close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘కొవిన్‌’.. ఆరోగ్య సమాచార గని

పోర్టల్‌ను పక్కాగా రూపొందించిన కేంద్రం
వ్యాక్సినేషన్‌లోని ప్రతి కదలికా నిక్షిప్తం
ఈనాడు - అమరావతి

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆసాంతం పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొ-విన్‌ పోర్టల్‌.. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. డేటా సేకరణ, విశ్లేషణకు ఇది మున్ముందు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చిన్నారులు, గర్భిణులకు వేస్తున్న పది రకాల టీకా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేస్తున్నా.. కొవిన్‌ పోర్టల్‌ అంత సమగ్రంగా లేవు. దేశంలో విడతలవారీగా చేపట్టిన కొవిడ్‌ టీకా ‘డ్రై రన్‌’ సందర్భంగా ఎదురైన అనుభవాలతో కేంద్రం దీన్ని ఆధునికీకరించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి.. ఫార్మా కంపెనీలో ఔషధం తయారీ నుంచి రాష్ట్రాలకు తరలింపు, కోల్డ్‌ఛైన్‌ పాయింట్లలో నిల్వ, గ్రామాల్లో పంపిణీ కేంద్రాలకు చేర్చడం, ప్రజలకు వేయడం వరకూ ప్రతి దశనూ ఇందులో నిక్షిప్తం చేస్తున్నారు.
12 భాషల్లో సందేశాలు
కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన ప్రతి కేసూ అధికారికంగా నమోదయ్యేలా కొవిన్‌ పోర్టల్‌ రూపొందించారు. ఇప్పటికే నమూనాల పరీక్షలు, కేసులు, మరణాలు, కంటైన్‌మెంట్‌ జోన్ల వివరాలు ఇందులో పొందుపరుస్తున్నారు. తాజాగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలోని 15 రకాల వివరాలూ నమోదు చేస్తారు. దీనిపై 700 జిల్లాల్లో సుమారు లక్ష మందికి శిక్షణ ఇచ్చారు. తెలుగు, ఆంగ్లం, హిందీ, కన్నడ, మలయాళీ, బెంగాలీ, పంజాబీ, ఒడిస్సా, మరాఠీÈ, గుజరాతీ, అస్సామీ, ఛత్తీస్‌ఘరీ భాషల్లో ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు.
చాట్‌ బాక్స్‌ సౌకర్యం!
లబ్ధిదారులు టీకా కేంద్రాల్లో వివరాలు చెప్పేటప్పుడు ‘వాయిస్‌’ను బట్టి ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకునేలా చాట్‌ బాక్స్‌ సౌకర్యం కల్పించారు. పేరు, వయసు, ఇతర వివరాలు చెబుతుంటే.. ‘టిక్‌’లు పడుతుంటాయి. తద్వారా టీకా కేంద్రంలో సమయం కలిసొస్తుంది.
మీట నొక్కగానే వివరాలు
దేశవ్యాప్తంగా 28 వేల కోల్డ్‌ఛైన్‌ పాయింట్లు ఉన్నాయి. అన్నింటినీ పోర్టల్‌తో అనుసంధానం చేశారు. ఏ వ్యాక్సిన్‌ ఏ రాష్ట్రానికి పంపించారు? ఏ కేంద్రంలో నిల్వ చేశారు? వేసిన డోసులెన్ని? రోజుకు ఎంత వాడుతున్నారన్న వివరాలు క్షణాల్లో కేంద్రానికి తెలిసిపోతాయి.
ప్రయోజనాలు!
టీకా వేసుకున్నవారి పేరు, సెల్‌ఫోన్‌ నంబరు, మండలం, పిన్‌ నంబరు, జిల్లాల వారీగా తెలుసుకొనేలా పోర్టల్‌ను రూపొందించారు. పంపిణీ కేంద్రంలో ఉండే ఏఎన్‌ఎం లాగిన్‌ అయ్యాక మాత్రమే అక్కడి డిజిటల్‌ అసిస్టెంట్‌ తన మొబైల్‌/ ట్యాబ్‌ ద్వారా ఈ వివరాలు చూడగలరు. శనివారం సెకనుకు 2,45,000 మంది కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించారు. ఇందులోని సమాచారాన్ని కేంద్రం ఇతర అవసరాలకూ వాడుకునేలా ఆలోచిస్తోంది. కొవిన్‌ యాప్‌ను రెండు మూణ్నెళ్లలో ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ప్రజలు యాప్‌లోని ప్రశ్నావళి ప్రకారం సమాధానాలు నింపి సొంతంగా ప్రీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

క్యూఆర్‌ కోడ్‌తో సమాచారం

టీకా వేసుకునే వారు వ్యక్తిగత వివరాలు సమర్పించి ప్రీ-రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వారి సెల్‌ఫోన్‌కు వచ్చే ఎస్సెమ్మెస్‌ను బట్టి టీకా కేంద్రానికి వెళ్లాలి. అందులో ప్రతి ప్రక్రియ ఆ వ్యక్తి పేరుతో పోర్టల్‌లో నమోదవుతుంది. దీన్ని లాగిన్‌ హక్కులు ఉన్న వైద్య సిబ్బంది మాత్రమే ప్రింట్‌ తీసుకోగలరు. క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ద్వారా టీకా వేసిన సమయం, సిబ్బంది, కేంద్రం, తదుపరి వ్యాక్సినేషన్‌ సమాచారం తెలుసుకోవచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు