Spying: రష్యాతో గూఢచర్య కార్యకలాపాలు! పట్టుబడిన ఉక్రెయిన్‌ అధికారులు

రష్యా గూఢచర్య నెట్‌వర్క్‌లో భాగస్వాములైనట్లు అనుమానిస్తున్న ఇద్దరు కీలక వ్యక్తులను ఉక్రెయిన్ అదుపులోకి తీసుకుంది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్(ఎస్‌బీయూ) మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వారిలో ఒకరు సీనియర్...

Published : 22 Jun 2022 01:12 IST

కీవ్‌: రష్యా గూఢచర్య నెట్‌వర్క్‌లో భాగస్వాములైనట్లు అనుమానిస్తున్న ఇద్దరు కీలక వ్యక్తులను ఉక్రెయిన్ అదుపులోకి తీసుకుంది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్(ఎస్‌బీయూ) మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వారిలో ఒకరు సీనియర్ ప్రభుత్వ అధికారి కాగా, మరొకరు ఓ వ్యాపార లాబీ సంస్థ ప్రతినిధి అని వెల్లడించింది. అయితే, వారి పేర్లను బయటపెట్టలేదు. ‘గూఢచర్య ఆరోపణలను నిర్ధారించుకునేందుకు మల్టీ-స్టేజ్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాం. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులు పట్టుబడ్డారు. వారిలో ఒకరు.. మంత్రుల కేబినెట్ సెక్రెటేరియట్‌లోని ఓ డిపార్ట్‌మెంట్‌కు హెడ్‌ కాగ, మరొకరు.. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టరేట్‌లలో ఒకదానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నాం’ అని తెలిపింది.

దేశ సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ రక్షణా సామర్థ్యాల నుంచి స్థానిక అధికారుల వ్యక్తిగత సమాచారం వరకు.. ఇలా అనేక సున్నిత వివరాలను వీరు శత్రు దేశంతో పంచుకున్నారని ఎస్‌బీయూ వెల్లడించింది. ఈ ఇద్దరు అనుమానితులు ఉక్రెయిన్ జెండా ముందు కూర్చొని.. తాము మాస్కోతో కలిసి పనిచేశామని చెబుతున్నట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. గోప్యత స్థాయి, సమాచార ప్రాధాన్యాన్ని బట్టి రష్యా వారికి ఒక్కో పనికి రెండు వేల డాలర్ల నుంచి 15 వేల డాలర్ల వరకు చెల్లించిందని ఎస్‌బీయూ తెలిపింది. పట్టుబడిన ఇద్దరిలో ఒకరు మొత్తం 33 వేల డాలర్లు అందుకున్నట్లు చెప్పగా, మరొకరు 27 వేలు అందుకున్నట్లు తెలిపాడు. ‘కిరీవ్’ అనే కోడ్ నేమ్ కలిగి ఉన్న వ్యక్తి.. తాను 2016 నుంచి మాస్కోకు సహకరిస్తున్నానని చెప్పగా.. మరొకరు 2019 నుంచి అని వెల్లడించారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై రష్యా స్పందించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని