close
రాష్ట్రంలో 25 జిల్లాలు!

60 ఏళ్లు నిండిన వారికి  రూ.3000 పెన్షన్‌
తెదేపా అవినీతిపై విచారణకు సిట్‌
  మ్యానిఫెస్టోలో రాష్ట్ర భాజపా హామీలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా (మొత్తం 25 జిల్లాలు) ఏర్పాటు చేస్తామని భాజపా ప్రకటించింది. రాష్ట్ర హైకోర్టును శాశ్వతంగా రాయలసీమలోనే నెలకొల్పుతామని హామీ ఇచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర ‘ఎన్నికల ప్రణాళిక’ను మంగళవారం విజయవాడలో రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విడుదల చేశారు. భాజపా అధికారంలోకి రాగానే... అమరావతి ప్రాంత రైతులు ఎవరైనా అభ్యర్థిస్తే వారి భూములను తిరిగి ఇచ్చేస్తామని ఎన్నికల ప్రణాళికలో వెల్లడించింది. అవినీతి ఆరోపణలపై కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వంపై విచారణకు ప్రత్యేకంగా సిట్‌ ఏర్పాటు చేసి... బాధ్యులకు శిక్ష పడేలా చేస్తామని పేర్కొంది. మ్యానిఫెస్టో రూపకల్పన కమిటీ ఛైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు మాట్లాడుతూ... ప్రస్తుతం ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో అన్ని కులాల వారికి తగిన ప్రాతినిథ్యం లభించడంలేదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.మ్యానిఫెస్టోలో రాష్ట్రంలోని ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, ఉద్యోగŸ భద్రత, ఉచిత స్థలం. సీపీఎస్‌ రద్దు; వలస విధానానికి ప్రతీకగా కొనసాగుతున్న బిళ్ళ బంట్రోతు విధానానికి స్వస్తి; హోంగార్డులకు నెలకు రూ.20వేలు.ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ; స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా పథకాన్ని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు అనుసంధానం చేసి, రూ.కోటి వరకు పూచీకత్తు లేని రుణం.. వంటివి ప్రధానంగా ఉన్నాయి.

ఇతర ప్రధాన అంశాలు
* వాల్మీకి, వడ్డెర, బెస్త కులాలను ఎస్టీలలో చేర్చేందుకు కృషి.
* రైతులకు 16 గంటలపాటు విద్యుత్తు. ఎకరానికి రెండు బస్తాల చొప్పున 50% రాయితీతో ఎరువులు
* వ్యవసాయ ప్రణాళిక కమిషన్‌ ఏర్పాటు.
* డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ల పంపిణీ.
* డిగ్రీలో చేరిన విద్యార్థినులకు 90%

* సబ్సిడీపై స్కూటీల సరఫరా
* 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం  ప్రతి మండలానికో ఆనంద ఆశ్రమం ఏర్పాటు. నెలకు రూ.3వేల పెన్షన్‌.
* 2019 చివరికి పోలవరం పూర్తి.
* ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వైజాగ్‌, మధ్య కోస్తాకు విజయవాడ, గుంటూరు ప్రాంతం; రాయలసీమకు తిరుపతి కేంద్రంగా ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలు.
* సముద్రంలో వేటకు వెళ్లి మరణించిన వారికి రూ.5 లక్షల సాయం
* మగ్గాలపై 30 ఏప్రిల్‌ 2019 వరకు రుణాల మాఫీ, జనతా వస్త్ర విధానం అమలు.
* నూతన వధూవరులకు వారి ఆర్థిక పరిస్థితిని అనుసరించి మంగళసూత్రం, పక్కా ఇల్లు, నూతన వస్త్రాలు.
* పరిశ్రమల ఏర్పాటులో భాగంగా ఐదేళ్లపాటు సగం ధరకే విద్యుత్తు సరఫరా. పారిశ్రామిక కేంద్రంగా రాయలసీమ అభివృద్ధికి చర్యలు.
* అగ్రిగోల్డ్‌ భూములను సరైన విధానంలో వేలం వేసి, వాస్తవ ధరలను రాబట్టి భాదితులను ఆదుకోవడం.
* గీత కల్లుకు ఎక్సైజ్‌ పరిధి నుంచి మినహాయింపు.
* రూ.1000 కోట్ల నిధితో యూత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం
* కులరహితంగా పాఠశాలలు, వసతి గృహాలను ‘వందే భారతం గురుకులాలు’గా ఏర్పాటు.
* దేవాదాయ సవరణ చట్టానికి అనుగుణంగా రూపొందించిన జీఓ 73ను యథాతథంగా అమలుకు కృషి.
* అర్చకుల సేవలకు తగట్లు వేతనాలు, ఆరోగ్య కార్డుల మంజూరు. విశ్రాంత అర్చకులకు రూ.3వేల పెన్షన్‌. అర్చకులకు ఆరోగ్య కార్డుల మంజూరు.
* శ్రీకాకుళంలో మూత్రపిండాల పరిశోధన కేంద్రం,
* రాయలసీమలో క్యాన్సర్‌ రీసెర్చి కేంద్రం ఏర్పాటు.
* ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దడం.
* రైతుల కోసం మండల కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలు.
* ‘నమామి గంగే’ స్థాయిలో గోదావరి, కృష్ణా తదితర నదుల శుభ్రతకు చర్యలు.
* ఉత్పత్తి సర్వీసు రంగాల అభివృద్ధికి విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి కృషి.
* గœల్ఫ్‌ విదేశాల్లోని కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ.
* చుక్కల భూముల పేరుతో అన్యాయానికి గురైన రైతులకు న్యాయం చేయడం.
* వక్ఫ్‌ ఆస్తులు, క్రైస్తవ సంస్థల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు.
* కార్మికులకు భీమా కల్పన, రజకులకు దోబీఘాటల నిర్మాణం.
* కొల్లేరు, పులికాట్‌ సరస్సుల పూర్తి రక్షణ అభివృద్ధికి చర్యలు.
* క్రిమిసంహారిక మందులను పిచికారి చేసే రైతు కూలీలకు ఉచితంగా రక్షణ దుస్తులు, ప్రత్యేక బీమా పథకం అమలు.
* అనాధ పిల్లలు, వృద్ధులకు తగిన వసతి భోజన ఏర్పాట్లు.
* హిందూ మత పరిరక్షణకు కృషి.
* సెజ్‌ పేరుతో భూముల కుంభకోణాలకు అడ్డుకట్ట.
* పోలీసు వ్యవస్థలో మౌలిక మార్పులు-సంస్కరణలు.
* పారదర్శకత, జవాబుదారీతనంతో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం.
* రాజధాని అమరావతి  నిర్మాణంలో ఉపాధి కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ మహిళలు, యువతకు ఆ ప్రాంతంలో స్థాపించే ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాల కల్పన.
* వెనుకబడిన జిల్లాల్లో ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఏర్పాటు.
* ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి క్రమబద్ధీకరణ.
* ఎస్టీ, ఎస్టీలపై తెదేపా ప్రభుత్వం నమోదుచేసిన అక్రమ కేసుల తొలగింపు.
* ఔత్సాహిక మహిళా ఉత్పత్తిదారులకు వారు తీసుకున్న రుణాలపై వడ్డీ రాయితీ.
* గుట్కా, పొగాకు వాడకంపై నిషేధం.
* ప్రతి జిల్లాలో 2 వేద పాఠశాలలు. అనుబంధంగా గోశాలల ఏర్పాటు.
* అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటు.
* సూక్ష్మ సేద్యానికి 90% సబ్సిడీ. వ్యవసాయ పరికరాల కొనుగోళ్లపై 75% సబ్సిడీ.
* తెలుగు భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేలా కృషి.
* ఫసల్‌ బీమా స్కీమ్‌ పరిధిలోనికి వేరుశనగ పంట.
* భావనపాడు, రామాయపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో కాలపరిమితో కూడిన అభివృద్ధి. రైలు, రోడ్డు మార్గాలను నిర్మించి పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానం.
* బెల్టుషాపుల రద్దు. అంచెలంచెలుగా మద్యపాన నిషేధానికి చర్యలు.
* కృష్ణా పుష్కరాల సమయంలో ఫ్లైఓవర్‌ నిర్మాణం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం కూల్చివేసిన అన్ని దేవాలయాల నిర్మాణం.
* సమగ్ర సర్వే సెటిల్మెంట్‌ విధానం ద్వారా భూములపై హక్కుదారులను గుర్తించడం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.