మీ సూచనలు, అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా మాకు పంపాల్సిన
చిరునామా:

ఐటీ అండ్‌ సైన్స్‌ డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం, హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
ith@eenadu.net

డ్రాప్‌బాక్స్‌ వాడితే...
క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసులు అనేకం!
వాటిల్లో డ్రాప్‌బాక్స్‌ ప్రత్యేకతే వేరు!
మరి, మీరు వాడుతున్నారా?
అయితే, ఫైల్‌ ఏదైనా సులువుగా డ్రాప్‌బాక్స్‌లోకి వచ్చేలా చేయవచ్చు!
అందుకో చిట్కా ఉంది!
క్లౌడ్‌ వేదికలపై ఫైల్స్‌ని షేర్‌ చేయాలంటే? ఇరువురూ ఏదైనా క్లౌడ్‌ సర్వీసులో సభ్యులై ఉండాల్సిందే అనుకుంటాం. కానీ, ఇరువురిలో ఎవరో ఒకరు సభ్యులై ఉంటే చాలు. ఇతరులు ఎకౌంట్‌ లేకుండానే చిటికెలో ఫైళ్లను షేర్‌ చేయవచ్చని తెలుసా? అందుకు డ్రాప్‌బాక్స్‌ సర్వీసులో ప్రత్యేక వెసులుబాటు ఉంది. అదే File Requests. క్లౌడ్‌ వేదికపై ఫైల్‌ షేరింగ్‌కి ఇదో వినూత్న పద్ధతి. డ్రాప్‌బాక్స్‌లో ఎకౌంట్‌తో పని లేకుండానే మీరు వాడుతున్న డ్రాప్‌బాక్స్‌ స్టోరేజ్‌లోకి ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేసి మీతో పంచుకోవచ్చు. ఉదాహరణకు స్నేహితులతో మీరో టూర్‌కి వెళ్లారు. అక్కడ మిత్రులతో బోల్డన్ని ఫొటోలు తీసుకున్నారు. అవన్నీ మీ డ్రాప్‌బాక్స్‌లోకి అప్‌లోడ్‌ చేయమని స్నేహితుడికి లింక్‌ రూపంలో ‘రిక్వస్ట్‌’ మెయిల్‌ పంపొచ్చు. స్నేహితుడికి డ్రాప్‌బాక్స్‌ ఎకౌంట్‌ లేకపోయినా మీరు పంపిన మెయిల్‌ ఓపెన్‌ చేసి ఫొటోలను అప్‌లోడ్‌ చేయవచ్చన్నమాట. ఇలా అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు సరాసరి డ్రాప్‌బాక్స్‌లో ప్రత్యేక ఫోల్డర్‌లో సేవ్‌ అవుతాయి. ఫొటోలు డ్రాప్‌బాక్స్‌లో సేవ్‌ అవ్వగానే మీకో మెయిల్‌ నోటిఫికేషన్‌ కూడా వచ్చేస్తుంది. మరి, ఈ ‘ఫైల్‌ రిక్వస్ట్‌’ సంగతులేంటో ఇంకాస్త వివరంగా చూద్దాం!
ఒకరు సభ్యులైతే చాలు...
‘ఫైల్‌ రిక్వస్ట్స్‌’ ఆప్షన్‌ని వాడుకుని డ్రాప్‌బాక్స్‌లో ఫైల్స్‌ని షేర్‌ చేయాలంటే? ఇరువురిలో ఎవరో ఒకరు ఎకౌంట్‌ క్రియేట్‌ చేయాలి. 2జీబీ ఉచిత స్పేస్‌తో ఎకౌంట్‌ వస్తుంది. హోం పేజీలో విభాగాల వారీగా డేటాని మేనేజ్‌ చేయవచ్చు. అప్‌లోడ్‌ చేసిన అన్ని ఫైల్స్‌ని Filesమెనూలో చూడొచ్చు. ఫొటోలకు ప్రత్యేక విభాగం ఉంది. డ్రాప్‌బాక్స్‌ నుంచి ఇతరులతో షేర్‌ చేసిన వాటిని Sharing మెనూలో యాక్సెస్‌ చేయవచ్చు. ఇతరులకు షేర్‌ చేయడానికి క్రియేట్‌ చేసిన లింక్‌లను Linksవిభాగంలో చూడొచ్చు. ఇక కొత్తగా మెనూ జాబితాలోకి వచ్చి చేరిందే File Requests. ఇదో అరుదైన సౌకర్యం. క్లౌడ్‌ స్టోరేజ్‌ హద్దుల్ని చెరిపేస్తూ వినూత్న పద్ధతిలో ఫైల్‌ షేరింగ్‌కి తెర తీసింది. హోం మెనూలోని ఫైల్‌ రిక్వస్ట్స్‌పై క్లిక్‌ చేస్తే Create a file request ఆప్షన్‌తో పేజీ వస్తుంది. క్లిక్‌ చేసి మీరు ఆశిస్తున్న ఫైల్‌.... డ్రాప్‌బాక్స్‌లో సేవ్‌ అవ్వాల్సిన లొకేషన్‌ని నిర్ణయించాలి. కొత్త ఫోల్డర్‌ని క్రియేట్‌ చేద్దాం అనుకుంటే Change Folder ఆప్షన్‌ ఉంది. ఎంపిక ప్రక్రియ ముగిశాక Nextక్లిక్‌ చేయాలి. దీంతో ప్రత్యేక లింక్‌ వస్తుంది. దాని కిందే మీరు ఎవరి నుంచి ఫైల్స్‌ని ఆశిస్తున్నారో వారి మెయిల్‌ ఐడీ టైప్‌ చేసి పంపేయాలి. ఇంకేముందీ... మెయిల్‌ అందుకున్న వ్యక్తి Upload Filesఆప్షన్‌తో ఫైల్స్‌ని డ్రాప్‌బాక్స్‌లోకి అప్‌లోడ్‌ చేయవచ్చు. అన్ని ఫైల్స్‌ అప్‌లోడ్‌ అవ్వగానే రిక్వస్ట్‌ పంపిన వ్యక్తికి అప్‌డేట్‌ చేరిపోతుంది. డ్రాప్‌బాక్స్‌ ఓపెన్‌ చేసి ఫైల్స్‌ చెక్‌ చేయవచ్చు. అదే ఫోల్డర్‌లోకి ఇతర వ్యక్తుల నుంచి డేటా కావాలంటే Add People సెలెక్ట్‌ చేసి తిరిగి ఫైల్‌ రిక్వస్ట్‌ పంపొచ్చు. ఉచిత ఎకౌంట్‌లో 2జీబీ ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయవచ్చు. ఒకవేళ మీరు డ్రాప్‌బాక్స్‌ ప్రీమియం వెర్షన్‌ వాడుతున్నట్లయితే 10 జీబీ వరకూ పంపొచ్చు. నలుగురు కలిసి బృందంగా ఏర్పడి ప్రాజెక్ట్‌ వర్క్‌ చేస్తున్నప్పుడు డేటాని సులువుగా షేర్‌ చేసేందుకు ‘ఫైల్‌ రిక్వస్ట్స్‌’ అనుకూలమైంది.

మరో మార్గం...
డ్రాప్‌బాక్స్‌లోకి మరింత సులువుగా ఇతరుల నుంచి ఫైల్స్‌ని స్వీకరించేందుకు మరో వినూత్నమైన వేదిక సిద్ధంగా ఉంది. అదే Balloon.ఇదో థర్డ్‌పార్టీ వెబ్‌ సర్వీసు. డ్రాప్‌బాక్స్‌తో కలిసి పని చేస్తుంది. నెట్టింట్లో ఎవరి నుంచైనా డ్రాప్‌బాక్స్‌లోకి ఫైల్‌ షేర్‌ అయ్యేలా చేయవచ్చు. సర్వీసుని వాడుకోవాలంటే డ్రాప్‌బాక్స్‌ లాగిన్‌ వివరాలతో సభ్యులవ్వాలి. అందుకు హోం పేజీలోని ‘లాగిన్‌’పై క్లిక్‌ చేయండి. డ్రాప్‌బాక్స్‌ నుంచి అనుమతి తీసుకున్నాక ప్రత్యేక Balloonయూజర్‌నేమ్‌తో లింక్‌ని క్రియేట్‌ చేసుకోవాలి. ఆ లింక్‌ని షేర్‌ చేసి ఇతరుల నుంచి ఫైల్స్‌ని డ్రాప్‌బాక్స్‌లోకి స్వీకరించొచ్చు. ఉదాహరణకు https:// balloon.io/username పేరుతో క్రియేట్‌ చేసిన లింక్‌ని ఎవరికైనా షేర్‌ చేయవచ్చు. ఫైల్‌ని డ్రాప్‌బాక్స్‌లోకి పంపాలనుకునే వారు లింక్‌ని క్లిక్‌ చేస్తే బుడగ గుర్తుతో పేజీ వస్తుంది. పేజీలో ఎక్కడైనా క్లిక్‌ చేసి వచ్చిన డైలాగ్‌ బాక్స్‌తో సిస్టంలోని ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయవచ్చు. అప్‌లోడ్‌ ప్రోగ్రస్‌ ముగియగానే ఫైల్‌ డ్రాప్‌బాక్స్‌లో Apps->Balloon.ioఫోల్డర్‌లో చేరిపోతుంది. ఒక్కసారి క్రియేట్‌ చేసిన లింక్‌ని మార్చాలి అనుకుంటే ‘ఎడిట్‌’ ఆప్షన్‌ ఉంది. లింక్‌ని కావాలంటే డిలీట్‌ చేయవచ్చు కూడా.New Balloonబటన్‌పై క్లిక్‌ చేసి మరో కొత్త లింక్‌ని క్రియేట్‌ చేసుకునే వీలుంది.

వెబ్‌ సర్వీసు లింక్‌: https:// balloon.io

  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif