ఒక డిపాజిట్‌దారుడికి ఒక క్లెయిమ్‌కే అర్హత

ప్రధానాంశాలు

ఒక డిపాజిట్‌దారుడికి ఒక క్లెయిమ్‌కే అర్హత

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏపీ ప్రభుత్వ నిబంధన

ఈనాడు, అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితుల్లో ఒక డిపాజిట్‌దారుడు ఒక క్లెయిమ్‌ పొందేందుకు మాత్రమే అర్హులని ప్రభుత్వం నిబంధన విధించింది. రూ.10 వేలు-రూ.20 వేలు మధ్య డిపాజిట్‌ చేసిన వారికి ఈ నెల 24న ముఖ్యమంత్రి చేతులు మీదుగా చెల్లిస్తామని ప్రకటించింది. రూ.10 వేల లోపు డిపాజిట్లకు సంబంధించి గతంలో లబ్ధి పొందిన బాధితులు ప్రస్తుతం సాయం పొందేందుకు అనర్హులని షరతు విధించింది. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఎలాంటి నగదు సాయమూ పొందని వారు మాత్రమే తాజా సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం బుధవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది.

అగ్రిగోల్డ్‌లో రూ.10 వేలు-రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులు సంబంధిత ఒరిజినల్‌ పత్రాలు, చెక్కు, పే ఆర్డరు, రసీదులు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డులు తీసుకొని వెళ్లి గ్రామ, వార్డు సచివాలయాల్లో  ఈ నెల 6 నుంచి 12 మధ్య నమోదు చేయించుకోవాలని సీఐడీ కోరింది. బాధితుల ఖాతాల్లోనే వారికి చెల్లించాల్సిన నగదు జమచేస్తామంది. సందేహాలుంటే 18004253875 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయవచ్చు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని