రోజూ మస్కారా వాడుతున్నారా? - tips to put mascara everyday without harming your lashes in telugu
close
Published : 29/08/2021 12:43 IST

రోజూ మస్కారా వాడుతున్నారా?

వంపులు తిరిగిన కనురెప్పలు అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే వాటికి మస్కారాతో సొబగులద్దడం మనకు అలవాటే! అయితే వృత్తిలో భాగంగానే కావచ్చు.. లేదంటే మేకప్‌ వేసుకోవాలన్న కోరికతో కావచ్చు.. కొంతమంది అమ్మాయిలు రోజూ మస్కారా పెట్టుకుంటారు.. మరికొందరు మేకప్‌ వేసుకున్నా వేసుకోకపోయినా మస్కారాను మర్చిపోరు. ఏదేమైనా ఇలా రోజూ మస్కారాను ఉపయోగించడం వల్ల అందం మాటేమో గానీ పలు దుష్ప్రభావాలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే అప్పుడప్పుడూ వాడడం మంచిదంటున్నారు. ఒకవేళ రోజూ తప్పనిసరిగా పెట్టుకోవాల్సి వస్తే మాత్రం ఈ చిట్కాలు పాటించమంటున్నారు.

తేమనందించండి!

కనురెప్పలు చాలా సున్నితంగా ఉంటాయి. అలాంటి వాటికి రోజూ మస్కారా అప్లై చేస్తే వాటిలోని రసాయనాలు కనురెప్పల వెంట్రుకలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా అవి తేమను కోల్పోయి పొడిబారిపోతాయి. అలా జరగకూడదంటే మస్కారా పెట్టుకునే ముందు కనురెప్పల్ని మాయిశ్చరైజ్‌ చేయమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పెట్రోలియం జెల్లీ, జొజోబా నూనె, కొబ్బరి నూనె.. వంటివి రెప్పలకు అప్లై చేసి ఆ తర్వాత మస్కారా పెట్టుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకాకుండా ఉంటాయి.. రెప్పలు తేమను కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు. అయితే బాడీ లోషన్‌ వంటివి రెప్పలకు వాడకూడదన్న విషయం గుర్తుపెట్టుకోండి.

నాణ్యత ముఖ్యం!

తక్కువ ధరకు దొరుకుతుంది కదా అని ఏది పడితే అది కనురెప్పలకు అప్లై చేస్తే లేనిపోని కంటి సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది. అందుకే మంచి బ్రాండ్‌, నాణ్యత ఉన్న, కంటి పరంగా పరీక్షించి ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తేల్చిన (Ophthalmologically Tested), వాటర్‌ప్రూఫ్‌ మస్కారాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం లేబుల్‌ని చూసి తెలుసుకోవచ్చు.. లేదంటే నిపుణుల సలహా తీసుకోవచ్చు.

రుద్దకండి!

మస్కారా పెట్టుకోవడమే కాదు.. తొలగించే క్రమంలోనూ జాగ్రత్త వహించాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం మిసెల్లార్‌ వాటర్‌/మేకప్‌ రిమూవర్‌ని ఉపయోగించచ్చు. వీటిని కాటన్‌ బాల్‌పై వేసి.. దాంతో కనురెప్పలపై అద్దాలి.. ఈ క్రమంలో కళ్లు మూసుకోవడం మర్చిపోవద్దు.. లేదంటే మస్కారా కళ్ల లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత కాటన్‌ ప్యాడ్‌తో నెమ్మదిగా తుడిచేస్తే సరిపోతుంది. అలాకాకుండా తొలగించే క్రమంలో బలంగా రుద్దడం వల్ల కనురెప్పల వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది.

ఇవి గుర్తు పెట్టుకోండి!

* కనురెప్పలకు పోషణనందించడానికి, అవి పొడిబారకుండా చేయడానికి మస్కారా పెట్టుకునే ముందు మస్కారా ప్రైమర్‌ కూడా అప్లై చేయచ్చు. ఫలితంగా రెప్పలు ఒత్తుగా, అందంగా కనిపిస్తాయి.

* ఫార్మాల్డిహైడ్‌, సింథటిక్‌, టార్‌ డైస్‌.. వంటి పదార్థాలు ఉపయోగించి తయారుచేసిన మస్కారాలు అస్సలు వాడకూడదు.

* సాధారణంగా మేకప్‌ ఉత్పత్తుల్ని ఏడాదికోసారి మార్చాల్సి ఉంటుంది. అదే మస్కారానైతే ఆరు నెలలకోసారి మార్చమంటున్నారు నిపుణులు. అందుకే కొనే ముందే అవి ఎప్పుడు తయారయ్యాయి.. గడువు ఎప్పటి వరకు ఉంది.. వంటి విషయాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాల్సి ఉంటుంది.

* కనురెప్పలు ఒత్తుగా పెరగాలన్నా, మస్కారా ప్రభావం వాటిపై పడకుండా ఉండాలన్నా.. చక్కటి పోషకాహారం తీసుకోవడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ‘డి’, ‘ఇ’ విటమిన్లు అధికంగా లభించే చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు.. వంటివి రోజువారీ మెనూలో చేర్చుకోవాలి.

* మస్కారా కండిషనర్లు కూడా ప్రస్తుతం బయట దొరుకుతున్నాయి. వాటిలో నాణ్యమైనది ఎంచుకుంటే కనురెప్పల్ని తేమగా ఉంచుకోవచ్చు.. ఒత్తుగా పెరిగేలా చేయచ్చు.

* కేవలం మస్కారా మాత్రమే అప్లై చేసుకున్నప్పటికీ రాత్రి పడుకునే ముందు తొలగించుకోవడం మర్చిపోవద్దు.

* అలాగే మస్కారా బ్రష్‌లను కూడా వాడిన ప్రతిసారీ శుభ్రం చేయాల్సిందే! ఇదేం పెద్ద పని కాదు.. సింపుల్‌గా వాటిని టిష్యూతో తుడిచేస్తే సరిపోతుంది.

వీటితో పాటు విటమిన్లు ‘డి’, ‘ఇ’, బయోటిన్‌.. వంటి సప్లిమెంట్స్‌ కూడా వాడచ్చు. అయితే అది కూడా నిపుణుల సలహా తీసుకున్నాకే!

మరి, కనురెప్పల ఆరోగ్యం కోసం, మస్కారా అప్లై చేసుకునే ముందు మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి!మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని