Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
అలసత్వమే అసలు మహమ్మారి

సేతుహిమాచలాన్ని గజగజలాడించిన మాయదారి మహమ్మారి- ప్రజారోగ్యంతో పాటు దేశార్థికాన్నీ దారుణంగా దెబ్బతీసింది. ఆ విషాద అనుభవాల స్మృతులు ఇంకా పచ్చిగా ఉండగానే- కరోనా వైరస్‌ కొత్త రూపం దాల్చింది. అసాధారణ ఉత్పరివర్తనాల సమ్మేళనంగా దక్షిణాఫ్రికాలో బయటపడిన ‘బి.1.1.529’ రకానికి ‘ఒమిక్రాన్‌’గా పేరుపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ- తీవ్ర ఆందోళనకరమైందిగా దాన్ని అభివర్ణిస్తోంది. బోట్సువానా, హాంకాంగ్‌, యూకే తదితరాల్లో ఇప్పటికే ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. భయం గుప్పిట్లోకి జారిపోతున్న పలు దేశాలు- ఆఫ్రికాలోని దక్షిణాది ప్రాంతాల నుంచి రాకపోకలను కఠినంగా నియంత్రిస్తున్నాయి. ముంచుకొస్తున్న ముప్పును అప్రమత్తతతో ఎదుర్కోవాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ- అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సడలించే ప్రణాళికను పునస్సమీక్షించాలని ఆదేశించారు. విలయ విధ్వంసకారిగా విరుచుకుపడిన డెల్టా రకం కొవిడ్‌ పంజాదెబ్బ నుంచి ప్రపంచం నేటికీ కోలుకోలేదు. టీకాల పట్ల అయిష్టతతో పాటు మాస్కుల ధారణ, భౌతిక దూరాన్ని పాటించడంలో ప్రజల అలక్ష్యం మూలంగా రష్యా, జర్మనీ తదితర దేశాల్లో కొన్నాళ్లుగా కేసులు పెచ్చరిల్లుతున్నాయి. పులి మీద పుట్రలా దాపురించిన ఒమిక్రాన్‌ను నిలువరించడంలో ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యంపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోతైన పరిశోధనలతోనే ఆ విషయం నిగ్గుతేలుతుందంటున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా బృందం సంచాలకులు ఆండ్రూ పొలార్డ్‌- అవసరమైతే కొత్త ఆయుధాన్ని వేగంగా సమకూర్చుకోవాల్సి రావచ్చునని అభిప్రాయపడుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే దేశీయంగా రెండో విడత టీకాల పంపిణీ జోరందుకోవాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి నిపుణులు సూచిస్తున్నారు. ఆ మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో పాటు విదేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలి. విపణి వీధులతో పాటు రాజకీయ, మత, వివాహ, వినోద కార్యక్రమాల్లో కనీస జాగ్రత్తలకు తిలోదకాలిచ్చే పెడపోకడలకు అడ్డుకట్ట వేయకపోతే- కరోనాపై పోరులో దేశం సాధించిన ప్రగతి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది!

కరోనా రక్కసి కబంధ హస్తాల నుంచి పూర్తిగా విముక్తి పొందక మునుపే అస్త్రసన్యాసం చేస్తున్న యంత్రాంగం తీరుపై కేంద్రం ఇటీవల ఆందోళన వ్యక్తంచేసింది. పదమూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొన్నాళ్లుగా కొవిడ్‌ పరీక్షల సంఖ్య తెగ్గోసుకుపోవడం ప్రజాభద్రతకు ప్రమాదకరమని హెచ్చరించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌, ఏపీ, బిహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మొదటి మోతాదు టీకా తీసుకోవాల్సిన వారి సంఖ్య అధికంగా ఉండటమూ కలవరపాటుకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా 122 కోట్లకుపైగా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లుగా సర్కారీ గణాంకాలు వెల్లడిస్తున్నా- మూడోవంతు జనాభాకైనా ఇప్పటివరకు పూర్తిస్థాయి టీకా రక్షణ లభించలేదు! ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించిన వాటిలో యాభై లక్షల మేరకు వ్యాక్సిన్లు వినియోగానికే నోచుకోవడం లేదు. సుదీర్ఘ విరామం తరవాత తిరిగి తెరుచుకున్న విద్యాసంస్థల్లో వెలుగుచూస్తున్న కొవిడ్‌ కేసులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో  అహేతుక వాదనలతో 11.5 కోట్ల మంది వయోజనులు వ్యాక్సిన్ల పట్ల విముఖత ప్రదర్శిస్తున్నట్లుగా అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. టీకాస్త్రాల సమర్థతపై ముసురుకున్న అనుమాన మేఘాలు తొలగిపోయేలా ప్రజాచైతన్య కార్యక్రమాలు విరివిగా చేపట్టాలి. దేశీయంగా వైరస్‌ ఉత్పరివర్తనాలపై పరిశోధనలనూ ఉరకలెత్తించాలి. రెండో ఉద్ధృతి సమయంలో వైద్యారోగ్య రంగంలో పొటమరించిన లోపాలు పునారావృతం కాకుండా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. జనజీవనాన్ని దిగ్బంధిస్తూ, దేశాభివృద్ధిని కుంటుపరచే ఆంక్షల కోరల్లో మళ్ళీ చిక్కుకోకూడదంటే- కొవిడ్‌ పీడ విరగడయ్యేంత వరకు ప్రజలు, పాలకులు జాగరూకతతో మెలగక తప్పదు!


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.