‘కడియం’లో అన్యాయం జరిగితే నేనే వస్తా

ప్రధానాంశాలు

‘కడియం’లో అన్యాయం జరిగితే నేనే వస్తా

 జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హెచ్చరిక

 కేంద్ర హోంశాఖ దృష్టికి పోలీసుల తీరు

ఈనాడు, అమరావతి: ‘ఈనెల 24న జరగనున్న కడియం ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో మా వాళ్లను ఇబ్బందిపెట్టినా, ఓటింగ్‌కు రానివ్వకపోయినా స్వయంగా నేనే వచ్చి తేల్చుకుంటా. అలాంటి పరిస్థితులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే దానికి నేనూ సిద్ధమే’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. కడియం మండలంలో జనసేన తరఫున గెచిలిన ఎంపీటీసీ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్‌ను కలిసి, అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘తీవ్ర ప్రతికూలతల మధ్య పరిషత్‌ ఎన్నికల్లో జనసేన  పోరాడింది. అధికార పార్టీ దాష్టీకాలు, ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రంలో 180 ఎంపీటీసీ, రెండు జడ్పీటీసీ స్థానాలను దక్కించుకుంది. కడియంలో ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో మా ఎంపీటీసీ సభ్యులపై వైకాపా నాయకులు తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చూడాలి. లేకపోతే ఉత్పన్నమయ్యే పరిణామాలకు డీజీపీ, రాష్ట్ర ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కడియం మండల పరిషత్‌ను మేం కైవసం చేసుకోబోతున్నాం. దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు’ అని పేర్కొన్నారు. ‘కడియం మండలం పొట్టిలంకలో గెలిచిన జనసేన ఎంపీటీసీ సభ్యుడికి దండ కూడా వేయనివ్వకుండా కామిరెడ్డి సతీష్‌ అనే జనసైనికుడిని దారుణంగా కొట్టారు. వీరవరం ఎంపీటీసీ స్థానాన్ని జనసేన గెలిచిందనే అక్కసుతో కొత్తపల్లి అయ్యప్ప అనే కార్యకర్తపై మేకులన్న కర్రతో అమానుషంగా దాడిచేశారు. మా పార్టీ నేతలు స్టేషన్‌ బయట బైఠాయిస్తామని హెచ్చరిస్తేగానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా అధికారులకు ఈ పద్ధతిని సరిచేసుకోవాలని చెబుతున్నా. మున్ముందు పోలీసుల దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తాం’ అని పవన్‌కళ్యాణ్‌ స్పష్టంచేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని