TS News: యాదాద్రి గర్భాలయ ద్వారాలకూ స్వర్ణ తాపడం

ప్రధానాంశాలు

TS News: యాదాద్రి గర్భాలయ ద్వారాలకూ స్వర్ణ తాపడం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పంచ నారసింహ పుణ్యక్షేత్ర అభివృద్ధి పనుల్లో భాగంగా గర్భగుడి ప్రధాన ద్వారాలనూ స్వర్ణమయం చేస్తున్నారు. 17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పుతో టేకు కలపతో ఏర్పాటు చేసిన రెండు తలుపులకు బంగారు తాపడం చేసే పనులు పూర్తికావొచ్చాయి. ఆలయానికి చెందిన 16 కిలోల బంగారంతో చెన్నైలోని స్మార్ట్‌ క్రియేషన్స్‌  ఆధ్వర్యంలో స్వర్ణ కళాకారులు తొడుగులు రూపొందిస్తున్నారు. రెండు తలుపులపై ఆధ్యాత్మికత ఉట్టిపడేలా 28 పద్మాలు, 14 నారసింహ రూపాలు, ద్వారానికి ఇరువైపులా జయవిజయులు, శంఖం, చక్రం, తిరునామాలు, 36 గంటలను తీర్చిదిద్దారు. తుదిమెరుగులు దిద్దాల్సిన ఈ స్వర్ణ ద్వారాలను సీఎం కేసీఆర్‌ మంగళవారం పరిశీలించారు.

100 ఎకరాల యాగ స్థలం ఎంపిక
యాదాద్రి ఆలయ ఉద్ఘాటన తేదీ ఖరారైన నేపథ్యంలో మహా సంప్రోక్షణ నిర్వహణపై యాడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిర్వహించే సుదర్శన మహా యాగం కోసం కొండ కింద ఉత్తర దిశలో సుమారు 100 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది. ఈ ప్రాంగణాన్ని చదును చేసి యాగ నిర్వాహకులకు అప్పగించనున్నారు. ఉద్ఘాటనకు సంబంధించిన ఏర్పాటపై హైదరాబాద్‌లో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి యాడా యంత్రాంగంతో గురువారం సమావేశం నిర్వహించనున్నారు.


విమానగోపురానికి మరో 11 కిలోల బంగారం
6 కిలోలు ప్రకటించిన మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ
మరో ముగ్గురు దాతలు 5 కిలోలు..

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం బుధవారం దాతలు మరో 11 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మేఘా ఇంజినీరింగ్‌,  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ఆరు కిలోల బంగారం ఇస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే సదరు బంగారం లేదా అందుకు సమానమైన నగదును చెక్కు రూపంలో అందజేస్తామని సంస్థ డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ కామిడి నర్సింహారెడ్డి రెండు కిలోలు, ప్రణీత్‌ గ్రూప్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నరేంద్ర కుమార్‌ కామరాజు రెండు కిలోలు, ప్రముఖ వ్యాపారవేత్త ఎన్‌.వి.రామరాజు జలవిహార్‌ పక్షాన ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తామని బుధవారం ప్రకటించారు.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని