close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సచిన్‌ పైలట్‌పై వేటు

ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగింపు
ఆయన సన్నిహిత మంత్రులు ఇద్దరికి ఉద్వాసన
గహ్లోత్‌ పక్షాన నిలిచిన కాంగ్రెస్‌ అధినాయకత్వం
మలుపు తిరిగిన రాజస్థాన్‌ రాజకీయం
జైపుర్‌, ఈనాడు-దిల్లీ, ఈటీవీ భారత్‌

రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. తిరుగుబావుటా ఎగరేసిన యువనేత సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ అధినాయకత్వం కొరడా ఝళిపించింది. స్వయానా రాహుల్‌గాంధీ, ప్రియాంకలు చెప్పినా పెడచెవిన పెట్టడంతో ఆగ్రహించి, పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచే కాకుండా పీసీసీ అధ్యక్ష పదవి నుంచీ తొలగించింది. ఆయనకు సన్నిహితులైన విశ్వేంద్రసింగ్‌, రమేష్‌ మీనా అనే ఇద్దరు మంత్రులకూ ఉద్వాసన పలికింది. అగ్రనాయకత్వానికి సన్నిహితుడైన ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కే అండగా నిలిచింది. విద్యాశాఖ మంత్రి గోవింద్‌సింగ్‌ను పీసీసీ నూతన అధ్యక్షుడిగా ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో రెండోసారి నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష  సమావేశానికీ పైలట్‌ హాజరుకాకపోవడంతో మంగళవారం ఇవన్నీ చోటుచేసుకున్నాయి.

ఆటలు సాగవన్న గహ్లోత్‌
ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రుల తొలగింపుపై గవర్నర్‌ కల్‌రాజ్‌మిశ్రాకు లాంఛనంగా సిఫార్సు లేఖ అందించిన ముఖ్యమంత్రి గహ్లోత్‌.. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యువనేతపై, భాజపా కుట్రలపై నిప్పులు చెరిగారు. రెండోసారి జరిగిన సీఎల్పీ సమావేశం కూడా ముఖ్యమంత్రిపై విశ్వాసాన్ని ప్రకటించింది. పైలట్ తదుపరి అడుగు ఏమిటనేది వెంటనే స్పష్టం కాలేదు. సత్యం ఎప్పటికీ ఓడిపోదని మాత్రం ఆయన ట్వీట్‌ చేశారు. వేటు పడిన వెంటనే ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ప్రొఫైల్‌నూ మార్చుకున్నారు. తన హోదాలను అక్కడ తొలగించేశారు. టోంక్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, కేంద్ర మాజీ మంత్రిగా మాత్రం హోదాలను పేర్కొన్నారు. పైలట్‌పై వేటు పడడం దురదృష్టకôమని పలువురు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు. ఆయన భాజపాలో చేరబోరని, నాయకత్వ మార్పునే తాము కోరుకుంటున్నామని పైలట్‌ వర్గీయులు చెబుతున్నారు.

మళ్లీ గైర్హాజరైన పైలట్
సోమవారం జరిగిన సీఎల్పీకి పైలట్‌, మరికొందరు శాసనసభ్యులు గైర్హాజరు కావడంతో రెండోసారి మంగళవారం ఈ సమావేశాన్ని పార్టీ పరిశీలకుల సమక్షంలో నిర్వహించారు. దీనికీ పైలట్‌ రాలేదు. హాజరైన సభ్యులంతా గహ్లోత్‌ నాయకత్వం పట్ల తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. సీఎల్పీ నిర్ణయాన్ని పార్టీ పరిశీలకుడు రణదీప్‌ సూర్జేవాలా విలేకరులకు వెల్లడించారు. పైలట్‌ భాజపా కుట్రలో పావుగా మారి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని సూర్జేవాలా ఆరోపించారు. భారమైన హృదయంతోనే వేటుపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

భాజపాతో కలిసే ఈ కుట్ర: గహ్లోత్‌
భాజపాతో చేతులు కలిపి రాజస్థాన్‌ సర్కార్‌ను కూల్చడానికి పైలట్‌ కుట్రపన్నినట్టు ముఖ్యమంత్రి గహ్లోత్‌ ధ్వజమెత్తారు. రాజ్‌భవన్‌ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ భాజపా, సచిన్‌పైలట్‌ల వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేయడం పూర్తి కుట్రపూరితమని అన్నారు. అక్కడ భాజపాతో కలిసి సర్కార్‌ను కూలగొట్టే ఎత్తులు వేశారని, ఇప్పుడు అవన్నీ చిత్తయ్యాయని పేర్కొన్నారు. వేటుపట్ల తామెవ్వరూ సంతోషంగా లేమని, విధిలేని పరిస్థితుల్లో హైకమాండ్‌ ఈ నిర్ణయం తీసుకొందని చెప్పారు. ‘‘భాజపా భారీ కుట్రకు తెరలేపింది. మా సహచరుడు (పైలట్‌) వారి మాయలోపడి దిల్లీకి వెళ్లిపోయారు. భాజపా నాయకులు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో చేసిన పనులనే ఇప్పుడు రాజస్థాన్‌లోనూ చేయాలనుకున్నారు. భాజపా రూపొందించిన స్క్రిప్ట్‌ ప్రకారం పైలట్‌ ఆడుతున్నారు. వారున్న రిసార్ట్స్‌ భాజపాదే’’ అని చెప్పారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద సభ్యత్వం పోతుంది
‘‘ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా భాజపాతో చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం నాటకాలు మొదలుపెట్టారు. కొత్తపార్టీ పెడతారని, భాజపాలోకి పోతారని రకరకాలుగా ప్రచారం చేశారు. పార్టీని చీల్చడం అంత సులభంకాదు. 20 మందితో అది సాధ్యం కాదు. మాకు 122 మంది మద్దతు ఉంది. నాయకత్వ మార్పు కావాలనుకున్నవారు శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుచేయమని చెబుతారు. శాసనసభాపక్ష నేతకు బలం లేకపోతే అక్కడే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయొచ్చు. విధానసభలో బలపరీక్ష నిరూపించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారంటే... భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కుట్రపన్నినట్లు స్పష్టమవుతోంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఎవరు పార్టీకివ్యతిరేకంగా వెళ్లినా వారి సభ్యత్వం అక్కడితో రద్దయిపోతుంది’’ అని గహ్లోత్‌ పేర్కొన్నారు.

అసెంబ్లీలోనే బలం నిరూపించుకోవాలి: భాజపా
గహ్లోత్‌ ఆరోపణలు, విమర్శల్ని భాజపా తిప్పికొట్టింది. కాంగ్రెస్‌లో సంక్షోభానికి అంతర్గత కలహాలే కారణమని, తమకేం సంబంధం లేదని స్పష్టంచేసింది. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి తన బలాన్ని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేసింది. ప్రజా విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందని, అందువల్ల గద్దె దిగాలని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్‌ పూనియా సూచించారు. భాజపా సీనియర్‌ నేతలు సమావేశమై సమాలోచనలు జరిపారు. పైలట్‌ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా విశ్వాస పరీక్ష కోసం డిమాండ్‌ చేశారు. గహ్లోత్‌ చెప్పిన మద్దతుదారుల సంఖ్యని వారు తోసిపుచ్చారు. పైలట్ చాలాకాలం పాటు కాంగ్రెస్‌ పార్టీ కోసం అంకిత భావంతోనే పనిచేశారని పార్టీ నేత జితిన్‌ప్రసాద అన్నారు.

పైలట్‌ మూడు డిమాండ్లే ఆగ్రహం తెప్పించాయా?
2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందువల్ల తనను 2022లో సీఎంను చేయాలని, ఆ మేరకు ఇప్పుడే అధికారికంగా హామీ ఇవ్వాలని పైలట్ గట్టిగా పట్టుపట్టినట్లు చెబుతున్నారు. తనతో పాటు తిరుగుబాటు చేసిన 16 మంది శాసనసభ్యులకు గహ్లోత్‌ సర్కారులో గౌరవప్రదమైన స్థానాలు కల్పించాలనేది ఆయన రెండో డిమాండ్‌. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యునిగా ఉన్న అవినాష్‌ పాండేను తొలగించాలనేది మూడో డిమాండ్‌. ఇవి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అధినాయకత్వం భావించి, వేటుకే మొగ్గు చూపిందని పార్టీ వర్గాల కథనం.

తలుపులు తెరిచే ఉంటాయ్‌: భాజపా
రాజస్థాన్‌ పరిణామాలతో తమకేం సంబంధం లేదని భాజపా కేంద్ర నాయకులు అంటున్నారు. రాష్ట్ర నేతలు మాత్రం రాజస్థాన్‌లో అధికారం చేపట్టే అవకాశం కోసం కసరత్తు చేస్తున్నారు. భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆ పార్టీ ఎంపీ ఓం మాధుర్‌ వంటివారు పైలట్‌పై సానుభూతి కురిపించారు. పార్టీ సిద్ధాంతంపై విశ్వాసం ఉన్నవారికి భాజపా తలుపులు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, రాజస్థాన్‌కు చెందిన పలువురు సీనియర్‌ నేతలు పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.