Suella Braverman: ‘ఆ హామీలను నెరవేర్చలేకపోయారు’.. సునాక్‌పై బ్రేవర్మన్ విమర్శలు

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌పై మాజీ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ విమర్శలు చేశారు. సునాక్‌ ప్రధాని పదవి చేపట్టడానికి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని ఆరోపించారు.

Published : 15 Nov 2023 13:51 IST

లండన్‌: బ్రిటన్ (Britain) హోం మంత్రిగా సువెల్లా బ్రేవర్మన్‌ (Suella Braverman)ను తొలగించిన నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak)పై ఆమె విమర్శలు చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సునాక్‌ విఫలమయ్యారని ఆరోపించారు. ఈ మేరకు సునాక్‌కు రాసిన లేఖను సుయెల్లా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘ప్రధాని అభ్యర్థిగా మీరు పోటీలో ఉన్నప్పుడు.. పలు అంశాలపై మీరిచ్చిన హామీల కారణంగానే.. నేను మీకు మద్దతునిచ్చాను. వాటిలో అక్రమ వలస, చిన్న పడవల ద్వారా బ్రిటన్‌లోకి ప్రవేశించే వారి కట్టడి, నార్తర్నన్‌ ఐలాండ్ ప్రొటోకాల్‌తోపాటు పలు కీలక అంశాలకు సంబంధించి మీరు హామీలు ఇచ్చారు. కానీ, వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారు. మీ నిర్ణయాలు పనిచేయడం లేదు. ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొనక ముందే మీ పనితీరును మార్చుకోవాలి. బ్రిటన్‌లో జరుగుతున్న ర్యాలీలు, అతివాదంపై మీరు చర్యలు తీసుకోవాలి’’ అని బ్రేవర్మన్‌ లేఖలో పేర్కొన్నారు.

రిషి సునాక్‌పై అవిశ్వాస లేఖ

కొద్దిరోజుల క్రితం లండన్‌లో పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీని నియంత్రించడంలో పోలీసుల తీరుపై బ్రేవర్మన్‌ విమర్శలు చేశారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను మంత్రి వర్గం నుంచి తొలగించారు. గతంలో లిజ్‌ ట్రస్‌ కేబినెట్‌లో పనిచేసిన బ్రేవర్మన్‌.. ఆమె ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. అదే సమయంలో మైగ్రేషన్‌ అంశంపై అధికారిక పత్రాలకు సంబంధించి నిబంధనలను ఉల్లఘించినందుకు బాధ్యత వహిస్తూ.. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా సునాక్‌పై విమర్శలు చేయడంతో ఆమె తీరు మరోసారి చర్చనీయాంశమైంది.

350 మందిలో ఒక్కరు కూడా లేరా..

బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రిగా మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌ను నియమించడంపై ప్రధాని రిషి సునాక్‌ నిర్ణయాన్ని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ తప్పుబట్టింది. లేబర్‌ పార్టీ అధికార ప్రతినిధి డేవిడ్‌ లామీ మాట్లాడుతూ.. ‘‘ ఏడేళ్లలో కామెరూన్‌ ఏడో విదేశాంగ మంత్రి. విదేశాంగ విధానాల్లో ఆయన విఫలమవడం వల్లే ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. 350 మంది ఎంపీల్లో సునాక్‌కు విదేశాంగ శాఖ కోసం ఒక్కరు కూడా దొరకలేదా?’’అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని