
సినిమా
ముంబయి: బాలీవుడ్ లవ్లీకపుల్ కత్రినాకైఫ్-విక్కీకౌశల్ పెళ్లితో ప్రస్తుతం బీటౌన్‌లో సందడి నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట మరికొన్నిరోజుల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో వీరి పెళ్లికి హాజరయ్యేందుకు పలువురు సినీతారలు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కత్రినా-విక్కీ మొదట చట్టపరంగా వివాహం చేసుకోనున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం లేదా శుక్రవారం వీరు తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోనున్నారట. ఎలాంటి హడావుడి లేకుండా జరిగే ఈ కార్యక్రమం పూర్తైన వెంటనే కత్రినా-విక్కీతోపాటు కుటుంబ సభ్యులందరూ రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌కి పయనమవనున్నారట. పెళ్లి, ఇతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 5 నుంచి 11వ తేదీ వరకూ వివాహ వేదికను పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకునేలా సదరు ఫోర్ట్ సిబ్బందితో ఈ జంట ఒప్పందం కుదుర్చుకున్నారని బీటౌన్‌లో టాక్.
మరోవైపు పెళ్లికి సంబంధించిన అతిథుల విషయంలో ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన కుటుంబానికి కూడా ఆహ్వానం అందలేదట. అంతేకాకుండా సల్మాన్ చెల్లి అర్పితను కత్రినా పెళ్లికి ఆహ్వానించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సదరు వార్తలపై అర్పిత స్పందిస్తూ.. ‘‘మాకు ఎటువంటి ఆహ్వానం అందలేదు. మేము వెళ్లడం లేదు’’ అని సమాధానమిచ్చారు. సల్మాన్‌ఖాన్ - కత్రినా ఎన్నో సంవత్సరాల నుంచి మంచి స్నేహితులు. ఇప్పటికే వీరు పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. త్వరలోనే ‘టైగర్-3’ షూట్లో కూడా పాల్గొననున్నారు.