ఎనిమిది మండలాల్లో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ మళ్లీ వాయిదా

ప్రధానాంశాలు

ఎనిమిది మండలాల్లో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ మళ్లీ వాయిదా

గుర్రంకొండలో రాత్రికి రాత్రి ఆర్‌ఓ బదిలీ
వైకాపా ఎంపీపీ అభ్యర్థి బీసీ కాదన్నందుకే?
కొత్త ఆర్‌ఓని నియమించి ఎన్నిక పూర్తి

ఈనాడు, అమరావతి: మండల పరిషత్‌ అధ్యక్ష పదవికి అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థిని అసమ్మతివర్గం వ్యతిరేకించడం వంటి కారణాలతో శుక్రవారం కోరం లేక వాయిదా పడిన 15 మండలాల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు శనివారం ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. ఎనిమిది మండలాల్లో రెండో రోజు కూడా అదే ప్రతిష్టంభన కొనసాగింది. దీంతో పొందూరు, సంతబొమ్మాళి, పి.గన్నవరం, జీలుగుమిల్లి, గుర్రంకొండ, అగళి, అమరాపురంల్లో మాత్రమే ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. కొత్తవలస, దుగ్గిరాల, పెదకూరపాడు, వింజమూరు, చిట్టమూరు, నిండ్ర, గుడుపల్లె, వాల్మీకిపురంలలో ఎన్నిక మళ్లీ వాయిదా పడింది.

చిత్తూరు జిల్లా: నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలంలో వైకాపా ఏడు స్థానాలు గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యే రోజా ప్రతిపాదించిన అభ్యర్థిని అసమ్మతివర్గం వ్యతిరేకించింది. రోజా వర్గంలో ఇద్దరే ఉండగా, అసమ్మతివర్గంలో ఐదుగురు ఉన్నారు. శనివారం నిండ్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం, తోపులాట జరిగింది. అసమ్మతివర్గం ధర్నాకి దిగింది. కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లెలో వైకాపా 10 స్థానాలు గెలుచుకుంది. వైకాపా... ఎంపీపీగా ఎంపిక చేయాలనుకున్న అభ్యర్థి మరణించారు. ఆ కుటుంబంలోని ఎవరో ఒకర్ని మళ్లీ ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిపించి, వారికే ఎంపీపీ పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. దాంతో ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీలు ఎవరూ హాజరుకాకపోవడంతో శనివారం కూడా ఎన్నిక జరగలేదు. పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలకుగాను కోర్టు కేసుల వల్ల 8 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. మిగతా మూడింటిలో రెండు స్థానాలను వైకాపా, ఒక దానిని తెదేపా గెలుచుకున్నాయి. అక్కడ కూడా కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. అదే నియోజకవర్గంలోని గుర్రంకొండ ఎంపీపీ పదవి బీసీ మహిళలకు రిజర్వు చేశారు. నక్కా వెంకటలక్ష్మమ్మను ఎంపీపీ అభ్యర్థిగా వైకాపా ప్రతిపాదించింది. ఆమె బీసీ ధ్రువీకరణపత్రం తెచ్చుకున్నారు. ఆమె బీసీ కాదని, ఆ ధ్రువపత్రాన్ని తాను అంగీకరించనంటూ... అక్కడ ఆర్‌ఓగా ఉన్న అధికారి ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. దీంతో ఆయనను శుక్రవారం రాత్రికి రాత్రే శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో మరో అధికారిని ఆర్‌ఓగా నియమించి శనివారం ఎన్నిక జరిపించారు. వెంకటలక్ష్మమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. కొత్త రిటర్నింగ్‌ అధికారి ఆమెకు సమీప బంధువు కావడం విశేషం.

విజయనగరం జిల్లా: కొత్తవలసలో వైకాపా 17 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుంది. ఎంపీపీ పదవికి వరలక్ష్మి పేరును ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్‌ ప్రతిపాదించారు. 11 మంది ఎంపీటీసీలు ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అసమ్మతివర్గం వేరే అభ్యర్థి పేరును ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వర్గం వారెవరూ హాజరుకాకపోవడంతో మళ్లీ ఎన్నిక వాయిదా పడింది.
గుంటూరు జిల్లా: దుగ్గిరాలలో శనివారం కూడా హైడ్రామా కొనసాగింది. వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తమ పార్టీకి చెందిన 8 మంది ఎంపీటీసీలతో హాజరయ్యారు. 9 మంది తెదేపా ఎంపీటీసీలు, జనసేన ఎంపీటీసీ ఒకరు హాజరుకాకపోవడంతో ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. పెదకూరపాడులో వైకాపా ఎంపీటీసీల్లోని రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక జరగలేదు.
నెల్లూరు జిల్లా: చిట్టమూరు, వింజమూరుల్లోను ఎన్నిక జరగలేదు. ఈ రెండు చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అభ్యర్థులను, అసమ్మతివర్గం వ్యతిరేకించడంతో ఎన్నిక వాయిదా పడింది.

పి.గన్నవరంలో తెదేపా, జనసేన అవగాహన

తూర్పుగోదావరి జిల్లా: పి.గన్నవరంలో మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలకుగాను వైకాపా 9, తెదేపా 7, జనసేన 5, బీఎస్పీ ఒకటి గెలుచుకున్నాయి. ఎంపీపీ పదవి విషయంలో తెదేపా, జనసేన మధ్య ఏకాభిప్రాయం కుదరక వారెవరూ హాజరుకానందున శుక్రవారం ఎన్నిక జరగలేదు. ఆ తర్వాత జిల్లాలోని రెండు పార్టీల ముఖ్య నేతలు కూర్చుని ఒక అవగాహనకు వచ్చారు. మొదటి రెండేళ్లు తెదేపా, ఆ తర్వాత మూడేళ్లు జనసేన ఎంపీపీ పదవి చేపట్టేలా అంగీకారం కుదిరింది. దాంతో శనివారం జరిగిన ఎన్నికలో తెదేపా అభ్యర్థి ఎంపీపీగా గెలిచారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని