close

ప్రధానాంశాలు

అవార... కృష్ణమ్మ నవ్వింది మనసారా!

నదిలో కలిసే ప్లాస్టిక్‌ వ్యర్థాలపై ‘స్వచ్ఛంద’ యుద్ధం
ఆరేళ్లలో 300 టన్నులు తొలగించిన సంస్థ
విజయవాడ వైద్యుడి స్ఫూర్తిదాయక కృషి

ఆ రూపంలో కృష్ణమ్మను చూసేసరికి ఆయన కడుపు తరుక్కుపోయింది.. అమృతం లాంటి నీటిని కాటేస్తున్న కాలుష్యంపై... తీరంలో మేట వేస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలపై ఆ వైద్యుడు పెద్ద యుద్ధమే చేశారు. బృహత్కార్యాన్ని సుసాధ్యం చేశారు. మనుషుల తీరులో వచ్చిన మార్పును చూసి ఇప్పుడు కృష్ణమ్మ మనసారా నవ్వుతోంది... సుజల ప్రవాహమై గలగల పారుతోంది.

ప్రొఫెసర్‌ అజయ్‌ కాట్రగడ్డది విజయవాడ. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ మొనాష్‌ యూనివర్సిటీలో చాలాకాలం వైద్యుడిగా పనిచేశారు. 2013లో విజయవాడకు తిరిగివచ్చేశారు. నగరవాసుల్లో నానాటికీ పెరుగుతున్న అనారోగ్య సమస్యలపై తనవంతు బాధ్యతగా అవగాహన కల్పించాలని భావించారు. అందుకోసం అమరావతి వాకర్స్‌ అండ్‌ రన్నర్స్‌ అసోసియేషన్‌(అవార)ను స్థాపించారు. అజయ్‌ మారథాన్‌ రన్నర్‌. ఆయనో రోజు ఉదయాన్నే పరుగు, నడక కోసం కృష్ణా వారధి దిగువ భాగానికి వెళ్లారు. స్వచ్ఛంగా పరవళ్లు తొక్కాల్సిన నదీ జలాల్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఆక్రమించిన దృశ్యం అజయ్‌ని ఎంతగానో కదిలించింది. విజయవాడ వాసులకు ఆరోగ్యం, వ్యాయామం కంటే ముందుగా ప్లాస్టిక్‌ మహమ్మారిని అడ్డుకోవడంపై అవగాహన పెంచాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు.


అందరిలోనూ ఆలోచన

ప్లాస్టిక్‌ వ్యర్థాలే కాదు... మలమూత్ర విసర్జన వల్లా నీరు కాలుష్యకాసారంగా మారుతోంది. విజయవాడ, తాడేపల్లి నుంచి మున్సిపాలిటీ సిబ్బంది నిత్యం భారీగా తెచ్చి వేస్తున్న వ్యర్థాలు కాలుష్యాగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. దీనికితోడు కొందరు అక్రమంగా ఇసుకను తవ్వుకుని లారీలు, ట్రాక్టర్లలో తరలించడమూ కనిపించింది. వీటన్నింటిపైనా అవార పోరాడింది. నివాసాల్లో మరుగుదొడ్లు ఉన్నా నిత్యం 600 మంది దాకా మలమూత్ర విసర్జనకు నది ఒడ్డుకు వస్తున్నారని సంస్థ సభ్యులు లెక్కతేల్చి, వారితో మాట్లాడారు. మలమూత్రాలు కలవడంతో ఇకోలీ వంటి ప్రమాదకర వైరస్‌లు కృష్ణమ్మలో పెరుగుతున్నాయని అవగాహన కల్పించారు. రెండు మూడేళ్లలో 90 శాతం మంది రావడం మానేశారు. పది శాతం మంది మాత్రం మొండికేశారు. తమ తాతతండ్రుల నుంచి ఇది అలవాటన్నారు. కొందరైతే అవార సభ్యులపై దాడికి తలపడ్డారు. ఆ సమయంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ తమ సహకారాన్ని అందించారు. దాడికి దిగిన వారిపై బైండోవర్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. దీనితో మిగతా వారూ  అటు రావడం మానేశారు. తాడేపల్లి, విజయవాడ నుంచి వ్యర్థాలతో వచ్చే వాహనాల్నీ నిలువరించారు. ఇసుకను తవ్వేవారినీ అరికట్టారు.


ఒక్కడే కదిలి...
రోజూ ఉదయాన్నే అజయ్‌ ఓ గోనెసంచిని తీసుకుని నది దగ్గరకు వెళ్లేవారు. తీరం పొడవునా కనిపించే ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరుతూ సంచిలో వేసేవారు. వాటిని తీసుకెళ్లి దూరంగా పడేసేవారు. ఆయన ఒక్కడు చేస్తున్న పని ఎంతో మందిలో కదలిక తెచ్చింది. 3 వేలకు మందికిపైగా చిన్నాపెద్దా ‘అవార’తో చేతులు కలిపారు. కష్టమైనా ఇష్టంగా వారు తలపెట్టిన పని వల్ల నది దిగువ భాగం శుభ్రపడింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించగలిగారు. ఆరేళ్లుగా 300 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు.


అధ్యయనం చేసి..
నదిలో నిత్యం తొలగిస్తున్న వ్యర్థాల్లో ఏ తరహా వస్తువులు ఉంటున్నాయో ‘అవార’ ప్రతినిధులు అధ్యయనం చేశారు. 78 శాతం పాలిథిన్‌ సంచులు, 20 శాతం సీసాలు, కప్పులు, తినుబండారాల రేఫర్లు, 2 శాతం ఫోర్కులు, చెంచాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై నివేదికను రూపొందించి, కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అందించారు. విజయవాడలో ప్లాస్టిక్‌ సంచుల వినియోగంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. 90 శాతానికి పైగా దుకాణాల్లో వినియోగం ఆగింది. ప్రస్తుతం నదిలోని వ్యర్థాల్లో పాలిథిన్‌ సంచులు గణనీయంగా తగ్గిపోయాయి.


ప్రతి పండగా అక్కడే
సంక్రాంతి, దసరా, దీపావళి, ఉగాది, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలన్నింటినీ ‘అవార’ సభ్యులు కృష్ణా నది చెంతనే నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న జాతీయ పతాకాల్ని పట్టుకుని మరీ ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తుంటారు. ఇసుకలో బతికే గానుగ లాంటి పలు రకాల మొక్కల్ని పది వేలదాకా ఒడ్డున నాటారు. ఇటీవల వచ్చిన వరదకు అవి కొట్టుకుపోవడం అవార సభ్యుల్ని బాధించింది. ప్రస్తుతం మళ్లీ మొక్కలు నాటుతున్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా అరికట్టాలంటే.. తయారు చేస్తున్న దగ్గరే ఆపాలనే నినాదంతో అవార ముందుకెళుతోంది.


- ఈనాడు, విజయవాడ

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.