Putin: త్వరలో తుర్కియేకు పుతిన్‌..! యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ‘నాటో’ దేశానికి

రష్యా అధినేత పుతిన్‌ త్వరలో తుర్కియేలో పర్యటించనున్నారు! ఇదే జరిగితే.. ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలు ఓ ‘నాటో’ సభ్యదేశానికి ఆయన వెళ్లడం తొలిసారి అవుతుంది.

Published : 06 Feb 2024 01:34 IST

ఇస్తాంబుల్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) త్వరలో తుర్కియే (Turkiye)లో పర్యటించనున్నట్లు సమాచారం. తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్‌ ఫిదాన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదే జరిగితే.. ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలు ఓ ‘నాటో’ సభ్యదేశానికి పుతిన్ వెళ్లడం తొలిసారి అవుతుంది. తమ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో సమావేశమై.. నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్‌ ఆహార ధాన్యాల ఎగుమతులకు కొత్త మార్గాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రి ఫిదాన్‌ తెలిపారు. రష్యా అధినేత పర్యటన తేదీని పేర్కొనలేదు. అయితే.. ఫిబ్రవరి 12న వచ్చే అవకాశముందని స్థానిక మీడియా చెప్పింది.

ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి తన దేశానికి పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం గతేడాది అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అంటే.. ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో ఆయన కనిపిస్తే అరెస్టు చేయాల్సి ఉంటుంది. రష్యా మాదిరే తుర్కియే కూడా ఇందులో చేరలేదు. కీవ్‌పై మాస్కో సైనిక చర్య ప్రారంభమై రెండేళ్లు సమీపిస్తోంది. ఇరుపక్షాలతోనూ మంచి సంబంధాలు కొనసాగించేందుకు అంకారా ప్రయత్నిస్తోంది. సిరియాలో భద్రత పరిస్థితులు, ఇంధన సహకారంపై కూడా ఇరునేతలు చర్చిస్తారని ఫిదాన్ తెలిపారు.

పుతిన్‌.. మస్క్‌ను మించిన కుబేరుడా..?

2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలు.. ఈ రెండు దేశాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. అదే ఏడాది జులైలో.. తుర్కియే, ఐరాస సమక్షంలో రెండు దేశాల మధ్య ‘ధాన్యం ఎగుమతుల ఒప్పందం’ కుదిరింది. అయితే.. ఆ ఏడాది నవంబరులో ఒకసారి, 2023 జులైలో మరోసారి మాస్కో ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఈ అంశంపై గతేడాది సెప్టెంబరులో పుతిన్‌, ఎర్డోగాన్‌లు రష్యాలోని సోచి వేదికగా చర్చలు జరిపినా.. ఫలితం లేకపోయింది. సమస్య పరిష్కారానికిగానూ పాత ఒప్పందానికి భిన్నంగా ఈసారి కొత్త మార్గాలను అన్వేషించే అవకాశం ఉందని ఫిదాన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని