బ్రిటన్‌ ప్రతిష్ఠాత్మక క్విజ్‌ ఫైనల్లో.. చంద్రయాన్‌-2 టీమ్ సభ్యుడు

కోల్‌కతా కుర్రాడు దేబ్‌నాథ్‌ బ్రిటన్‌లో జరిగిన అత్యంత కఠినమైన క్విజ్‌ పోటీలో ఫైనల్‌కు చేరుకున్నారు. 

Published : 04 Apr 2024 18:03 IST

లండన్‌: యూకే ప్రతిష్ఠాత్మక క్విజ్‌ పోటీ ఫైనల్‌ రౌండ్‌లో అడుగుపెట్టాడు కోల్‌కతా కుర్రాడు సౌరజిత్‌ దేబ్‌నాథ్‌. ఎన్నో సంక్లిష్టమైన ప్రశ్నలకు టకటకా సమాధానం చెప్పి, తన బృందం ముందడుగు వేయడంలో కీలక పాత్ర పోషించారు. మన అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రాజెక్టు అయిన చంద్రయాన్‌-2 బృందంలో అతడొక సభ్యుడు కావడం గమనార్హం. 

‘యూనివర్సిటీ ఛాలెంజ్ ’ అనేది బ్రిటిష్ టెలివిజన్‌ క్విజ్ ప్రోగ్రామ్. అత్యంత కఠినమైనదిగా భావిస్తారు. దీని గ్రాండ్‌ ఫినాలేలో ఇంపీరియల్ కాలేజ్‌ లండన్‌, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌ విద్యార్థుల మధ్య జరగనుంది. దేబ్‌నాథ్‌.. ఇంపీరియల్‌ బృంద సభ్యుడు. 31 ఏళ్ల కుర్రాడు తనవంతుగా గణితం, ఫిజిక్స్, జనరల్ సైన్స్‌తోపాటు పాప్‌ కల్చర్‌ వంటి అంశాల్లోని ప్రశ్నలకు సమాధానం ఇవ్వనునున్నారు. ఇలాంటి ఒక ప్రఖ్యాత కార్యక్రమంలో భాగం అయినందుకు గర్వంగా ఉందని చెప్పారు. 

ఇంపీరియల్ కాలేజ్‌లో ఎర్త్‌ సైన్స్‌ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అప్లైడ్ కంప్యుటేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. అలాగే ఇస్రో అనుబంధ సంస్థ అయిన యూఆర్‌ రావు స్పేస్‌ సెంటర్‌లో అంతరిక్ష శాస్త్రవేత్తగా పనిచేశారు. చంద్రయాన్‌-2 మిషన్ బృందంలో కూడా భాగమయ్యారు. ఫినాలే సోమవారం ప్రసారం కానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని