Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: ప్యాడ్‌మ్యాన్‌

సినిమా పేరు: ప్యాడ్‌మ్యాన్‌(హిందీ)

నటీనటులు: అక్షయ్‌కుమార్‌, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ తదితరులు

సంగీతం: అమిత్‌ త్రివేది

సినీమాటోగ్రాఫర్‌: పీసీ శ్రీరామ్‌

కూర్పు: చందన్‌ అరోరా

నిర్మాతలు: ట్వింకిల్‌ ఖన్నా, అనిల్‌ నాయుడు

దర్శకత్వం: ఆర్‌.బాల్కీ

విడుదల తేదీ: 09-02-2018

రవేగంగా సినిమాలు చేయడం అక్షయ్‌కుమార్‌ శైలి. అందులోనూ సామాజిక అంశాలు, నిజ జీవిత సంఘటనలపై దృష్టిపెట్టి ప్రేక్షకులకు ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలనుకునే నటుల్లో ఆయనది మొదటి స్థానం. అందుకు ఆయన నటించిన ‘ఎయిర్‌లిఫ్ట్‌’, ‘రుస్తుం’, ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా’ చిత్రాలే ఉదాహరణ. ఇప్పుడు ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమాతో మరో సామాజిక సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆడవారు ఎదుర్కొనే రుతుక్రమం ఒక రహస్యం కాదని, చర్చించాల్సిన అంశమని పోరాడిన వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను ఆర్‌.బాల్కీ తెరకెక్కించారు. ఈ సినిమా ప్రచారం కోసం యావత్‌ బాలీవుడ్‌ దిగివచ్చింది. మరి సెలబ్రిటీలను మెప్పించిన స్థాయిలో ప్రేక్షకులను కూడా ఈ సినిమా మెప్పించిందా? ఈ సినిమాతో అక్షయ్‌ మరో హిట్‌ కొట్టాడా? చూద్దాం..

కథేంటంటే..: మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌ అనే చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి లక్ష్మీకాంత్‌ చౌహాన్(అక్షయ్‌ కుమార్‌). ఇతనికి ఇదే ప్రాంతానికి చెందిన గాయత్రి(రాధికా)తో వివాహం అవుతుంది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. భార్యను కష్టపెట్టకుండా చూసుకుంటాడు లక్ష్మీకాంత్‌. కానీ రుతుక్రమం కారణంగా ఒక్కోసారి గాయత్రి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటుంది. శానిటరీ న్యాప్‌కిన్లు లేకపోవడంతో ఇంట్లోని మురికిమయమైన వస్త్రాలతో శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన లక్ష్మీకాంత్‌ ఇలాంటివి వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని శానిటరీ న్యాప్‌కిన్లు వాడమని చెప్తాడు. కానీ వాటి ఖరీదు ఎక్కువని వాడలేనని అంటుంది గాయత్రి. దాంతో తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ న్యాప్‌కిన్లు తానే తయారుచేయాలన్న నిర్ణయానికి వస్తాడు లక్ష్మీకాంత్‌. లక్ష్మీకాంత్‌  నిర్ణయానికి గ్రామంలోని అందరూ అతన్ని ‘మ్యాడ్‌మ్యాన్‌’ అని వెక్కిరిస్తుంటారు. అయినా పట్టువదలని విక్రమార్క లాగా తాను చేయాలనుకుంది చేసి చూపించాలనుకుంటాడు. అలా అందరూ ఎగతాళి చేసిన ‘మ్యాడ్‌మ్యాన్‌’.. ‘ప్యాడ్‌మ్యాన్‌’గా మారాడా? అతనికి..సోనమ్‌ కపూర్‌కి మధ్య సంబంధం ఏంటి? తదితర విషయాలు తెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే..: చెన్నైకి చెందిన సామాజికవేత్త అరుణాచలం మురుగనాథమ్‌ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు బాల్కీ. సాధారణంగా బయోపిక్‌లంటే ఎవరి జీవితాధారంగా తెరకెక్కిస్తున్నారో సినిమాలోని నటీనటులకు కూడా వారి అసలు పేర్లే వాడతారు. కానీ ఈ సినిమా ఇందుకు భిన్నంగా ఉంది. అరుణాచలం జీవితాధారంగా తెరకెక్కిస్తున్నప్పుడు సినిమాలో అతని రీల్‌ లైఫ్ పాత్రలో నటించిన అక్షయ్‌‌ పాత్రకు అతని పేరే ఉండాలి. కానీ అక్షయ్‌ పాత్రకు లక్ష్మీకాంత్‌ అని పేరుపెట్టారు. ఇలాంటి సినిమాలు తెరకెక్కించి ప్రచారం చేయడం సాహసంతో కూడుకున్న పనే. తొలి సగభాగంలో అక్షయ్‌, రాధికాల ప్రేమతో సాగదీశాడు దర్శకుడు. అసలు విషయంలోకి రావడానికి కాస్త ఆలస్యం చేశాడు. రుతుక్రమంతో ఆడవారు ఎదుర్కొనే ఇబ్బందులు ఎలా ఉంటాయో విరామం వరకు చూపించాడు. రెండో భాగమంతా అక్షయ్‌ అనుకున్నది ఎలా సాధించాడు? తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ న్యాప్‌కిన్లు ఎలా తయారుచేశాడు?వంటి విషయాలు వివరించాడు.

ఎవరెలా చేశారంటే..: ఈ సినిమాలో అక్షయ్‌ పాత్రే ప్రధానం. గ్రామంలో పుట్టి పెరిగిన సాధారణ వ్యక్తిగా ఒదిగిపోయాడు. చేతిలో శానిటరీ న్యాప్‌కిన్‌ పట్టుకున్నప్పుడల్లా వచ్చే సన్నివేశాలు హాస్యం పండిస్తాయి. రాధికా కూడా తన పాత్రకు తగ్గట్టు నేచురల్‌గా నటించింది. ఆమె పాత్ర ఇంకాస్త బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. సోనమ్‌ కపూర్‌ పాత్ర చిన్నదే అయినా సినిమాకు కీలకం. ఆమె ప్రతీ ఫ్రేమ్‌లోనూ చక్కగా ఒదిగిపోయింది. ఇక మిగతా నటీనటుల పాత్రలు సాదాసీదాగా ఉంటాయి. పాతకాలం నాటి వారిలా నటిస్తూ అక్కడక్కడా చిరాకు కలిగించినట్లుగా ఉంటే అది ప్రేక్షకుడి తప్పు కాదు. అక్షయ్‌..రాధిక..సోనమ్‌ల మధ్య వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటాయి.

బలాలు:

+ సంభాషణలు

+ అక్షయ్‌, సోనమ్‌, రాధిక నటన

+ పాటలు

బలహీనతలు:

- సాగదీతగా అనిపించే సన్నివేశాలు

- ఇతర నటీనటుల పాత్రలు

చివరగా: వినోదం పంచే ‘మ్యాడ్‌మ్యాన్‌’..సందేశమిచ్చే ‘ప్యాడ్‌మ్యాన్‌’!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.