వానాకాలం వెళ్లగానే పట్టణ రోడ్లకు మరమ్మతులు

ప్రధానాంశాలు

వానాకాలం వెళ్లగానే పట్టణ రోడ్లకు మరమ్మతులు

మూడు నెలల్లో లబ్ధిదారులకు 45 వేల టిడ్కో ఇళ్లు
పురపాలకశాఖపై సమీక్షలో సీఎం జగన్‌
ఈనాడు - అమరావతి

ర్షాకాలం ముగియగానే నగరాలు, పట్టణాల్లో రహదారుల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రహదారులు, భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖతో సమన్వయం చేసుకొని కార్యాచరణ రూపొందించాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన పురపాలకశాఖ పనితీరుపై మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సమీక్షించారు. పట్టణాల్లో రహదారులు, మురుగునీటి శుద్ధి, భూగర్భ మురుగునీటి వ్యవస్థలు, టిడ్కో ఇళ్లు, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు తదితర అంశాలపై అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. ‘మురుగు నీటితో నదులు కలుషితం కాకుండా పీసీబీ సిఫార్సుల మేరకు మంగళగిరి, తాడేపల్లి, మాచర్ల, కర్నూలులో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. విశాఖ, విజయవాడ, తిరుపతి తరహాలో రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంలోనూ భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. విజయవాడ, గుంటూరు, నెల్లూరులో భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ) పనులు పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులను అసంపూర్తిగా విడిచి పెట్టారు’ అని సీఎం వివరించారు.

‘నిర్దేశించుకున్న షెడ్యూల్‌ ప్రకారం మొదటి విడతలో 38 ప్రాంతాల్లో చేపట్టిన 85,888 టిడ్కో ఇళ్లలో 45 వేలకుపైగా ఇళ్లు మూడు నెలల్లోగా, మిగతావి డిసెంబరులోగా లబ్ధిదారులకు అప్పగించాలి. మౌలిక వసతుల విషయంలో రాజీ పడొద్దు. అన్ని రకాల వసతులతో లబ్ధిదారులకు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

వీటి కోసం మధ్యవర్తులు, ఇతరులపై ఆధారపడాల్సిన అవసరంలేని పరిస్థితిని రాష్ట్రంలో తీసుకొచ్చాం. అర్హులు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని సృష్టించాం. భారీ ఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు మంజూరు చేశాం. మరో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రాంరభించాం’ అని జగన్‌ వివరించారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అధికారులు సన్నద్ధం కావాలి. పులివెందులలో మహిళా మార్ట్‌ నిర్వహణ బాగుంది. తక్కువ ధరలకు సరకులు అందుబాటులో ఉంచే ప్రయత్నం అభినందనీయం. ఇదే తరహాలో మిగతాచోట్ల కూడా మహిళా మార్ట్‌ల ఏర్పాటుకు ప్రయత్నించాలి. అని సీఎం అన్నారు. విశాఖలో చేపట్టనున్న బీచ్‌కారిడార్‌, మల్టీలెవల్‌ కార్‌పార్కింగ్‌, నేచురల్‌ హిస్టరీ పార్క్‌, మ్యూజియం ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వైఎస్‌ఆర్‌ పట్టణ క్లినిక్‌ ప్రాజెక్టు పనుల్లో పురోగతిపైనా అధికారులకు పలు ఆదేశాలిచ్చారు.


ఒక్కో ఇంటికి మూడు ప్లాస్టిక్‌ బుట్టల సరఫరా

రాష్ట్రంలోని 124 పుర, నగరపాలక సంస్థల్లోని 40 లక్షల ఇళ్లకు మూడు చొప్పున 1.2 కోట్ల ప్లాస్టిక్‌ బుట్టలు సరఫరా చేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)లో భాగంగా ఇళ్ల నుంచి చెత్త సేకరణకు చేస్తున్న ఏర్పాట్లపై వారు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇళ్లలోని తడి, పొడి, ఇతర వ్యర్ధాలను వేర్వేరుగా వేసేలా ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగుల బుట్టలు అందజేస్తామన్నారు. ఈ వ్యర్థాల తరలింపు కోసం 4,868 వాహనాలు వినియోగిస్తున్నట్లు అధికారులు వివరించారు. సేకరించిన వ్యర్థాల్లో 50-60% వరకు తడి చెత్తను బయోడీగ్రేడ్‌ విధానంలో శుద్ధి చేస్తామని, పొడి చెత్తను రీసైకిల్‌ చేసి పునర్వినియోగానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు తెలిపారు. ఇందులో కొంత పొడి చెత్తను సిమెంట్‌ ఫ్యాక్టరీలకు కూడా తరలిస్తారని వివరించారు. 72 పట్టణాల్లో సమగ్ర ఘన వ్యర్థాల ప్లాంట్ల ఏర్పాటుకు ఆగస్టు 15కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 2022 జులైకల్లా ప్లాంట్లు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని