నాడు భారత్‌లో విధ్వంసానికి కుట్ర

ప్రధానాంశాలు

నాడు భారత్‌లో విధ్వంసానికి కుట్ర

దిల్లీలో 2017లోనే చిక్కిన కాబుల్‌ బాంబర్‌
అరెస్టు చేసి అఫ్గాన్‌కు అప్పగించిన పోలీసులు
గత నెలలో జైలు నుంచి బయటికొచ్చి విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి

దిల్లీ: కాబుల్‌ విమానాశ్రయం వద్ద గత నెల 26న ఆత్మాహుతి దాడితో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది గురించి పలు కీలక విషయాలు బయటికొచ్చాయి. దిల్లీలో భారీ విధ్వంసానికి ఒకప్పుడు అతడు కుట్ర పన్నాడు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన భారత్‌ నాలుగేళ్ల క్రితమే అతణ్ని అరెస్టు చేసి, అఫ్గాన్‌కు అప్పగించగా.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత జైలు నుంచి విడుదలై కాబుల్‌లో నరమేధానికి పాల్పడ్డాడు. భారత్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద విభాగంగా పేరున్న ఐఎస్‌ డబ్ల్యూహెచ్‌ (విలయత్‌ హింద్‌) తన మేగజీన్‌ ‘సాట్‌ అల్‌-హింద్‌’లో ఆ ముష్కరుడికి సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించింది. అందులోని వివరాల ప్రకారం.. కాబుల్‌లో ఆత్మాహుతి దాడి జరిపిన ఉగ్రవాది పేరు అబ్దుర్‌ రహ్మాన్‌ అల్‌-లోగరి. వయసు దాదాపు 30 ఏళ్లు. అఫ్గాన్‌లోని లోగర్‌ ప్రావిన్సులో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఐఎస్‌తో చేతులు కలిపిన అల్‌-లోగరి.. కశ్మీర్‌ విషయంలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఐదేళ్ల క్రితం మన దేశంలో అడుగుపెట్టాడు. భారత నిఘా సంస్థ ‘రా’ అతడి కదలికలను కనిపెట్టింది. ప్రత్యేకంగా ఓ వ్యక్తిని బరిలో దించి.. అతడికి దగ్గరయ్యేలా చేసింది. తనను అల్‌-లోగరి పూర్తిగా విశ్వసించాడు. ఆయన సాయంతో దిల్లీలోని లజ్‌పత్‌ నగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. విద్యార్థిగా అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. దిల్లీ-ఫరీదాబాద్‌ మధ్య ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో పేరు నమోదు చేసుకున్నాడు. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచించి.. అందుకు అనువైన ప్రాంతాల కోసం అన్వేషించాడు. వసంత్‌ కుంజ్‌ సహా పలు ప్రాంతాలను పరిశీలించాడు. ఈ కదలికలన్నింటినీ ‘రా’ కనిపెట్టింది. 2017 సెప్టెంబరులో దిల్లీలో అతణ్ని అరెస్టు చేశారు. ఆపై అఫ్గానిస్థాన్‌కు అప్పగించారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న అతడు.. గత నెలలో తాలిబన్లు కారాగారాల నుంచి ఖైదీలను విడుదల చేసినప్పుడు బయటికొచ్చాడు. ఐఎస్‌ ప్రణాళికల్లో భాగంగా కాబుల్‌ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడితో 250 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని