Guntur: నకిలీ చలానాల వ్యవహారం.. 35 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు

తాజా వార్తలు

Updated : 13/08/2021 17:18 IST

Guntur: నకిలీ చలానాల వ్యవహారం.. 35 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు

గుంటూరు: నకిలీ చలానాల వ్యవహారంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. నకిలీ చలానాల వ్యవహారంపై రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు స్పందించారు. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని కొందరు ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు తనిఖీలు చేయగా.. ఒక్క మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలోనే అక్రమాలు జరిగినట్లు తేలిందని పేర్కొన్నారు. ఏడు రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ. 7.95 లక్షలు విలువైన నకిలీ చలానాలు జతచేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ఏడు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. పాత సాఫ్ట్‌వేర్ స్థానంలో కొత్తది సోమవారం నుంచి వినియోగంలోకి రానుందని వెల్లడించారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వస్తే ఇలాంటి అక్రమాలు జరిగేందుకు అవకాశం లేదని డీఐజీ స్పష్టం చేశారు.

రికవరీపై దృష్టి సారించాలి: సీఎం జగన్‌

నకిలీ చలానాల వ్యవహారంపై సీఎం జగన్‌ ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.40 లక్షల మేర సొమ్ము రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు సీఎంకు వివరించారు. సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్‌ఎంఎస్‌లకు అనుసంధానిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కుంభకోణానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.

డాక్యుమెంట్‌ రైటర్లు పరీక్ష రాయాలి: రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు

‘‘రాష్ట్రంలోని 17 రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల అవకతవకలు జరిగినట్లు గుర్తించాం. పది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు తేలింది. ఇప్పటివరకు రూ.5.25 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించాం. నకిలీ చలానాల కేసులో ఇప్పటికే రూ.కోటి రికవరీ చేశాం. మిగతా మొత్తం కూడా రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అవకతవకలు జరిగిన చోట్ల కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు ఆరుగురు సబ్‌ రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేశాం. మిగతా సబ్‌ రిజిస్ట్రార్లపై అంతర్గత విచారణ జరుగుతోంది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా మార్చేశాం. ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను రిజిస్ట్రేషన్లకు వినియోగిస్తున్నాం. కొందరు డాక్యుమెంట్‌ రైటర్లపైనా కేసులు నమోదయ్యాయి. ఇకపై డాక్యుమెంట్‌ రైటర్లకూ లైసెన్సింగ్‌ విధానం తీసుకురావాలనే యోచనలో ఉన్నాం. 25 ఏళ్ల క్రితం విధానాన్ని మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. డాక్యుమెంట్‌ రైటర్లు పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది’’ అని శేషగిరిబాబు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని