Canada: నిజ్జర్‌ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!

ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్యకు సంబంధించిన కీలక సమాచారం అమెరికా నుంచే కెనడాకు చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు నిజ్జర్‌ విషయంలో భారత్‌ తప్పుపడుతూ జీ7 విదేశాంగ మంత్రుల చేత తీర్మానం చేయించాలన్న కెనడా యత్నం నీరుగారిపోయింది. 

Published : 24 Sep 2023 15:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్‌ హత్యకు సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్‌ సమాచారం అమెరికా నుంచే కెనడా(Canada)కు అందినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక కథనం ప్రచురించింది. ఆ తర్వాత కెనడా ఈ ఇంటెలిజెన్స్‌కు అదనపు సమాచారం సమకూర్చుకొన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్లలోకి చొరబడి సేకరించిన సమాచారం కచ్చితమైన ఆధారంగా మారిందని పేర్కొంది. ఈ క్రమంలోనే భారత్‌  ఈ దర్యాప్తునకు సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పిలుపునిచ్చారని సదరు పత్రిక వెల్లడించింది. 

ఫైవ్‌ఐస్‌ గ్రూప్‌లో సభ్యదేశమైన కెనడాతో సాధారణంగానే అమెరికా చాలావరకు ఇంటెలిజెన్స్‌ను పంచుకొంటుంది. ఇది భారీ మొత్తం ఇంటర్‌సెప్టెడ్‌ కాల్స్‌, ఇతర మార్గాల్లో సేకరించిన సమాచారం ఉంటుంది. వీటిల్లో అమెరికా ఉద్దేశపూర్వకంగానే నిజ్జర్‌ హత్యకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ కూడా చొప్పించి కెనడాకు అందజేసింది.

చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!

ఈ అంశంపై మాట్లాడేందుకు శ్వేతసౌధం అధికారులు సిద్ధంగా లేరు. ఎందుకంటే మిత్రదేశమైన కెనడాకు సహకరించాలని ఉన్నా.. భారత్‌ను దూరం చేసుకొనే పరిస్థితి లేదు.  మరోవైపు తాము సేకరించిన సమాచారం విడుదల చేసేందుకు కెనడా ప్రభుత్వం , అధికారులు సిద్ధంగా లేరు. రాయల్‌ కెనేడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ సర్వీసు ఇన్వెస్టిగేషన్‌ను ఇది దెబ్బతీస్తుందని వారు చెబుతున్నారు. 

జీ7లో నిజ్జర్‌ పంచాయతీ వద్దు..: జపాన్‌

ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య నిందను భారత్‌పై రుద్దాలని కెనడా చేసిన పయత్నాలు బెడిసికొట్టాయి.  ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సైడ్‌లైన్స్‌లో ఇటీవల జీ7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌నకు జపాన్‌ అధ్యక్షత వహిస్తోంది. ఇక్కడ కూడా భారత్‌పై ప్రకటన ఇప్పించడంలో కెనడా విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రష్యా, చైనా, ఇండో-పసిఫిక్‌, ఉత్తర కొరియా, నైగర్‌ అంశాలపై మాత్రమే స్పందించింది. కానీ, భారత్‌ విషయంపై నోరు మెదపలేదు. ఇక్కడి సంయుక్త ప్రకటనలో ఉగ్రవాది నిజ్జర్‌ హత్య అంశాన్ని ఖండించే విషయాన్ని చేర్చాలని కెనడా చేసిన లాబీయింగ్‌ విఫలమైంది.  జీ7లోని కీలక దేశాలు కెనడా అభ్యర్థనకు బ్రేకులేశాయి. దీంతో ఈ అంశం లేకుండానే సంయుక్త ప్రకటన వెలువడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని