close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అభివృద్ధి చేయడమే నా తప్పా?

అలా అయితే నన్ను క్షమించండి
ఓటమి భయంతోనే  స్థానిక ఎన్నికలపై వైకాపా వెనకడుగు
మరుగుదొడ్లపైనా పన్నులా..
పీల్చే గాలిపైనా వేస్తారేమో?
భోగి వేడుకల్లో చంద్రబాబు
జీవో ప్రతుల దహనం

‘నేనేం తప్పు చేశానో నాకు తెలియదు. నన్ను క్షమించండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తప్పా. వైకాపా నాయకుల నాటకాలు నమ్మి ప్రజలు గుడ్డిగా ఓట్లేశారు’

- పరిటాలలో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలివి.

ఈనాడు, అమరావతి, నందిగామ, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తెలిసే.. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇటీవల ఉత్తరాది నుంచి వచ్చిన ఓ పగటి వేషగాడు ఇచ్చిన సూచన మేరకు తమపై అసత్య ప్రచార దాడిని వైకాపా నేతలు, ప్రభుత్వ పెద్దలు ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌ అన్ని విధాలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. మరుగుదొడ్లపై పన్నులు వేస్తున్న గాలిరెడ్డి.. మనం పీల్చే గాలిపైనా పన్ను వేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో తెదేపా ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన భోగి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..  ‘సీఎం మామూలు వ్యక్తి కాదు. విచిత్రమైన వ్యక్తి.. అలాంటి వారిని ఎక్కడా చూసి ఉండం.. మోసం, దగా చేస్తూ సానుభూతి కోసం నాటకాలకు తెరతీస్తారు’ అని ఆరోపించారు. 18 నెలల్లో ఏడుసార్లు తుపాన్లు వస్తే నష్ట పరిహారం చెల్లించని రైతు వ్యతిరేకి సీఎం జగన్‌ అని, బీమా పథకానికి స్వస్తి పలికారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే బీమా ప్రీమియం చెల్లించలేదని అసెంబ్లీలో నిలదీస్తే రాత్రికి రాత్రి జీవో ఇచ్చారని గుర్తు చేశారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడే మంత్రి, హవాలా, పేకాట, బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని.. మంత్రుల పేర్లు ఉచ్చరించడమూ తనకు ఇష్టం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అవినీతి మీటర్లు..
‘వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు పెట్టి.. ఉచిత విద్యుత్తుకు తిలోదకాలు ఇవ్వడం కాదు.. మీ పార్టీ ఎమ్మెల్యేలకు మీటర్లు అమరిస్తే ఎంత మేరకు అవినీతి చేశారో తెలుస్తుంది’ అని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. టమాటా, అరటి ధరలు భారీగా తగ్గిపోయి రైతులు నష్టపోతుంటే ఈ ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు టమాటా రైతుల వద్ద కొనుగోలు చేయించి ప్రజలకు తక్కువ ధరకు విక్రయించానని గుర్తు చేశారు. సుబాబుల్‌ టన్నుకు రూ.1,000కి కూడా కొనుగోలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మార్కెట్‌ యార్డుల ద్వారా సుబాబుల్‌ కొనుగోలు చేయించానన్నారు. 150 దేవాలయాలపై దాడులు జరిగితే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆరోపించారు. హిందూ దేవాలయాలపై మరోసారి దాడి జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. కంచికచర్లకు చెందిన ఓ వైద్యుడిపై గంజాయి కేసు బనాయిస్తామని బెదిరించి రూ.5 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. దీనికి పోలీసులు సహకరించడం చిత్రంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారులు, పోలీసులపై నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. ‘ఎన్నికల సంఘం ఒక్కటే ఎన్నికలు నిర్వహించదు.. అధికారులు, పోలీసులు అందరూ సమర్థంగా విధులు నిర్వహించినప్పుడే అక్రమాలకు తావుండదు. వైకాపా నాయకుల అక్రమాలు సాగవనే ఉద్దేశంతో ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెబుతున్నారు’ అని ధ్వజమెత్తారు.

మండిపడ్డ నేతలు
రాష్ట్ర రాజధాని కోసం చంద్రబాబు పిలుపు మేరకు 33వేల ఎకరాలు ఇచ్చి అమరావతి రైతులు త్యాగం చేశారని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజా ముఖ్యమంత్రి మన మధ్యలో బాబు రూపంలో ఉన్నారని, ఫేక్‌ ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాంతాతయ్య, నల్లగట్ల స్వామిదాసు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా ఆందోళనలు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: వరుస విపత్తులతో నష్టపోయిన రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడం దారుణమని తెదేపా నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘రైతాంగ వ్యతిరేక జీవోలు’ అని పేర్కొంటూ.. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన 5 జీవోలను భోగి మంటల్లో నాయకులు దహనం చేసి.. ఆందోళనలు నిర్వహించారు. 13 జిల్లాల్లో 140 నియోజకవర్గాల్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో వేల సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, బొబ్బిలిలో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, పెద్దాపురంలో ఎమ్మెల్యే చినరాజప్ప, రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెనాలిలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి తదితరులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ‘వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే జీవో నంబరు 22, రైతు రుణమాఫీ 4, 5 విడతలను రద్దు చేస్తూ ఇచ్చిన జీవో 99, కులాలు ఆపాదిస్తూ కౌలు రైతులకు భరోసా సొమ్ము ఎగ్గొట్టిన జీవో 96, రూ.2లక్షల నుంచి రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ ఎగ్గొడుతూ ఇచ్చిన జీవో 464, వైఎస్‌ జయంతి వేడుకులకు రైతుల నిధులు దుర్వినియోగం చేస్తూ ఇచ్చిన జీవో నంబరు 417లను భోగి మంటల్లో తగులబెట్టాం’ అని నేతలు వివరించారు.


బాబుకు ఘన స్వాగతం

వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకే పరిటాల చేరుకున్న మహిళలు, తెదేపా కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు జీవోలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన కోలాటం, భరత నాట్యం, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసు కథనం తదితర సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. నిర్వాహకులను, నృత్యం చేసిన చిన్నారులను అభినందించారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి దీవించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు