వాదనలకు సిద్ధంకండి

ప్రధానాంశాలు

వాదనలకు సిద్ధంకండి

మూడు కేసుల్లో జగన్‌ సహా నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన మూడు కేసుల్లో అభియోగాల నమోదుతోపాటు డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాన నిందితుడు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో సహా ఇతర నిందితులకు సోమవారం సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అరబిందో, హెటిరో, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, ఇందూ-గృహ నిర్మాణ మండలి కేసుల్లోని నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించాలని సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు ఆదేశించారు. అరబిందో, హెటిరో కేసుల్లో... హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందిన హెటిరో కంపెనీతోపాటు, ఎం.డి. శ్రీనివాసరెడ్డి మినహా మిగిలిన నిందితులు జగన్‌, సాయిరెడ్డి, అరబిందో ఎం.డి. నిత్యానందరెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎం.డి. శరత్‌శ్చంద్రారెడ్డి, ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్య, వై.వి.ఎల్‌.ప్రసాద్‌లు, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లో... జగన్‌, సాయిరెడ్డిలతోపాటు ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇందూ ప్రాజెక్ట్స్‌, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జె.గీతారెడ్డి, ఐఏఎస్‌ డి.మురళీధర్‌రెడ్డి, బి.పి.ఆచార్య, మాజీ ఐఏఎస్‌ శామ్యూల్‌, జగతి పబ్లికేషన్స్‌, ఇందూ-గృహ నిర్మాణ మండలి కేసుల్లో... జగన్‌, సాయిరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వి.వి.కృష్ణప్రసాద్‌ల తరఫు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. డిశ్ఛార్జి పిటిషన్‌లు దాఖలు చేసినట్లయితే వాటిలో, లేదంటే అభియోగాల నమోదుకు సంబంధించి వాదనలు వినిపించాలంటూ తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.

జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
అక్రమాస్తుల వ్యవహారాల కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు షరతులను ఉల్లంఘిస్తున్నారని, బెయిలును రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. సీబీఐ తరఫు న్యాయవాది ఆరోగ్య కారణాల దృష్ట్యా హాజరు కాలేకపోవడంతో, సీబీఐ విజ్ఞప్తి మేరకు విచారణను సీబీఐ కోర్టు వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని