ప్రతిపక్షాల కొత్త కలయిక..!
close

ప్రధానాంశాలు

ప్రతిపక్షాల కొత్త కలయిక..!

శరద్‌పవార్‌ ఇంట్లో 8 పార్టీల నేతల కీలక భేటీ
దేశ రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు
తృతీయ కూటమి కోసం కాదన్న నాయకులు

ఈనాడు, దిల్లీ: దేశ రాజకీయాల్లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ నివాసంలో ఎనిమిది విపక్ష పార్టీలకు చెందినవారు సమావేశమై సమాలోచనలు జరిపారు. రాష్ట్ర మంచ్‌ అధ్యక్షుడు యశ్వంత్‌సిన్హా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు, వాటి నేతలు పాల్గొనకపోయినా.. మున్ముందు భాజపా వ్యతిరేక కూటమి కట్టేందుకు భావ సారూప్య పార్టీలను నెమ్మదిగా ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయింది. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, సమాజ్‌వాదీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌, సీపీఐ, సీపీఎం నేతలు దీనిలో పాల్గొన్నారు. గేయ రచయిత జావేద్‌ అఖ్తర్‌, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏపీ షా, మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్‌ కూడా పాలుపంచుకున్నారు. శరద్‌ పవార్‌ (ఎన్సీపీ), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), జయంత్‌సిన్హా (ఆర్‌ఎల్‌డీ) తప్పితే మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి నేతలే హాజరయ్యారు. కాంగ్రెస్‌, శివసేన, ఆర్‌జేడీ, బీజేడీ, డీఎంకె, తెరాస, తెదేపా, వైకాపా, జేడీఎస్‌, బీఎస్పీ, అకాలీదళ్‌, జేఎంఎం నేతలెవ్వరూ పాల్గొనలేదు. దీన్నిబట్టి ఇది పూర్తిస్థాయి రాజకీయ మేధోమథనం కాదని తెలుస్తోంది. వామపక్షాల నుంచి అగ్రనేతలు సీతారాం ఏచూరి, డి.రాజా పాల్గొంటారని ప్రచారం జరిగినా వారు తమ పార్టీల ప్రతినిధులను మాత్రమే పంపారు. కాంగ్రెస్‌కు రాష్ట్ర మంచ్‌ నుంచి ఆహ్వానం వెళ్లలేదని సమాచారం. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ మంగళవారం రాత్రి శరద్‌పవార్‌ను విడిగా కలిశారు. 

కలిసొచ్చే పార్టీలను ఏకం చేయాలనే ఉద్దేశం

భావసారూప్య ఆలోచనలు, ప్రజా సమస్యలపై పోరాటాల ఆధారంగా నిదానంగా కలిసి వచ్చే పార్టీలను ఏకం చేయాలన్న ఉద్దేశంతో తాజా సమావేశానికి బీజం వేశారని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో మోదీని ఎదుర్కొనే నేతను ఏకగ్రీవంగా ఎన్నుకొని 2024 ఎన్నికలకు వెళ్లాలనేది వీరి ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ‘‘2024 ఎన్నికల గురించి చర్చే రాలేదు.’’ అని సమావేశానంతరం సీపీఎం సీనియర్‌ నేత నీలోత్పల్‌ బసు చెప్పారు. ‘‘భాజపా వ్యతిరేక పార్టీలను ఒక్కటిగా చేయడానికి పవార్‌ దీనిని ఏర్పాటు చేశారని చెప్పడంలో నిజం లేదు’’ అని ఎన్‌సీపీ సీనియర్‌ నేత మాజీద్‌ మెమన్‌ చెప్పారు. 

రాజకీయాలు మాట్లాడే సమయం కాదు: రాహుల్‌

విపక్ష నేతల భేటీపై ప్రశ్నలకు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమాధానాలు దాటవేశారు. రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని వర్చువల్‌ విలేకరుల సమావేశంలో చెప్పారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విలేకరులతో మాట్లాడుతూ తృతీయ కూటమితో తనకు  సంబంధం లేదన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని