ఇంటివైద్యం

ఆకలి వేసినా తినలేని పరిస్థితి. కొంచెం కారం లేదా పుల్లగా ఉండే ఆహారాన్ని తీసుకోలేకపోవడం. దీనికి కారణం నోట్లో పుండ్లు (నోటి అల్సర్). పదే పదే ఇబ్బంది పెట్టే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయంపై ఆ ప్రభావం పడుతుంది. సాధారణంగా ఈ పుండ్లు నాలుక, చిగుళ్లు, దవడ లోపలి భాగం, పెదవుల లోపలి వైపు ఏర్పడతాయి. ఆహారాన్ని తీసుకోవడానికి వీల్లేకుండా బాధిస్తాయి. ముందుగానే వాటిని గుర్తిస్తే తేలిగ్గా బయటపడొచ్చు. |
కారణాలు

నోటి శుభ్రత పాటించకపోవడం, విటమిన్ల లోపం, జీర్ణ సంబంధ సమస్యలు, నోట్లో ఇన్ఫెక్షన్లు, పోషకాహారం తీసుకోకపోవడం, మానసిక ఆందోళన, బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఈ సమస్యకు దారి తీస్తాయి. గాఢత ఎక్కువగా ఉన్న టూత్‌పేస్టులు వాడినా పుండ్లు వస్తాయి. విటమిన్-బి12, ఇనుము, ఫోలేట్, జింక్ వంటి పోషకాల లోపంతోనూ నోటి అల్సర్ రావొచ్చు. |
ఏం చేయాలి

ఆకు కూరలు, మొలకెత్తిన గింజలు (పెసలు, పచ్చి సెనగలు), తాజా పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. భోజనానికి ముందు రెండు చెంచాల నిమ్మరసాన్ని తాగితే జీర్ణమండలం మెరుగవుతుంది. కాఫీ, టీ, మసాలాలు, పచ్చళ్లు, శీతలపానీయాలు పూర్తిగా తగ్గించాలి. రోజూ నువ్వుల నూనెతో పుక్కిలించాలి. దీంతో పుండ్లు తగ్గుముఖం పడతాయి.
|
జాగ్రత్తలు

నిత్యం నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి. కరక్కాయను పొడి చేసి, గ్లాసు నీటిలో కలిపి, ఈ కషాయంతో ఉదయం, సాయంత్రం పుక్కిలించాలి. పటికను చిన్నచిన్న ముక్కలుగా చేసి మూకుడులో వేడి చేయాలి. ఇందులోని నీరంతా ఆవిరైపోయాక మెత్తని భస్మంలా చేసుకుని భద్రపరుచుకోవాలి. అరచెంచా పొడిని గ్లాసు నీటిలో కలిపి, దీంతో పుక్కిలిస్తే నోట్లో పుండ్లు తగ్గుతాయి. పేరిన నెయ్యిని అప్పుడప్పుడు ఈ పుండ్లపై రాస్తూ ఉంటే, ఉపశమనంగా ఉంటుంది. అరచెంచా యష్టి మధు చూర్ణం, అరచెంచా ఉసిరి చూర్ణాన్ని తేనెతో కలిపి మూడు పూటలు తీసుకున్నా ఫలితం ఉంటుంది.

మీ ప్రశ్నలు ఇకపై vasuayur@eenadu.net కు పంపించగలరు.
|