పీఎం కేర్స్‌ ప్రభుత్వ నిధి కాదు

ప్రధానాంశాలు

పీఎం కేర్స్‌ ప్రభుత్వ నిధి కాదు

విరాళాలు దేశ ఖజానాలో జమ కావు : పీఎంవో స్పష్టీకరణ

దిల్లీ హైకోర్టులో ప్రమాణపత్రం

దిల్లీ: ‘పీఎం కేర్స్‌ ఫండ్‌’ కేంద్ర ప్రభుత్వ నిధి కాదు. ఇందుకోసం వసూలు చేసే నిధులు భారత సంచిత నిధిలో జమ కావు. ఈ విషయాలను స్పష్టం చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారి ఒకరు గురువారం దిల్లీ హైకోర్టులో ప్రమాణ పత్రం సమర్పించారు. పీఎం కేర్స్‌ ట్రస్టులో గౌరవపూర్వక విధులు నిర్వర్తిస్తున్న పీఎంవో అండర్‌ సెక్రటరీ ప్రదీప్‌ కుమార్‌ శ్రీవాత్సవ ఈ వివరాలను వెల్లడించారు. పీఎం కేర్స్‌ను సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ సమ్యక్‌ గంగ్వాల్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.ఎన్‌.పటేల్‌, జస్టిస్‌ అమిత్‌ బన్సల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. పిటిషన్‌కు సమాధానంగా ఈ ప్రమాణ పత్రాన్ని అందజేశారు.

‘‘పారదర్శకత కోసమే వివరాలు అడుగుతున్నానని పిటిషన్‌దారు చెబుతున్నందున పీఎం కేర్స్‌ అన్నది రాజ్యాంగంలోని 12వ అధికరణం ప్రకారం ‘రాజ్యం’ అన్న నిర్వచనం పరిధిలోకి వస్తుందా? రాదా?.. సమాచార హక్కు చట్టం ప్రకారం ఇది ‘ప్రభుత్వ సంస్థ’ అవునా? కాదా? అన్న దానితో ఆయనకు సంబంధం లేదు. దాని స్థాయి ఏదయినప్పటికీ విరాళాలు ఇచ్చిన వ్యక్తుల వివరాలను వెల్లడించబోం. విరాళాలన్నీ ఆన్‌లైన్‌ చెల్లింపులు, చెక్కులు, డిమాండు డ్రాఫ్టుల ద్వారానే జరుగుతున్నాయి. అన్ని ధార్మిక సంస్థల మాదిరిగానే పారదర్శకత కోసం ఆడిట్‌ నివేదికను, ఆదాయ-వ్యయ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాం. కాగ్‌ సూచించిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ ద్వారానే ఆడిట్‌ జరుగుతోంది. ఈ ట్రస్టును రాజ్యాంగం ప్రకారం గానీ, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రత్యేక చట్టాల ద్వారా గానీ ఏర్పాటు చేయలేదు’’ అని పేర్కొన్నారు.

‘ప్రధాన మంత్రి’ అనే ఎందుకు?

ఈ వాదనలను ఖండిస్తూ సమ్యక్‌ గంగ్వాల్‌ తరఫు న్యాయవాది పత్రాలను సమర్పించారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడానికి 2020 మార్చి 27న పీఎం కేర్స్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ప్రభుత్వ సంస్థ కానప్పుడు ప్రధాని ఫొటోను, దేశ అధికారిక చిహ్నాన్ని, ‘గవ్‌’ అన్న వెబ్‌సైట్‌ డొమైన్‌ను ఉపయోగించడాన్ని మానుకోవాలని అన్నారు. ప్రధాని, రక్షణ మంత్రి, హోం మంత్రి, ఆర్థిక మంత్రులు దీని ధర్మకర్తలుగా ఉన్నారని తెలిపారు. దీన్ని ఏర్పాటు చేసిన సమయంలో కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్టుగా ఉన్నతాధికారులు అభిప్రాయం కలిగించారని పేర్కొన్నారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 27కు వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని