పరిషత్తు ఏకపక్షమే

ప్రధానాంశాలు

పరిషత్తు ఏకపక్షమే

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా సునాయాస గెలుపు
తెదేపా ఎన్నికల బహిష్కరణతో పోటీ నామమాత్రం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో అధికార పార్టీ వైకాపా అలవోకగా గెలిచింది. 13 జిల్లా పరిషత్తుల్నీ వైకాపానే చేజిక్కించుకోనుంది. ఎంపీటీసీ స్థానాలనూ ఆ పార్టీ భారీ ఎత్తున గెలిచింది. మొత్తం 515 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా ఆదివారం అర్ధరాత్రి వరకూ వెలువడిన ఫలితాల్లో అధికార పార్టీ 462 స్థానాల్ని కైవసం చేసుకుంది. 7,219 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగ్గా.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయానికి వైకాపా 5,916 స్థానాల్లో విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఎన్నికలను బహిష్కరించడం, గట్టి పోటీనిచ్చే ప్రత్యర్థులు లేకపోవడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా విజయం నల్లేరుపై బండి నడకలా సాగింది. తెదేపా అభ్యర్థులు ఆరు జడ్పీటీసీ స్థానాల్లోనూ 809 ఎంపీటీసీ స్థానాల్లోనూ విజయం సాధించారు.  రెండు, మూడు మండలాల్లో వైకాపా కంటే తెదేపా ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్ని చేజిక్కించుకుంది. 164 ఎంపీటీసీ స్థానాలు గెలిచి జనసేన మూడో స్థానంలో నిలిచింది.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు రావడం మొదలైంది. రాత్రి 10 గంటల సమయానికి మెజార్టీ ఫలితాలు వెలువడ్డాయి.

జడ్పీటీసీల్లో ఫ్యాన్‌ గాలి

జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైకాపా స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా.. వాటిలో 126 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు చనిపోవడంతో 11 చోట్ల, ఇతర కారణాలతో 8 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. 515 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలు వెలువడేసరికి నర్సీపట్నం (విశాఖ జిల్లా), మోపిదేవి (కృష్ణా జిల్లా), గోపవరం (కడప), అగళి (అనంతపురం), వి.ఆర్‌.పురం (తూర్పుగోదావరి), ఆచంట (పశ్చిమగోదావరి) జడ్పీటీసీ స్థానాల్ని తెదేపా, అనంతగిరి (విశాఖ జిల్లా) జడ్పీటీసీని సీపీఎం, వీరవాసరం (పశ్చిమగోదావరి) స్థానాన్ని జనసేన గెలుచుకున్నాయి. అనంతపురం జిల్లా రోళ్లలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థి నెగ్గారు.

ఎంపీటీసీల్లోనూ అదే జోరు..

రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు చనిపోవడంతో 81 చోట్ల, ఇతర కారణాల వల్ల 376 చోట్ల ఎన్నికలు జరగలేదు. 7,220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో దాదాపు అన్ని జిల్లాల్లో వైకాపా స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో తెదేపాకు కాస్తంత ఆశావహ ఫలితాలు వచ్చాయి. జనసేనకు ఉభయగోదావరి జిల్లాల్లో మెరుగైన ఫలితాలు దక్కాయి. ఆ పార్టీ గెలిచిన 164 ఎంపీటీసీ స్థానాల్లో 140 ఆ రెండు జిల్లాల్లోనే గెలవడం విశేషం.

ఎన్నికలను బహిష్కరించిన తెదేపా

ఏప్రిల్‌ 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని పరిషత్‌ ఎన్నికలకు రెండోసారి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘ ఏకపక్ష నిర్ణయం, ప్రభుత్వ అప్రజాస్వామిక, అరాచక విధానాలకు నిరసనగా పరిషత్‌ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు తెదేపా ప్రకటించింది. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు, అరాచకాలు, ప్రస్తుత ఎస్‌ఈసీ వ్యవహరించిన తీరు చూశాక... పరిషత్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరుగుతాయని, తెదేపా అభ్యర్థులు మెజార్టీ ఓట్లు సాధించినా గెలిచినట్టు ప్రకటిస్తారని, అక్రమ కేసులతో వేధించరనే నమ్మకం తమకు లేదని..  అందుకే ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయించామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్ని తెదేపా బహిష్కరించినప్పటికీ.. నామినేషన్ల ప్రక్రియ గత ఏడాది మార్చిలోనే పూర్తవడం, అప్పట్లో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే మళ్లీ కొనసాగించడంతో తెదేపా అభ్యర్థులు పోటీలో కొనసాగినట్టయింది. అయితే తెదేపా ఎన్నికల ప్రక్రియను పట్టించుకోకపోవడంతో, మండలం యూనిట్‌గా ఎన్నికలు జరిగే జడ్పీటీసీల్లో ఆ పార్టీకి స్వల్ప స్థానాలే దక్కాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో స్థానికంగా వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది కాబట్టి, తెదేపా తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు కొన్ని చోట్ల ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఫలితంగా మొత్తం ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ స్థానాల్లో 12 శాతం తెదేపా గెలుచుకుంది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో మాదిరిగానే... కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో విపక్ష పార్టీల అభ్యర్థులు గెలిచినచోట, ఒకటికి రెండుసార్లు రీకౌంటింగ్‌ చేసి వైకాపా అభ్యర్థులు గెలిచినట్టుగా అధికారులు ప్రకటించడం, అదే వైకాపా అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో గెలిచినచోట్ల విపక్ష అభ్యర్థులు రీకౌంటింగ్‌కి పట్టుబట్టినా అధికారులు పట్టించుకోకపోవడం వివాదాస్పదమైంది.

దుగ్గిరాలలో తెదేపా

గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలతోపాటు, మరికొన్ని మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపా గట్టి పోటీనిచ్చింది. మంగళగిరి నియోజకవర్గంలోని ఒక్క దుగ్గిరాల మండలంలోనే ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను తెదేపా 9, వైకాపా 8, జనసేన 1 స్థానం గెలిచాయి.

విజయనగరం జిల్లా బాడంగి మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు తెదేపా, వైకాపా చెరో ఏడు స్థానాలు గెలుచుకున్నాయి. రామభద్రపురంలో మొత్తం 14 స్థానాలకుగాను తెదేపా ఆరు, వైకాపా నాలుగు, స్వతంత్ర అభ్యర్థులు మూడు చోట్ల గెలిచారు. వారిలో ఒకరు తెదేపా తిరుగుబాటు అభ్యర్థి. ఒక స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో ఎన్నిక జరగలేదు. బొబ్బిలి మండలంలో 19 స్థానాలుంటే వైకాపాకు ఒకటి ఏకగ్రీవమైంది. తెదేపా, వైకాపా చెరో 9 స్థానాల్లో గెలిచాయి.  

విశాఖ జిల్లా జి.మాడుగులలో 15 స్థానాలకుగాను వైకాపా, తెదేపా చెరో ఏడింట గెలిచాయి. ఒకచోట వైకాపా తిరుగుబాటు అభ్యర్థి విజయం సాధించారు. రావికమతం మండలంలో 20 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా, తెదేపా చెరో 10 స్థానాల్లో నిలిచాయి.  

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకుగాను 8 తెదేపా, ఏడు వైకాపా గెలిచాయి.

విపక్ష పార్టీల అభ్యర్థులకు ఆధిక్యం వచ్చినా..

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో మాదిరిగానే... ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొన్నిచోట్ల విపక్ష పార్టీల అభ్యర్థులకు స్పష్టమైన ఆధిక్యత లభించినా రీకౌంటింగ్‌ చేసి వైకాపా అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించడం వివాదాలకు కారణమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం పెదకొండూరు ఎంపీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థికి 63 ఓట్ల ఆధిక్యం లభించింది. వైకాపా విజ్ఞప్తి మేరకు రీకౌంటింగ్‌ చేసి.. జనసేన అభ్యర్థికి 39 ఓట్ల ఆధిక్యత వచ్చినట్టు చెప్పారు. అయినా వైకాపా పట్టుబట్టడంతో మళ్లీ రీకౌంటింగ్‌ చేసి వైకాపా అభ్యర్థి 21 ఓట్లతో గెలుపొందినట్టుగా ప్రకటించారు.  

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గొడియాడ ఎంపీటీసీ స్థానంలో మొదట ఐదు ఓట్ల తేడాతో తెదేపా గెలిచిందని ప్రకటించారు. రీకౌంటింగ్‌లో... ఐదు చెల్లని ఓట్లను వైకాపాకు కలపడంతో రెండు పార్టీలకూ ఓట్లు సరిసమానమయ్యాయి. లాటరీ వేయగా తెదేపా గెలిచింది. భోగాపురం మండలం గుడివాడలో నాలుగు ఓట్ల తేడాతో వైకాపా గెలిచిందని ప్రకటించారు. రీకౌంటింగ్‌ చేయాలని తెదేపా అభ్యర్థి ఎంత పట్టుపట్టినా అధికారులు వినలేదు.

విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలోని కాడలిలో తెదేపా, వైకాపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్‌ చేసినా మళ్లీ సమానంగానే వచ్చాయి. రెండోసారి రీకౌంటింగ్‌ చేసి వైకాపా ఒక్క ఓటుతో గెలిచినట్టు ప్రకటించారు.

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థిని మౌనిక ఐదు ఓట్ల ఆధిక్యం సాధించారు. వైకాపా పట్టుతో రీకౌంటింగ్‌ చేసిన అధికారులు ఆ పార్టీ అభ్యర్థి వెంకట లక్ష్మమ్మ ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచినట్టు ప్రకటించారు. దీంతో తెదేపా కార్యకర్తలు ధర్నాకు దిగారు.
కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువు ఎంపీటీసీ స్థానంలో వైకాపా అభ్యర్థికి భాజపా అభ్యర్థిపై ఐదు ఓట్ల ఆధిక్యం వచ్చింది. భాజపా రీకౌంటింగ్‌ చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు.


ప్రతి కుటుంబం, మనిషి పట్ల నా బాధ్యత మరింత పెంచాయి
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. సోమవారం ఉదయంలోపు పరిషత్‌ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వస్తాయి. సోమవారం ఉదయం మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా’ అని ముఖ్యమంత్రి జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని