చుండ్రుకు చెక్ పెట్టేద్దామిలా..! - henna hair packs to treat dandruff problem in telugu
close
Published : 18/06/2021 16:27 IST

చుండ్రుకు చెక్ పెట్టేద్దామిలా..!

సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, కేశాలు పూర్తిగా ఆరకముందే ముడివేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా చుండ్రు ఏర్పడి దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి, నిర్జీవంగా మారిపోవడం మాత్రం మామూలే! మరి, ఈ సమస్యకు మార్కెట్లో లభ్యమయ్యే హెన్నా పొడి (గోరింటాకు పొడి) ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందచ్చని మీకు తెలుసా?? ఇందుకోసం మనం చేయాల్సిందల్లా దీన్ని ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి హెయిర్‌ప్యాక్‌లు తయారుచేసి వేసుకోవడమే..! ఇంతకీ ఆ హెయిర్‌ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలి? అవి చుండ్రును తగ్గించి జుట్టును మెరిపించడంలో ఎలా దోహదం చేస్తాయి? రండి తెలుసుకుందాం..

పెరుగు, నిమ్మరసంతో..
చుండ్రు సమస్యను తగ్గించడంలో పెరుగు, నిమ్మరసం పాత్ర కూడా కీలకమే. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. ఆపై ఆ మిశ్రమంలో పెరుగు వేస్తూ పేస్ట్ అయ్యేంత వరకు ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసుకొని అరగంట పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారం లేదా పదిహేను రోజులకోసారి పాటించడం వల్ల క్రమంగా చుండ్రు తగ్గుముఖం పడుతుంది.

మందారంతో..
మందార ఆకులు, పువ్వులలో ఉండే గుణాలు జుట్టు సమస్యల్ని తగ్గించడంలో చక్కగా ఉపయోగపడతాయి. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో ఎండబెట్టి పొడి చేసిన మందార ఆకులు, పువ్వుల పొడిని కొద్దిగా వేసి, ఈ మిశ్రమానికి కాస్త ఉసిరి పొడి, మెంతుల పొడి కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా పెరుగు వేసుకుంటూ మృదువైన పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. అలాగే ఈ హెయిర్‌ప్యాక్ జుట్టు రాలడాన్ని తగ్గించడంలోనూ దోహదం చేస్తుంది.

మెంతులతో..
జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వీటిని కొన్ని హెయిర్ ప్యాక్‌లలో కూడా ఉపయోగిస్తుంటారు. చుండ్రును తగ్గించడానికి తయారుచేసుకొనే ప్యాక్‌లలో భాగంగా కూడా మెంతుల్ని వాడతారు. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడి, రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌స్పూన్ల పెరుగుతో పాటు ఒక్కో టేబుల్‌స్పూన్ చొప్పున ఆలివ్ నూనె, వెనిగర్, మెంతిపొడి.. వీటన్నింటినీ బాగా కలుపుకొని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసుకొని రెండుమూడు గంటల పాటు ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య నుంచి త్వరలోనే బయటపడే అవకాశం ఉంటుంది.

కోడిగుడ్డు ప్యాక్..
గుడ్డులోని తెల్లసొన జుట్టుకు పోషణనందించడంలో ఎంతగానో సహకరిస్తుంది. అంతేకాదు.. ఇది చుండ్రును తొలగించడానికీ ఉపయోగపడుతుంది. మూడు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడి, టేబుల్‌స్పూన్ ఆలివ్ నూనె, రెండు టేబుల్‌స్పూన్ల బాగా బీట్ చేసిన గుడ్డు తెల్లసొన.. ఈ మూడింటినీ ఒక బౌల్‌లో తీసుకొని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ మృదువైన పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసి 45 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే క్రమంగా చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.

మిరియాలతో..
కుదుళ్లలోని ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మిరియాలు చక్కటి పరిష్కారం చూపుతాయి. అంతేకాదు.. చుండ్రును తగ్గించడంలోనూ ఇది బాగా పనిచేస్తుంది. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర పేస్ట్, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కా తరచూ పాటించడం వల్ల త్వరలోనే చుండ్రు సమస్య తొలగిపోతుంది.

ఈ నూనెతో..
చుండ్రు సమస్యను తగ్గించడానికి ఆవనూనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం పావు లీటర్ ఆవనూనెను ఒక గిన్నెలో తీసుకొని వేడిచేయాలి. దాన్నుంచి పొగ వెలువడుతున్నప్పుడు స్టౌ కట్టేసి అందులో కొన్ని గోరింటాకులు, టీస్పూన్ మెంతుల్ని వేయాలి. ఇప్పుడు ఈ నూనెను పూర్తిగా చల్లారనిచ్చి వడకట్టుకొని గాలిచొరబడని సీసాలో భద్రపరచుకోవాలి. ఇలా తయారుచేసుకున్న నూనెను తలస్నానానికి ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి. ఆపై గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం లభిస్తుంది.

జుట్టు ఆరోగ్యానికీ..
జుట్టు ఆరోగ్యానికి దోహదం చేసే హెన్నా వాడకం ఈనాటిది కాదు.. పూర్వకాలం నుంచే దీన్ని పలు కేశ సంబంధిత సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. చుండ్రును తగ్గించడంలో కీలక పాత్ర పోషించే ఈ పదార్థం కేశాలకు సహజసిద్ధమైన రంగును అందించడంతో పాటు జుట్టును కండిషనింగ్ కూడా చేస్తుంది. అంతేకాదు.. ఇందులోని సహజసిద్ధమైన గుణాలు జుట్టుకు పోషణనందించి కేశాలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ పొడిలోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఇది పొడిబారిన జుట్టుకు తేమనందించడానికి, చివర్లు చిట్లే సమస్యను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.
హెన్నా వల్ల చుండ్రు తొలగిపోవడమే కాదు.. దానివల్ల జుట్టుకు చేకూరే ఇతర ప్రయోజనాలనూ తెలుసుకున్నారు కదా! అలాగని దీంతో తయారుచేసిన ప్యాక్‌లను మరీ ఎక్కువగా ఉపయోగించడం కూడా జుట్టు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే పొడి జుట్టు ఉన్న వారు ఈ ప్యాక్‌లు తొలగించుకున్న వెంటనే కండిషనర్ రాసుకోవడం మర్చిపోవద్దు. తద్వారా కేశాలు మరింత పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు.

అలాగే కొన్ని పదార్ధాలు సహజ సిద్ధంగా లభించేవే అయినా- కొంతమందికి  వివిధ కారణాల వల్ల శరీరానికి సరిపడకపోవచ్చు. ఇలాంటి సమస్య ఉన్నవారు మాత్రం - ఈ చిట్కాలను పాటించే విషయంలో వ్యక్తిగత సౌందర్య నిపుణులను సంప్రదించి వీటిని వాడడం మంచిది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని