలిగిన భారత్‌కు ఆ హక్కు ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో భారత్‌ ఒకటి. అది కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం వల్లే. ఆయన సారథ్యంలోనే భారత్‌ ఇంతటి వేగం పుంజుకుంది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని ఊహించడం అసాధ్యం. ఈక్రమంలో భారత్‌, ఆ దేశ నాయకత్వంపై రష్యా ఆధారపడవచ్చు’ అని పుతిన్ పేర్కొన్నారు. భారత్‌లో రాజకీయ పలుకుబడి కోసం ఆటలాడవద్దని బయటి శక్తులను హెచ్చరించిన ఆయన.. అటువంటి ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదన్నారు.

గొప్ప సంస్కృతి..

‘భారత్‌కు గొప్ప సంస్కృతి ఉంది. జాతీయ టీవీ ఛానెళ్లలో భారతీయ సినిమాలను ప్రసారం చేసే అతికొద్ది దేశాల్లో రష్యా ఒకటి. ఇలా మరే దేశం చేస్తుందని అనుకోవడం లేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలో మొదలైన ‘మేకిన్‌ ఇండియా’ (Make In India) కార్యక్రమాన్ని రష్యాతో పాటు ఎన్నో దేశాలు చూస్తున్నాయి. ఆ ప్రణాళికలన్నింటినీ ఆచరణలో పెట్టేందుకు భారత భాగస్వాములతో కలిసి ప్రయత్నిస్తున్నాం. భారత్‌కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా రష్యా నుంచే వస్తున్నాయి’ అని పుతిన్ వెల్లడించారు. ఓ చమురు శుద్ధి కర్మాగారం కొనుగోలు, గ్యాస్‌ స్టేషన్లు, పోర్టులు తదితర రంగాల్లో పెట్టుబడులను ఆయన ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని