శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ప్రధానాంశాలు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

సున్నిపెంట సర్కిల్‌, అచ్చంపేట, న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 4,78,000 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 53,774 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం 10 రేడియల్‌ గేట్లను 20 అడుగుల మేర పైకెత్తి స్పిల్‌ వే ద్వారా 4,67,920 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 62,432 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 883.50 అడుగులుగా నమోదైంది. నీటిని విడుదల చేస్తుడటంతో యాత్రికులు, సందర్శకులు, స్థానిక ప్రజలు ఆనకట్ట వద్ద్దకు చేరుకొని వీక్షిస్తున్నారు.

నాగార్జున సాగర్‌కు 24 గంటల్లో... 32 టీఎంసీలు
శ్రీశైలం నుంచి వచ్చి చేరుతున్న జలాలతో నాగార్జునసాగర్‌  నిండుకుండలా మారుతోంది. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటి నిల్వ 264.85 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 573.90 అడుగులు ఉంది. శుక్రవారం జలాశయంలో నిల్వ 232.61 టీఎంసీలు ఉండగా 24 గంటల్లో మరో 32.24 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 36,484 క్యూసెక్కులను నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు మూడో రోజూ వరద కొనసాగుతోంది. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ఎగువ నాగార్జునసాగర్‌ పరీవాహక ప్రాంతం నుంచి 38,701 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా ఉంది. రెండు గేట్లు తెరిచి 24,901 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి వినియోగించిన 13,200 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వెళ్తోంది. ప్రాజెక్టులో 43.10 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఏఈఈ రాజశేఖర్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని