
అంతర్యామి
తాళపత్ర గ్రంథాలు
అతి చనువు వల్ల కావచ్చు, అత్యంత అందుబాటు వల్ల కావచ్చు... కొన్ని అపురూప అంశాలు కూడా మనకు అతి చౌకగా, చులకనగా కనిపిస్తాయి. ప్రస్తుతం మన కుటుంబ పెద్దలు మనకు అలాంటి నిమ్నస్థాయిలో అనిపిస్తున్నారు, కనిపిస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. వాళ్లు తిని పారేసిన మామిడి టెంకల మల్లే అప్రయత్నంగా మొలకెత్తిన జాతి మామిడి వృక్షాల్లాంటివాళ్లు. తేరగా వచ్చే ఆ ఫలాల విలువ మనకు తెలియడంలేదు.
మనం ఏ విషయంలోనైనా నైపుణ్యం సాధించాలంటే ప్రత్యేక శిక్షణ తీసుకుంటాం. అది చిన్న విషయమా, పెద్ద విషయమా అనే తేడాలుండవు. మనకున్న సహజ జ్ఞానానికి తోడు ఆ ప్రత్యేక శిక్షణ నైపుణ్యాన్ని పెంచుతుంది. మనం ఏ శిక్షణా తీసుకోకుండానే, సమయాన్ని, ధనాన్ని వెచ్చించకుండానే మన ఇంట్లోనే, మనకత్యంత సానుకూల పరిస్థితుల్లోనే లభించే నైపుణ్య వారధులు, సారథులు ఇంట్లోని పెద్దలు. వారు అడుగడుగునా మనకు జ్ఞానాన్నందించే బడులు, గుడులు. నిత్యజీవితంలో నిద్రలేచిన క్షణం మొదలు రాత్రి నిద్రించే క్షణం వరకు ఏం చేయాలో, ఎలా చేయాలో, ముఖ్యంగా ఏం చేయకూడదో తెలియజెప్పే అత్యంత ఆత్మీయ సహాయకులు, సహచరులు, సహాధ్యాయులు.
పిల్లలతో(మనవలు, మనవరాళ్లు) వారి అనుబంధం విలక్షణమైంది. అత్యంత మధురమైంది. స్నేహం, స్వేచ్ఛ ప్రాతిపదికగా వారి సంబంధం కొనసాగుతుంది. అమ్మానాన్నల్లా ‘క్రమశిక్షణ, క్రమశిక్షణ’ అంటూ బెదిరించరు. సమయం లేదంటూ విసుక్కోరు. ప్రేమ, వాత్సల్యం మాత్రమే వారిదగ్గరుండే దండించే బెత్తం. జ్ఞానం వాళ్లందించే తాయిలం. వాళ్ల ధ్యాన సమయాన్ని కూడా పిల్లల అభ్యున్నతే ధ్యేయంగా, పురోగతే పుణ్య సముపార్జనగా కేటాయించగల అమాయక చక్రవర్తులు, త్యాగమయులు... ఆ ఫలిత జ్ఞానవృద్ధులు.
ప్రస్తుత కాల శైలిని బట్టి... ఒక ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని(సబ్జెక్టు) మాత్రమే కూలంకషంగా బోధించగలడు. ఒక వైద్యుడు ఒక వ్యాధికి మాత్రమే ప్రత్యేక వైద్యాన్ని అందించగలడు. కానీ మన కుటుంబ గురువులు, వైద్యులు అన్నికాలాల్లో అన్ని విద్యలను మనకు బోధించగలరు. అన్నిరకాల వైద్యాన్ని అందించగలరు. రుసుము లేదు, విసుగు లేదు. ఆ సహజ వనరులను, ఆ వారసత్వ సంపదను, ఆ పెద్దలను, వాళ్ల దృష్టిని కూడా పిల్లల మీద పడకుండా ఎంత మాయ చేస్తున్నాం? ఇది నేరం కాదా? నిత్యం సూర్యుణ్ని, చంద్రుణ్ని కూడా చూడకుండా పెరుగుతున్న పిల్లలకు చంద్రుడిమీదికి వెళ్ళే విద్యను ఏ అధికారంతో నేర్పించాలనుకుంటున్నాం? ‘విటమిన్ డి’ కోసం గుప్పిళ్లకొద్దీ మాత్రలు మింగే మనం ఆ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి గొప్పదనం గురించి ఏ ముఖం పెట్టుకుని వివరించగలం?
పూర్తిగా శిథిలం కాకముందే బూజుపట్టిన, మనం పట్టించిన ఆ జ్ఞానభాండారపు చిరునామా వెదుకుదాం. ముడతలు పడిన ఆ జ్ఞాన గ్రంథాలకు మనమే పట్టించిన, దట్టించిన దుమ్మును ఆ ముడతల పొరలు కదిలించి దులుపుదాం. ఆ జ్ఞాన మణుల్ని అపురూపంగా అందుకుని మన వారసులకు అందిద్దాం.
పనికిరాని సామాను కింద పాత సామాన్ల గదిలో పడేసిన జీర్ణమైపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆ తాళపత్ర గ్రంథాలను వెలికి తీద్దాం. పత్రాలు జీర్ణమైపోవచ్చు. చెదలు తినిపోవచ్చు. కానీ అందులోని ఆ జ్ఞానం, ఆ భావం ఇప్పటికీ, ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది.
- చక్కిలం విజయలక్ష్మి
మరిన్ని కథనాలు

- కిడ్నాప్ నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య
- నా బ్రెయిన్లో 9 టైటానియం తీగలున్నాయి!
- 15ఏళ్ల తర్వాత మెగాస్టార్‌కు జోడీగా ఆ భామ?
- ఇద్దరినీ మట్టుబెట్టి.. కారులోనే గుర్రుపెట్టి
- పెళ్లి పేరుతో రూ.11 కోట్లు స్వాహా
- 108 సిబ్బందే.. బంగారం నొక్కేశారు!
- కాలిన గాయాలతో.. రోడ్డు పక్కన నగ్నంగా
- మస్క్ చేసిన ట్వీట్.. లక్షల కోట్లు ఫట్
- ఈ బాబు మరీ వివాదాస్పదం!
- రాడ్డులతో కొట్టి.. కత్తులతో పొడిచి