ఉపాధి పనులపై విచారణ జరగడం లేదు

ప్రధానాంశాలు

ఉపాధి పనులపై విచారణ జరగడం లేదు

స్వయంగా హాజరై హైకోర్టుకు తెలిపిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

ఈనాడు, అమరావతి: ఉపాధి పనులపై ఎలాంటి విచారణ జరగడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఆదిత్యనాథ్‌దాస్‌ హైకోర్టుకు నివేదించారు. మీరైనా కోర్టుకు వాస్తవం చెప్పారని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి.. సీఎస్‌ చెప్పిన విషయాన్ని నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని అదనపు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన సుమారు 500 వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గత విచారణలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తూ.. ఉపాధి పనులపై విజిలెన్స్‌ విచారణ జరుగుతున్న నేపథ్యంలో 21శాతం సొమ్ము చెల్లించకుండా ఆపి ఉంచామన్నారు. మిగిలింది చెల్లించామన్నారు. న్యాయమూర్తి సందేహం వ్యక్తంచేస్తూ.. 2020 అక్టోబరు 16న విజిలెన్స్‌ విచారణ పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసిందని గుర్తుచేశారు. విజిలెన్స్‌ విచారణ పూర్తయిందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని గత విచారణలో సీఎస్‌ హాజరుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్‌ శుక్రవారం జరిగిన విచారణకు కోర్టు ముందు హాజరయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని