S Jaishankar: ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు..: కెనడా వివాదంపై జైశంకర్‌ ఘాటు రిప్లై

కెనడా(Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) భారత్‌పై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా వీటిని మరోసారి ఖండించిన కేంద్రమంత్రి ఎస్‌ జైశంకర్(S Jaishankar).. ఆ దేశంపై ఘాటు విమర్శలు చేశారు.

Updated : 27 Sep 2023 12:27 IST

న్యూయార్క్‌: ‘ఖలిస్థానీ’ అంశం భారత్‌-కెనడా(India-Canada) మధ్య దౌత్యపరమైన చిచ్చుపెట్టింది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఐరాస 78వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా న్యూయార్క్‌ వెళ్లిన విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ (S Jaishankar).. ఈ వివాదంపై కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(CFR)లో మాట్లాడారు.

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌(Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను జైశంకర్‌ మరోసారి ఖండిస్తూ.. తన విధానాల ప్రకారం భారత్‌ అలాంటి చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. ట్రూడో(Justin Trudeau) ప్రభుత్వం చేసిన ఆరోపణలకు సంబంధించి ఇంతవరకు వారివైపు నుంచి ఎటువంటి ఆధారాలు అందలేదని, నిజ్జర్‌ హత్యకు సంబంధించి తగిన సమాచారం అందిస్తే.. భారత్ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదంపై నిర్లక్ష్యమొద్దు

ఫైవ్‌ఐస్‌ కూటమిలో పంచుకున్న సమాచారం ఆధారంగానే ట్రూడో ఆ ఆరోపణలు చేసుండొచ్చని యూఎస్‌ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై రిపోర్టర్‌ మంత్రిని ప్రశ్నించగా.. ఆయన ఘాటుగా బదులిచ్చారు. ‘నేను ఆ ఫైవ్‌ ఐస్‌(Five Eyes intelligence  Alliance)లో భాగం కాదు. అలాగే ఎఫ్‌బీఐకి చెందిన వ్యక్తినీ కాను. మీరు ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదనుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు. ఫైవ్‌ఐస్‌.. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల సమాహారం. విశ్వసనీయ సమాచార మార్పిడి దీని ప్రధాన లక్ష్యం.

అలాగే, రాజకీయ లబ్ధి కోసం వేర్పాటువాద శక్తులు, హింస, తీవ్రవాదానికి సంబంధించి వ్యవస్థీకృత నేరాలపై కొందరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ట్రూడో సర్కారుపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేరాల గురించి భారత ప్రభుత్వం కెనడాకు పెద్ద మొత్తంలో సమాచారాన్ని అందించిందని, అలాగే అప్పగింతల కోసం ఎన్నో అభ్యర్థనలు చేసిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు