China: చైనాలో లక్షల సంఖ్యలో ఖాళీ ఇళ్లు..!

చైనాలో ఖాళీ ఇళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో ఆ ఇళ్లను నింపాలంటే దేశ జనాభా 140 కోట్ల మంది సరిపోరని చైనా స్టాటిస్టిక్స్‌ బ్యూరో మాజీ సీనియర్‌ అధికారి వెల్లడించారు.   

Updated : 24 Sep 2023 17:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China)లో గృహ సంక్షోభం ఆందోళనకర స్థాయికి చేరుకొంది. ఇది ఎంతగా అంటే.. అక్కడ జనాభా కంటే ఇళ్లే అధికంగా ఉన్నాయంటున్నారు. లక్షల సంఖ్యలో ఖాళీ గృహాలు దర్శనమిచ్చే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని చైనాలోని ఓ మాజీ అధికారి వెల్లడించారు. 

ఒకప్పుడు చైనా(China)లో స్థిరాస్తి రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంది. కానీ, 2021లో ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభంలో పడిన నాటి నుంచి ఈ రంగం తీవ్ర ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. అనంతరం కంట్రీ గార్డెన్‌ హోల్డింగ్స్‌ వంటి సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆగస్టు చివరి నాటికి దేశంలో 700 కోట్ల చదరపుటడుగుల నిర్మాణాలు  విక్రయం కాకుండా మిగిలిపోయాయని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ వెల్లడిస్తున్నాయి. 

ఒక్కో ఇంటిని సగటున 90 చదరపు మీటర్లు (970 ఎస్‌ఎఫ్‌టీ) లెక్కన చూస్తే ఇవి సుమారు 72 లక్షల ఇళ్లకు సమానం. వీటిల్లో ఇప్పటికే అమ్ముడుపోయినా.. నగదు సమస్య కారణంగా పూర్తికానివి, 2016లో స్పెక్యూలేషన్‌ పెరిగిన సమయంలో కొనుగోలు చేసి ఖాళీగా ఉన్న ప్రాజెక్టులను చేర్చలేదు. ఇక్కడ ఉన్న మొత్తం ఇళ్ల ఖాళీల విషయంలో నిపుణుల అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఈ పరిస్థితిపై చైనా స్టాస్టిక్స్‌ బ్యూరో మాజీ డిప్యూటీ హెడ్‌ హెకెంగ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం చైనాలో ఉన్న ఇళ్లు 300 కోట్ల మంది నివసించడానికి సరిపోతాయని అభిప్రాయపడ్డారు. అతడు దక్షిణ చైనాలోని డాంగ్యూన్‌ నగరంలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

కెనడా అడుగు ఎటో!

ఆకాశహర్మ్యాలతో నిర్మించిన కొత్త పట్టణాలు చైనాలో ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పశ్చిమదేశాల మీడియాలు వీటిని తరచూ ఘోస్ట్‌ సిటీ (దెయ్యపు నగరం)లుగా వెక్కిరిస్తుంటాయి. చైనాలో 1970ల్లో ప్రజలు వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు మారడం మొదలుపెట్టారు. అదే సమయంలో పట్టణీకరణ, నిర్మాణ రంగాలు ఊపందుకున్నాయి. దీంతో అప్పటి వరకు 18శాతం మాత్రమే ఉన్న పట్టణ జనాభా గతేడాదికి 64శాతానికి చేరింది. ఇక్కడ కోటి మందికిపైగా ఉన్న నగరాలు 10 వరకు ఉన్నాయి. పట్టణ జనాభా పెరుగుతుండటంతో స్థానిక ప్రభుత్వాల ఆదాయం కూడా బాగా పెరిగింది. పన్నులు, భూవిక్రయాలు, వ్యాపారాలపై పన్ను రూపంలో భారీగా సమకూరుతోంది. స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ వాటా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వేగంగా నిర్మాణాలు చేపట్టాయి. ప్రైవేటు సంస్థలు ఇదే బాటలో పనిచేశాయి. చైనా జీడీపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 29శాతం వాటా రియల్‌ ఎస్టేట్‌ రంగానిదే. ఈ క్రమంలో స్థిరాస్తి రంగం బుడగ వలే పెరుగుతూ పోయింది. ఫలితంగా ఈ రంగంలో నిర్మాణాలతోపాటు స్పెక్యూలేషన్‌ కూడా పెరిగిపోయింది. దీంతో సంపన్న చైనీయులు ఇళ్లను కొనుగోలు చేసి ఖాళీగా ఉంచుతున్నారు. ఫలితంగా చాలా ప్రావిన్స్‌లలో వరుసగా ఖాళీగా ఉన్న ఆకాశహర్మ్యాలు కనిపిస్తుంటాయి. కంగ్‌బాషి, తియాంజెన్‌లో బిన్హయి న్యూ ఏరియా, జాంగ్జూలోని జెంగ్‌డాంగ్‌ న్యూడిస్ట్రిక్ట్‌, ఖష్గర్‌ వీఘర్ల కోసం నిర్మించిన కాలనీలు, ఇన్నర్‌ మంగోలియాలోని క్వింగ్స్‌హుయి, యునాన్‌ ప్రావిన్స్‌లోని చెంగాంగ్‌ ప్రాజెక్టు వంటివి ప్రపంచ వ్యాప్తంగా ఘోస్ట్‌ సిటీలుగా పేరు తెచ్చుకున్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం వరకు చైనాలో దాదాపు 20శాతం నిర్మాణాలు ఖాళీగా ఉన్నట్లు ఎన్‌పీఆర్‌.ఓఆర్‌జీ  పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని