మీ అధికారాలను వాడండి

ప్రధానాంశాలు

మీ అధికారాలను వాడండి

ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోండి
నిష్పాక్షికంగా నిర్వహించండి
బెదిరింపులు, భయాందోళనలకు ఆస్కారం ఉండకూడదు
ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశం
యంత్రాంగం సహకారంపై ఆశాభావం

అన్ని అధికారాలనూ వినియోగించి, ఎప్పటికప్పుడు యంత్రాంగానికి తగిన ఆజ్ఞలు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ ఆదేశాలిస్తున్నాం. ఇదే అంశాలకు సంబంధించి పలు వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో ఈ తరహా ఉత్తర్వులిస్తున్నాం. పిటిషనర్లు సమర్పించిన ఫిర్యాదులు, వినతులను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలి.

- రాష్ట్ర హైకోర్టు

ఈనాడు, అమరావతి: ఎన్నికల అక్రమాలపై స్పందించాలని, అన్ని అధికారాలను వినియోగించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్‌ఈసీ) హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు సృష్టించడం, బలవంతంగా ఉపసంహరింపచేయడం, తదితర వ్యవహారాలను సరైన దృష్టికోణంతో చూడాలని స్పష్టం చేసింది. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించి రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించాలని పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణలు ఒకవేళ నిజమైతే అవి తీవ్రమైనవని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరు శాసనసభ నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాల్లో అధికార పార్టీ మద్దతుదారులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నా నిలువరించడంలో ఎస్‌ఈసీ, జిల్లా కలెక్టర్‌ విఫలమయ్యారని పేర్కొంటూ పుంగనూరు నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి ఎన్‌.అనీషారెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని గ్రామాల్లో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ తెదేపా మాజీ ఎమ్మెల్యే శంకర్‌ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని కొన్ని గ్రామాల్లో బలవంతపు ఏకగ్రీవాలపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు. పలు చోట్ల నామినేషన్లు వేయనీయకుండా అధికార పార్టీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. దస్త్రాలను చించేస్తున్నారు. అతికష్టం మీద నామినేషన్‌ వేసినా.. తర్వాత ఏదో ఒక కారణంతో వాటిని తిరస్కరిస్తున్నారు.
తిరస్కరణకు గురైనట్లు ఉత్తర్వులివ్వాలన్నా బయటకు ఇవ్వరు. ఈ వ్యవహారంపై ఎస్‌ఈసీకి పలు ఫిర్యాదులు అందినా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో అధికార యంత్రాగం అంతా ఎస్‌ఈసీ పర్యవేక్షణలో ఉన్నా.. చర్యలు లేవు. ప్రతీ ఒక్కరు ఎస్‌ఈసీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు ఇవ్వాలంటే కుదరదు. ఎన్నికల్ని సజావుగా నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత ఉంది. తగిన చర్యలు తీసుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైంది. కేవలం ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చి.. బాధ్యత తీరిపోయిందనుకుంటే కుదరదు. ప్రకటన నాటి నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉంది. ఐదు మండలాల్లోని 85 గ్రామ పంచాయతీల్లో 82 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన ఆదేశాలివ్వండి...’ అని కోరారు. దీనిపై ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు పంపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం. ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అధికారులు విఫలమైనట్లు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం...’ అని వెల్లడించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదు. నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కోర్టుకు రావాలే తప్ప.. వారందరి తరఫున పిటిషనర్‌ వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదు...’అని పేర్కొన్నారు.
ఎన్నికల కమిషనర్‌కు విస్తృతాధికారాలనిచ్చారు
‘అభ్యర్థులను నామినేషన్‌ దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని, మరికొన్ని చోట్ల బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపచేస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. అన్నీ సక్రమంగా ఉన్న నామినేషన్లను అనర్హమైనవిగా ప్రకటిస్తున్నారని, దస్త్రాలను చించేస్తున్నారని ఆరోపణ చేశారు. పిటిషనర్‌ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ దశలో న్యాయస్థానం లోతైన అంశాల్లోకి వెళ్లడం లేదు...’ అని జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు పేర్కొన్నారు. ‘స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షిక ఎన్నికలు ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి పునాది. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పోటీ చేయడం... భయాందోళన, బెదిరింపులకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోగలిగే ఎన్నికలు ప్రజాస్వామ్య పితామహుల ఆకాంక్ష. ఈ తరహా ఎన్నికలు ప్రతి స్థాయిలో జరగాలి. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు, తగిన విధంగా వ్యవహరించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు విస్తృతాధికారాలను ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో కమిషనర్‌ అధికారాల గురించి చెబుతూ.. అధికరణ 324లో పర్యవేక్షణ, మార్గదర్శకం, నియంత్రణ అనే పదాన్ని వినియోగించారు. ఆ పదాలు ఉత్త పదాలేమీ కాదు. ప్రజాస్వామ్యపరంగా వైవిధ్యమైన భారతదేశం లాంటి పెద్ద దేశంలో అనేక పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) రాజ్యాంగం అధికారం కల్పించింది. పరిస్థితుల ఆధారంగా.. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలి.  ఈ కారణంగానే పర్యవేక్షణ, మార్గదర్శకం, నియంత్రణ, నిర్వహణ విషయంలో ఎస్‌ఈసీకి సాధారణ అధికారాలు కల్పించారు. ఎన్నికల కమిషనర్‌ మొత్తం అధికారానికి ఏకైక కేంద్రబిందువుగా సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషన్లోని వాస్తవాలు, ఆరోపణలపై ఈ న్యాయస్థానం మాట్లాడటం లేదు. ఉత్పన్నమైన అంశాలపై వెంటనే దృష్టి సారించాలి. ఉక్కు కవచాలైన బ్యూరోక్రసీ/పోలీసులు, రెవెన్యూ, ఇతర అధికారులు విధి నిర్వహణలో ఎస్‌ఈసీకి సహాయసహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయడానికి ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేస్తున్నాం...’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని