USA: భారత్‌లో పర్యటించేటప్పుడు జాగ్రత్త.. పౌరులకు అమెరికా హెచ్చరిక

నేరాలు, ఉగ్రవాద ముప్పు దృష్ట్యా భారత్‌లో పర్యటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అమెరికా తన పౌరులకు సూచించింది. ముఖ్యంగా జమ్మూ-కశ్మీర్‌కు మాత్రం వెళ్లొద్దని హెచ్చరించింది.

Updated : 08 Oct 2022 09:09 IST

నేరాలు, ఉగ్రవాద దాడులు జరగొచ్చు

వాషింగ్టన్‌: నేరాలు, ఉగ్రవాద ముప్పు దృష్ట్యా భారత్‌లో పర్యటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అమెరికా తన పౌరులకు సూచించింది. ముఖ్యంగా జమ్మూ-కశ్మీర్‌కు మాత్రం వెళ్లొద్దని హెచ్చరించింది. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులకు 10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లోనూ పర్యటించొద్దని, అక్కడ సైనిక ఘర్షణకు ఆస్కారం ఉందని తెలిపింది. ‘‘తమ దేశంలో అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని భారత అధికారులు చెబుతున్నారు. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని వారు తెలిపారు’’ అని వివరించింది. పర్యాటక ప్రదేశాలు, రవాణా హబ్‌లు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, ప్రభుత్వ ప్రాంగణాలపై ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరిక లేకుండానే దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి బెంగాల్‌లోని పశ్చిమ భాగం వరకూ విస్తరించిన ప్రాంతంలో తన పౌరులకు అత్యవసర సేవలు అందించే సామర్థ్యం అమెరికా ప్రభుత్వానికి చాలా పరిమితంగా ఉంటుందని వివరించింది. తమ ఉద్యోగులు అక్కడికి వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం అమెరికా విదేశాంగ శాఖ కొత్తగా ప్రయాణ సూచనలను జారీ చేసింది. అయితే భారత్‌లో ముప్పు స్థాయిని ‘లెవల్‌-2’కు తగ్గించింది. లెవల్‌-4ను గరిష్ఠ స్థాయిగా పరిగణిస్తారు. అంతకుముందు పాక్‌ను లెవల్‌-3లో అమెరికా ఉంచింది. ఆ దేశాన్ని సందర్శించే అంశంపై పునరాలోచన చేయాలని తన పౌరులకు సూచించింది. ముఖ్యంగా కల్లోలిత ప్రావిన్స్‌లకు వెళ్లవద్దని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని