Justice NV Ramana: న్యాయవ్యవస్థకు ఆర్థిక స్వతంత్రత కల్పించాలి

ప్రధానాంశాలు

Justice NV Ramana: న్యాయవ్యవస్థకు ఆర్థిక స్వతంత్రత కల్పించాలి

జాతీయ మౌలిక సదుపాయాల కల్పన సంస్థను ఏర్పాటు చేయాలి

పార్లమెంటులో బిల్లుపెట్టి చట్టబద్ధత కల్పించాలి

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ పనితీరును మెరుగుపరచాలంటే దానికి ఆర్థిక స్వతంత్రతను కల్పిస్తూ ‘జాతీయ న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ’ (నేషనల్‌ జ్యుడిషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ-ఎన్‌జేఐఏ) ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. కేంద్రం దీన్ని సాకారం చేస్తే 75వ స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొనే సమయంలో దేశ ప్రజలకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే అవుతుందన్నారు. సంబంధిత ప్రతిపాదనలను తాను ఇప్పటికే కేంద్ర న్యాయశాఖకు పంపానని చెప్పారు. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు పెట్టి దీనికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుని కోరారు. శనివారం బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌కు సంబంధించిన నూతన భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  సకాలంలో న్యాయం అందించకపోవడంవల్ల దేశం ఏటా జీడీపీలో 9% మేర నష్టపోవాల్సి వస్తున్నట్లు అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయని గుర్తుచేశారు. న్యాయస్థానాల పనితీరు మారాలంటే ప్రస్తుతం ఉన్న పని వాతావరణం సంపూర్ణంగా మారాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన, ప్రణాళిక రహితంగా భవన నిర్మాణ/ నిర్వహణ పనులు సాగుతూ వచ్చాయని చెప్పారు.

కోర్టులంటే కట్టడాలు కాదు.. రాజ్యాంగం ప్రసాదించిన కేంద్రాలు

‘‘నేరస్థులు, బాధితులే కోర్టులకు వెళ్తారన్న అపోహ ఉంది. నా జీవితంలో కోర్టు మెట్లెక్కలేదని చాలామంది గర్వంగా చెబుతుంటారు. తప్పు చేసిన వారే కోర్టును ఆశ్రయిస్తారన్న అభిప్రాయాన్ని చెరిపేయాలి. న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అన్నది హక్కుల సంరక్షణతో ముడిపడి ఉందన్న విషయాన్ని చాటి చెప్పాలి. కోర్టును ఆశ్రయించడానికి ఎవ్వరూ ఎప్పుడూ తటపటాయించకూడదు. న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసమే ప్రజాస్వామ్యానికున్న గొప్ప బలం. చట్టబద్ధంగా నడిచే ఏ సమాజానికైనా కోర్టులు అత్యవసరం. కోర్టు భవనాలంటే కేవలం సిమెంటు, ఇటుకలతో కట్టిన నిర్మాణాలు మాత్రమే కాదు. న్యాయం పొందే హక్కును కాపాడేందుకు అవి రాజ్యాంగం ప్రసాదించిన కేంద్రాలు’’ అని సీజేఐ పేర్కొన్నారు.

సమాజానికి అండగా న్యాయస్థానాలు

‘‘కార్యనిర్వాహక వ్యవస్థ అతిగా ప్రవర్తించినప్పుడల్లా సామాన్యులకు, సమాజానికి అండగా దేశంలోని న్యాయస్థానాలు నిలబడ్డాయి. కోర్టు హాళ్లు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల పరంగా కోర్టులు కొరతను ఎదుర్కొంటున్నాయి.

న్యాయమూర్తుల బల్లల మీద వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యంతో కూడిన కంప్యూటర్లు 27% కోర్టు సముదాయాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. న్యాయస్థానాల్లో మంచి మౌలిక వసతులు ఉండాలన్నది ఆలోచనలకు మాత్రమే పరిమితమైంది. చాలా కోర్టులు ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నడుస్తున్నాయి. అలాంటి చోట నుంచి సమర్థంగా పనిచేయడం కష్టం. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా న్యాయాన్ని అందించాలంటే మంచి మౌలిక వసతులు తప్పనిసరి. న్యాయవ్యవస్థకు సరిగా మద్దతివ్వకపోతే దాని ప్రభావం విదేశీ పెట్టుబడులపైనా పడుతుంది’’ అని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మాట్లాడుతూ..  కోర్టుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నట్లు వివరించారు.


బలమైన న్యాయవ్యవస్థ అవసరం: రిజిజు

మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే బలమైన న్యాయవ్యవస్థ అత్యవసరమని అభిప్రాయపడ్డారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.9వేల కోట్లు మంజూరు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. 3,800 కోర్టు హాళ్లు, 4,000 నివాస సముదాయాలు, 1,000 లాయర్ల హాళ్లు, 1,450 మరుగుదొడ్లు, 800 కంప్యూటర్‌ గదులు నిర్మిస్తామని చెప్పారు. ఈ ఏడాది జులై 9 వరకు 96,239 విచారణలను వర్చువల్‌గా నిర్వహించి ప్రపంచంలో సరికొత్త ఘనతను సుప్రీంకోర్టు సాధించిందన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తలు పాల్గొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని