ఇద్దరూ ఇద్దరే... మరి సర్దరే?
close
Published : 04/03/2020 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇద్దరూ ఇద్దరే... మరి సర్దరే?

అక్క నా చాక్లెట్‌ మొత్తం తినేసింది చూడమ్మా... అని ఓ చెల్లెలు ఫిర్యాదు చేస్తే... మరి నాన్న తెచ్చిన కేక్‌ మొత్తం నువ్వు ఒక్కదానివే తిన్నప్పుడో... వెంటనే దీర్ఘాలు తీస్తుంది అక్క. అన్నయ్య నా పెన్సిల్‌ విరగొట్డాడని తమ్ముడు అంటే, తమ్ముడే తన నోట్‌బుక్‌ చింపేశాడని అన్నయ్య వాదిస్తాడు...
అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఇలాంటి ఫిర్యాదులు సాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి. ఈ చిన్నచిన్న తగాదాలను పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే అవి మరింత పెరిగి పెద్దవవుతాయి. వాళ్లు పెద్దవాళ్లయినా ఆ తేడాలు అలాగే ఉండిపోతాయి. అవి అనవసర మనస్పర్థలకూ దారితీస్తాయి. చిన్నతనంలో తోబుట్టువుల మధ్య గొడవలు రావడం సహజమే కానీ అవి నిరంతరం కొనసాగుతూ ఉండకూడదు. ఈ గొడవలు మరీ ఎక్కువైతే ప్రశాంతమైన కుటుంబ వాతావరణం కాస్తా కలుషితమవుతుంది కూడా.
కారణమేంటి?
పిల్లల మధ్య జరిగే ఈ గొడవలకు అసలు కారణం ఏంటో కనుక్కోవాలి. పిల్లల్లో మీరు ఎవరికి ఎక్కువగా మద్దతు ఇస్తున్నారో చూడాలి. మీరు ఎప్పుడూ ఒకరికే మద్దతు ఇస్తే రెండో వారికి మీ మీద అకారణంగా ద్వేషం పెరుగుతుంది. రెండోవాళ్లు మీరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తారు. ఉదాహరణకు మీ పిల్లల్లో ఒకరు టీనేజ్‌లోకి అడుగుపెట్టారనుకుందాం. అప్పుడు వాళ్లను పెద్దవాళ్లుగా పరిగణించాలిగానీ అయిదారేళ్ల పిల్లలతో సమానంగా చూడకూడదు. వాళ్ల ఎదుగుదలను గుర్తించి సలహాలు, సూచనలు ఇవ్వాలి. అప్పుడు వాళ్లు కాస్త సంతృప్తి చెందుతారు. అలాగని పూర్తిగా పెద్ద పిల్లల మాటలనే నమ్మకూడదు. గొడవ జరిగినప్పుడు ఇద్దరి వాదనలనూ విన్న తర్వాతే మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి.
పోల్చొద్దు
పిల్లలను ఒకరితో మరొకర్ని పోల్చడం ఎంత మాత్రం సరికాదు. మీరు ఇప్పటికే పోల్చి చూస్తున్నట్లయితే ఆ ధోరణిని వెంటనే ఆపేయండి. పిల్లలు.. ఎవరికి వాళ్లే ప్రత్యేకం. చదువు విషయంలో ఒకరు ముందు ఉండొచ్చు. అలాంటప్పుడు మరొకరిని నేర్చుకోమని పోల్చి చూడకూడదు. మిగతా వారికి దేంట్లో నైపుణ్యం ఉందో గుర్తించి, దాన్ని ప్రోత్సహించాలి. ఒకరు క్లాస్‌ఫస్ట్‌ వస్తే మిగతావారినీ అలాగే రావాలని ఒత్తిడి చేయడం మంచిదికాదు. అలా చేయడం వల్ల రెండోవారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. తానెందుకూ పనికిరానని కుంగుబాటుకు గురికావచ్చు. ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో గుర్తించి, వాటికి మెరుగులు దిద్దడానికి మీ వంతుగా ప్రయత్నించాలి.
సర్దుబాటు చేసుకోవాలి
గొడవలు మరీ ముదురుతున్నాయని భావించినప్పుడు మీరు కలగజేసుకోవాలి. పక్షపాత ధోరణి లేకుండా ఇద్దరి వాదనలూ వినాలి. ఇద్దరూ మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాలని చెప్పాలి. లేకపోతే ప్రతి విషయంలోనూ మీరు కలగజేసుకుని నిబంధనలు పెట్టాల్సి ఉంటుందనే విషయాన్ని సూటిగా చెప్పాలి. దాంతో వాళ్లలో వాళ్లే మాట్లాడుకుని గొడవను సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. గొడవల మీద కాకుండా పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరించడం మొదలుపెడతారు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని