జహీరాబాద్‌లో కదం తొక్కిన చెరకు రైతులు

ప్రధానాంశాలు

జహీరాబాద్‌లో కదం తొక్కిన చెరకు రైతులు

ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారాన్ని తెరవాలని డిమాండ్‌

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సమీపంలోని ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారాన్ని తెరిచి, సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని చెరకు రైతులు, వివిధ సంఘాలు, పార్టీల నేతలు హెచ్చరించారు. బుధవారం కర్మాగారం జోన్‌ పరిధిలోని మండలాలతోపాటు వికారాబాద్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అన్నదాతలకు విద్యార్థి, యువజన, వ్యాపార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కాంగ్రెస్‌, భాజపా, సీపీఎం, సీపీఐ, ఎంఐఎంలు మద్దతు ప్రకటించడంతో సంపూర్ణ బంద్‌ జరిగింది. వీరంతా 65వ నంబర్‌ జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ కూడలిలో బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు, పలు పార్టీల నాయకులు మాట్లాడారు. సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని చాలా కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెరకు పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. కొన్నేళ్లపాటు బిల్లుల చెల్లింపులో జాప్యం చేసిన ట్రైడెంట్‌ యాజమాన్యం కిందటేడాది(సీజన్‌) నుంచి గానుగ ఆడించకుండా పూర్తిగా మూసివేసి.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ సీజన్‌లోనైనా చెరకును గానుగాడించి సకాలంలో బిల్లులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం గానుగ చేపట్టకపోతే కర్మాగారాన్ని రైతులకు అప్పగించడమో లేదా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవడమో చేయాలని కోరారు. సమస్యను త్వరగా పరిష్కరించకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్లను, ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని