Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009455
            [news_title_telugu_html] => 

చలో ఆత్మకూరు భగ్నం

[news_title_telugu] => చలో ఆత్మకూరు భగ్నం [news_title_english] => [news_short_description] => శాంతియుతంగా నిర్వహించాలనుకున్న ‘చలో ఆత్మకూరు’ను గృహ నిర్భంధాలతో అడ్డుకోవడం పిరికిచర్య... ప్రజాస్వామ్యంలో ఇదో చీకటిరోజు. పునరావాస శిబిరంలోని బాధితులకు ఆహారాన్ని అడ్డుకోవడం ప్రభుత్వ నిర్దయకు నిదర్శనం. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రం రావణకాష్టంలా మారింది. వేల మందిని గృహ నిర్బంధంలో పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి బెదిరింపులకు తలొగ్గేది లేదు. చలో ఆత్మకూరు కొనసాగుతుంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,25, ) )
చలో ఆత్మకూరు భగ్నం - EENADU
close
చలో ఆత్మకూరు భగ్నం

  పల్నాడులో అడుగడుగునా పోలీసు బలగాల మోహరింపు
 తెదేపా నేతల కదలికలపై ఆంక్షలు
 చంద్రబాబు గృహ నిర్బంధం
 చలో ఆత్మకూరు కొనసాగుతుందని  తెదేపా అధినేత ప్రకటన
 నేతల అరెస్టులు, నిర్బంధాలు
 వైకాపా నేతలను గుంటూరులో అడ్డుకున్న పోలీసులు
  రాజకీయ లబ్ధికే తెదేపా ఆందోళన
హోం మంత్రి సుచరిత వ్యాఖ్య
 పునరావాస శిబిరం నుంచి 162  మంది వైకాపా బాధితులు  స్వగ్రామాలకు తరలింపు

చీకటి రోజు

శాంతియుతంగా నిర్వహించాలనుకున్న ‘చలో ఆత్మకూరు’ను గృహ నిర్భంధాలతో అడ్డుకోవడం పిరికిచర్య... ప్రజాస్వామ్యంలో ఇదో చీకటిరోజు. పునరావాస శిబిరంలోని బాధితులకు ఆహారాన్ని అడ్డుకోవడం ప్రభుత్వ నిర్దయకు నిదర్శనం. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రం రావణకాష్టంలా మారింది. వేల మందిని గృహ నిర్బంధంలో పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి బెదిరింపులకు తలొగ్గేది లేదు. చలో ఆత్మకూరు కొనసాగుతుంది.

- చంద్రబాబు

ఉద్వేగం.. ఉత్కంఠ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయోనన్న భయాందోళనలు... నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వారానికి పైగా అట్టుడికిన పల్నాడులో..తెదేపా, వైకాపాలు పోటాపోటీగా తలపెట్టిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.

మంగళవారం రాత్రి నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంతో పాటు, గుంటూరు, విజయవాడ నగరాల్లో వందలాది మంది పోలీసుల్ని మోహరించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయం, అరండల్‌పేటలో తెదేపా ఏర్పాటు చేసిన ‘వైకాపా బాధితుల శిబిరం’ వద్ద పరిస్థితి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. తెదేపా నేతలు ఎలాగైనా ఆత్మకూరు వెళ్లాలన్న పట్టుదలను చూపటంతో ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు కొనసాగాయి. బుధవారం ఉదయం  ప్రతిపక్షనేత చంద్రబాబును ఉండవల్లి నివాసం నుంచి బయటకు అడుగుపెట్టనివ్వలేదు. ఇంటి ఆవరణలోనుంచి ఆయన రాకుండా ఇంటి గేట్లు మూసివేసి అడ్డుకున్నారు. తమను ఎన్ని రోజులు గృహనిర్బంధంలో ఉంచుతారో చూస్తామని చంద్రబాబు సవాల్‌ విసిరారు. మరోవైపు తెదేపా బాధితులతో ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించిన వైకాపా నేతలనూ పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో ఆ పార్టీ కార్యాలయానికి చేరుకున్న నేతలను బయటకు రానివ్వలేదు. రాజకీయలబ్ధి కోసం తెదేపా ‘చలో ఆత్మకూరు’ తలపెట్టిందని మంత్రులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఏడు రాజకీయ హత్యలో చోటుచేసుకుంటే, అందులో ఆరు పల్నాడులోనే చోటుచేసుకున్నాయని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. ‘చలో ఆత్మకూరు’ కొనసాగిస్తామని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ప్రకటించాయి. తెదేపా పునరావాసశిబిరంలో ఉన్న 162 మందిని పోలీసులు బలవంతంగా ఐదు వాహనాల్లో వారి స్వగ్రామాలకు తరలించారు. అటు ఆత్మకూరులోనూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.


ఉత్కంఠకు తెర
పునరావాస శిబిరం నుంచి  స్వగ్రామాలకు బాధితులు
 162 మందిని 5 బస్సుల్లో తరలించిన పోలీసులు
 అర్ధరాత్రి నుంచి హైడ్రామా
 పోలీసుల అధీనంలో శిబిరం
 కర్ఫ్యూను తలపించిన వాతావరణం
ఈనాడు - గుంటూరు

తెదేపా గుంటూరులో నిర్వహిస్తున్న ‘వైకాపా బాధితుల పునరావాస శిబిరం’లో తలదాచుకుంటున్న 162 మందిని పోలీసులు బుధవారం సాయంత్రం బలవంతంగా వారి స్వగ్రామాలకు తరలించారు. తెదేపా, వైకాపా పోటాపోటీగా బుధవారం ఒకే రోజు ‘చలో ఆత్మకూరు’ పర్యటనకు పిలుపునివ్వడంతో మంగళవారం రాత్రి నుంచే పునరావాస శిబిరాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. శిబిరానికి వెళ్లే అన్ని దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటుచేసి వందలాది మంది పోలీసులను మోహరించారు. మంగళవారం రాత్రి ఈ శిబిరానికి వచ్చిన తెదేపా నాయకుల్ని అక్కడే నిర్బంధించారు. శిబిరంలో ఉన్న నేతలెవరూ బయటికి రాకుండా బుధవారం ఉదయం వారికి అక్కడే అల్పాహారాన్ని అందజేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వారిని అరెస్టు చేసి గ్రామీణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. శిబిరంలో ఉన్న బాధితులకు తెదేపా పంపించిన భోజనాన్నీ పోలీసులే లోపలికి తీసుకెళ్లి అందజేశారు. అనంతరం బాధితులను 5 బస్సుల్లో, పోలీసు ఎస్కార్టుతో వారి స్వగ్రామాలకు తీసుకెళ్లారు. తెదేపా 9 రోజులుగా నిర్వహిస్తున్న పునరావాస శిబిరం ఖాళీ కావడంతో ఉత్కంఠకు తెరపడింది.

గుంటూరులోని పునరావాస శిబిరం నుంచి బాధితులను స్వగ్రామాలకు తరలించామని గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, ఏఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ.. మొత్తం 162 మందిని 5 బస్సుల ద్వారా పంపామని చెప్పారు. ‘గ్రామాల్లో సమస్యకు మూలాలను అధ్యయనం చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరిస్తాం. ప్రభుత్వపరంగా అర్హులకు సంక్షేమ పథకాలను అందిస్తాం. ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాం’ అని తెలిపారు.
పునరావాస శిబిరం సమీపంలోని దాదాపు 20 గృహాలకు మార్గాన్ని పోలీసులు మూసేయడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాహనాలు దూరంగా నిలిపి రాకపోకలు సాగించాల్సి వచ్చింది. శిబిరం ఉన్న ప్రాంతం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది.

రాజకీయ లబ్ధికే తెదేపా చలో ఆత్మకూరు
హోం మంత్రి సుచరిత ధ్వజం

ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం: రాజకీయ లబ్ధి కోసమే తెదేపా చలో ఆత్మకూరు తలపెట్టిందని హోం మంత్రి సుచరిత విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. గత ఐదేళ్లలో పల్నాడులో రాక్షస పాలన సాగిందని, అక్రమ మైనింగ్‌ వ్యవహారం నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణకు నిర్ణయించామని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 7 రాజకీయ హత్యలు చోటు చేసుకుంటే వాటిలో 6 పల్నాడులోనే జరిగాయని తెలిపారు. కే-ట్యాక్స్‌ పేరుతో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఆయన పిల్లలు ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. పల్నాడులో 144 సెక్షన్‌ అమల్లో ఉందని, నిజమైన బాధితులుంటే పోలీసులే స్వయంగా ఇళ్లకు తీసుకెళ్తున్నారని, చలో ఆత్మకూరు పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని, అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయలని చూస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు అరెస్టులు చేస్తున్నారని చెప్పారు.

అణిచే కుట్రలు విఫలం: కళా వెంకట్రావు

ఈనాడు, అమరావతి: తెదేపా చేపట్టిన చలో ఆత్మకూరు విజయవంతమైందని...ఈ కార్యక్రమాన్ని అణిచేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వెల్లడించారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలా స్వేచ్ఛ ఇవ్వకుండా వైకాపా నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ అధినేత పోలీసులను వారి చెప్పుచేతల్లో పెట్టుకున్నారని విమర్శించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్న ఆయన బుధవారం సాయంత్రం ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు తదితరులతో కలిసి అక్కడే విలేకరులతో మాట్లాడారు. అనంతరం వైకాపా బాధితులను ఆదుకునే విషయంలో భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. ‘‘చంద్రబాబు ఈ నెల 18న పల్నాడులోని ఆత్మకూరు, పిన్నెల్లి గ్రామాల్లో పర్యటిస్తారు.  వైకాపా బాధితులను వారి స్వగ్రామాలకు తరలించిన నేపథ్యంలో వారికి న్యాయం జరిగిందా? లేదా?అని పరిశీలిస్తారు. రాష్ట్రంలో వైకాపా దాడుల బారిన పడిన తెదేపా కార్యకర్తలు, నాయకులు, ఇతర బాధితులకు ఎలా నష్టం జరిగిందో వివరిస్తూ గురువారం చంద్రబాబు డీజీపీకి లేఖ రాస్తారు. రాష్ట్రంలో వైకాపా దాడులకు సంబంధించి 567 ఘటనలు జరిగాయి. ఈ ఘటనలపై విషయ సేకరణ జరిపి చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందించేందుకు జిల్లాకొకటి చొప్పున 13 జిల్లాలకు 13 బృందాలను పంపిస్తాం’’ అని వివరించారు.

అర్ధరాత్రి నుంచి ఇలా...

పునరావాస శిబిరం వద్ద మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉత్కంఠ మొదలైంది. బుధవారం మధ్యాహ్నం బాధితుల్ని అక్కడి నుంచి తరలించే వరకు పరిణామాలివీ..
మంగళవారం రాత్రి 11 గంటలు: శిబిరం వద్దకు పోలీసులు పెద్ద సంఖ్యలో రావడం మొదలైంది. ఎమ్మెల్యే మద్దాళి గిరి, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, జీవీ ఆంజనేయులు, ఇతర తెదేపా నేతలు పోలీసుల నిర్బంధంలో శిబిరంలోనే ఉండిపోయారు.
రాత్రి ఒంటి గంట:  ఆక్టోపస్‌ ఎస్పీ విశాల్‌ గున్ని సిబ్బందితో వచ్చారు. శిబిరానికి ఉన్న అన్ని మార్గాల్లో బారికేడ్లు పెట్టారు.
బుధవారం ఉదయం 5 గంటలు: శిబిరంలోకి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. మీడియా ప్రతినిధుల్ని శిబిరం నుంచి బయటికి పంపేశారు. వీధి చివరలో ఏర్పాటుచేసిన బారికేడ్ల వరకే అనుమతించారు.
ఉదయం 6 గంటలు: శిబిరం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఉదయం 7 గంటలు: బాధితుల కోసం తెదేపా పంపించిన అల్పాహారాన్ని తీసుకెళ్లటానికి పోలీసులు అనుమతించలేదు. తెదేపా కార్యకర్తలెవరూ లోపలికి రావడానికి వీల్లేదని చెప్పారు.
మధ్యాహ్నం ఒంటి గంట: బాధితులకు తెదేపా భోజనాలు పంపింది. వాటినీ పోలీసులే లోపలికి తీసుకెళ్లి అందించారు.
మధ్యాహ్నం ఒకటిన్నర: గుంటూరు ఆర్డీవో, అదనపు ఎస్పీ శిబిరానికి వచ్చారు. అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా తెదేపా నేతలకు సూచించారు. బాధితులకు న్యాయం చేసేవరకు తాము వెళ్లబోమని భీష్మించడంతో నేతలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
మధ్యాహ్నం 1.40: బాధితులతో ఆర్డీవో, ఎస్పీ చర్చించారు. ‘మీకు రక్షణ కల్పిస్తాం. ఫిర్యాదులను పరిశీలించి కేసులు నమోదుచేసి న్యాయం చేస్తాం. గ్రామాల్లో భవిష్యత్తులో దాడులు జరగకుండా చూస్తాం. పరిహారం ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశం’ అని తెలిపారు. గ్రామాలకు వెళితే మళ్లీ దాడులు చేస్తారని బాధితులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితి రాకుండా చూస్తామని, అందరూ గ్రామాలకు వెళ్లాల్సిందేననని ఎస్పీ జయలక్ష్మి స్పష్టం చేశారు.
మధ్యాహ్నం 2-4 గంటల మధ్య: శిబిరంలో ఉన్న 162 మంది బాధితుల్ని 5 బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. బాధితులంతా బస్సులు ఎక్కేటప్పుడు... జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని నినాదాలు చేశారు.

చంద్రబాబు శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చంద్రబాబు శాంతిభద్రతల సమస్యను సృష్టించాలని చూస్తున్నారు. తెదేపా హయాంలో పల్నాడులో ఏడుగురిని హత్య చేశారు. ఎంతోమంది కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. మరెందరినో అనాథలను చేశారు. యరపతినేని అక్రమ మైనింగ్‌, మహిళా అధికారిపై చింతమనేని దాడి.. ఇలాంటివి గత ప్రభుత్వంలోనే చాలా జరిగాయి. వైకాపా 100 రోజుల పాలనలో పల్నాడులో ఎక్కడా ఏమీ జరగలేదు.

- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌

ఆనాడేం చేశారు?

తెదేపా శిబిరాల నుంచి కార్యకర్తలు వెళ్లిపోతే వారిని బెదిరించి కూర్చోబెడుతున్నారు. అచ్చెన్నాయుడు అహంభావంతో పోలీసులను దూషించారు. ఆయన ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. కోడెల, యరపతినేని కుటుంబాల చేతిలో పల్నాడు నలిగిపోయినపుడు చంద్రబాబు ఏం చేశారు?

- మోపిదేవి వెంకటరమణ, మంత్రి

తెదేపా ఓ డ్రామా కంపెనీ

తెదేపా ఓ డ్రామా కంపెనీ. ప్రతిపక్షనేత చంద్రబాబు కొందరు పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టుకుని పల్నాడు ఘటనను రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి బాబు ఓర్వలేకపోతున్నారు. లోకేష్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే ఇలా చేస్తున్నారు.

- శంకరనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

భద్రత కట్టుదిట్టం

ఆత్మకూరు (దుర్గి), న్యూస్‌టుడే: తెదేపా, వైకాపాలు పోటాపోటీగా ‘చలోఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఆత్మకూరు గ్రామాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మాచర్ల- నరసరావుపేట ప్రధాన రహదారిలో ఆత్మకూరు అడ్డరోడ్డువద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, గ్రామంలోకి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గ్రామవాసులనే లోపలకు వెళ్లేందుకు అనుమతించారు. బాంబుస్వ్కాడ్‌ సిబ్బంది ఆత్మకూరుకు వెళ్లే రహదారి వెంట,  ఎస్సీకాలనీ ప్రాంతంలో పోలీసు జాగిలాలతో, ప్రత్యేక యంత్రాలతో తనిఖీ చేశారు. ఆత్మకూరు గ్రామంలో ప్రస్తుతం ప్రశాంత వాతవరణం నెలకొందని పల్నాడు ప్రత్యేక అధికారి, మంగళగిరి బెటాలియన్‌ ఎస్పీ గజరావు భూపాల్‌ చెప్పారు. గ్రామం విడిచి వెళ్లిన వారిలో ప్రస్తుతం 14 కుటుంబాలవారు తిరిగొచ్చారని, మిగిలిన వారూ గ్రామంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. బుధవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. మాజీ సర్పంచి పేరువాల ఏసోబు, గ్రామ పెద్ద చవ్వా రాయపరెడ్డిలతో చర్చించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.