తరుగు పేరిట రైతులకు అన్యాయం

ప్రధానాంశాలు

తరుగు పేరిట రైతులకు అన్యాయం

తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ ఆందోళన

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: యాసంగి ధాన్యం కొనుగోలులో తరుగు పేరిట రాష్ట్ర రైతులు అన్యాయానికి గురవుతున్నారని తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. విషయం ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోనందునే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎర్రమంజిల్‌లోని పౌరసరఫరాల భవన్‌ వద్ద బుధవారం ధర్నా జరిగింది. తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చినప్పటి నుంచి మిల్లుల్లో దించే దాకా రైతే భారం భరించాల్సి వస్తోందన్నారు. అక్కడ నిల్వ చేసిన ధాన్యం వర్షం వల్ల పాడైనా నష్టం రైతే భరించిన ఉదంతాలు ఉన్నాయన్నారు. ప్రతి లారీకి రూ.20వేల నుంచి రూ.30వేల దాకా మిల్లర్లు తరుగు పేరుతో తీసుకుంటున్నారని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా చిల్కూర్‌, నిజామాబాద్‌ జిల్లా నల్లవెల్లి, వికారాబాద్‌ జిల్లా పుట్టపహాడ్‌ తదితర కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే అధికారులు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై విచారణ జరపాలని, అవినీతిలో పాలు పంచుకున్న అధికారులు, మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అందోళనకు దిగిన నేతలను అరెస్టు చేసిన పోలీసులు తర్వాత వదిలిపెట్టారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని