మండలి రద్దుపై ఒత్తిడి చేయం

ప్రధానాంశాలు

మండలి రద్దుపై ఒత్తిడి చేయం

ఇప్పుడు మాకొచ్చిన అవకాశాన్ని వాడుకుంటాం
సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు
నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఈనాడు, అమరావతి: ‘శాసన మండలిని రద్దు చేయాలని కోరుతూ గతంలో పంపిన తీర్మానంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయబోమని, అది కేంద్రం పరిశీలనలోనే ఉందని, ఏ నిర్ణయం వచ్చినా తాము సిద్ధపడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గవర్నరు కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన మోసేను రాజు, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్‌ యాదవ్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడిలోని శాసన మండలి ఛైర్మన్‌ కార్యాలయంలో ప్రొటెం ఛైర్మన్‌ బాలసుబ్రమణ్యం వారితో ప్రమాణం చేయించారు. తర్వాత కొత్త ఎమ్మెల్సీలతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అధికార వికేంద్రీకరణ బిల్లుపై మాట్లాడుతూ.. ‘ఆ అంశం కోర్టులో ఉంది. దానికి సమయం ఉంది. ఈ లోగా దానిపై చేయాల్సింది చేస్తాం. శాసన మండలిలో వారికున్న సంఖ్యాబలంతో ఈ బిల్లును అడ్డుకోవాలని తెదేపావారు గతంలో ప్రయత్నించారు. సాంకేతిక అంశాలను పట్టుకుని ఈ అంశాన్ని ఎంత దూరం లాగాలో అంతా చేశా రు. రాజకీయం అంటే ఎత్తుగడలు అని మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అదీ (వికేంద్రీకరణ బిల్లు) వస్తుంది. మిగిలినవీ వస్తాయి.. సజావుగా మండలి జరుగుతుంది. మాకు పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘శాసన మండలికి వైకాపా ద్వారా తొలి నుంచి ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు 14 మందిని, అగ్రవర్గాలకు చెందిన 11 మందిని వైకాపా తరపున పంపాం..’ అని సజ్జల తెలిపారు.

కొత్త ఎమ్మెల్సీ స్పందన ఇలా..
కొత్త ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి జగన్‌ టికెట్ల కేటాయింపు నుంచి పదవుల వరకు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారు’ అని మోసేను రాజు అన్నారు. తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ‘నేను చాలాకాలం నుంచి ప్రజల ఆశీస్సులతోనే ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యా, మొట్టమొదటిసారిగా నా 25ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక నాయకుడి ఆశీస్సులతో శాసనమండలికి వచ్చా..పార్టీ, నా సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తా’ అని తెలిపారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘వైకాపా ఆవిర్భావం తర్వాత పార్టీ జెండా పట్టుకొని పనిచేసిన వారికి గుర్తింపునిస్తూ పదవులను ముఖ్యమంత్రి జగన్‌ ఇస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. రమేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ పేదలు, యాదవ సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఇతర మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, తానేటి వనిత, అనిల్‌, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

అప్పుడు వద్దనుకున్న మండలి ఇప్పుడు కావాలా?
వర్ల రామయ్య

‘శాసనమండలిలో మెజారిటీ తక్కువగా ఉన్నప్పుడు రద్దు తీర్మానం చేసి ఇప్పుడు బలం పెరిగాక మండలిని స్వాగతించడం అవకాశవాద రాజకీయాలు కావా జగన్‌..? ఎస్సీలు మీ బంధువులన్నారు. వారిపై దాడులు చేస్తే మాత్రం స్పందించరు. అసలు బంధువులను అందలమెక్కిస్తారు’ అని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని