Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
దోచుకున్నవాళ్లకు దోచుకున్నంత...

ఒకప్పుడు థగ్గులు, పిండారీలనే దారిదోపిడి ముఠాలు ప్రయాణికుల్ని నిస్సహాయ జనాన్ని నిర్దాక్షిణ్యంగా దోచుకునేవి. చేతికందినంతా దండుకుని, ఎదురుతిరిగినవాళ్ల ప్రాణాల్ని కర్కశంగా తోడేసేవి. మందిసొమ్మును గుంజుకోవడంలో ఆ తెగల అంశను పుణికిపుచ్చుకొని, ఆధునిక సాంకేతికత దన్నుతో సై‘బరి’లో మాటువేసిన కేటుగాళ్ల అకృత్యాలు పోనుపోను పెచ్చరిల్లుతున్నాయి.

ఏడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) క్రెడిట్‌కార్డు ఖాతాదారులకు 33వేల ఫోన్‌కాల్స్‌ చేసి వందలకోట్ల రూపాయలు కాజేసిన 28మంది సభ్యుల ముఠా తాజాగా సైబరాబాద్‌ పోలీసుల చేజిక్కింది. ఆ బ్యాంకుకు చెందిన అసలైన ఫోన్‌ నంబరు నుంచే ఖాతాదారుల్ని ఇట్టే బురిడీ కొట్టించడం- నిఖిల్‌ మదాన్‌, ముర్షీద్‌ ఆలం, పింకీ కుమారి ప్రధాన పాత్రధారులైన చోరబృందం ప్రత్యేకత. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తినుంచి లక్షలాది ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఖాతాదారుల వివరాల్ని రాబట్టిన ఆ ముఠా రకరకాల సేవల వలవేసి కీలక సమాచారం చేజిక్కించుకునేది. ఆపై పెద్దయెత్తున సొమ్మును అస్మదీయుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్ళించి ఏటీఎమ్‌ కేంద్రాలద్వారా తీసేసుకునేవారు. రెండు నెలలక్రితం అందిన ఫిర్యాదులపై దర్యాప్తు బృందం రంగంలోకి దిగి జల్లెడ పడితే ముఠా సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. దిల్లీ కేంద్రంగా సైబర్‌ నేరగాళ్ల ఈ ఘరానామోసం ఇప్పటిదాకా వెలుగుచూసిన అంతర్జాల దందాల్లో అతిపెద్దదని పోలీసులు చెబుతున్నారు. ఖర్మకాలి దొరికిపోయేలోగా ఒకేరోజు కోటి రూపాయలదాకా కొల్లగొట్టిన ఉదంతాలనుబట్టి, ఎందరు ఎంతమొత్తం సొమ్ము పోగొట్టుకున్నారో నిక్కచ్చిగా లెక్కకట్టగలవారెవరు? ఒక్క 2019 సంవత్సరంలోనే దేశంలో సైబర్‌ నేరాల పద్దుకింద వాటిల్లిన నష్టం రూ.1.25 లక్షల కోట్లన్నది అధికారిక అంచనా. దిగ్భ్రాంతపరచే మరెన్నో నేరాల ఉరవడి, సైబరాసురుల విజృంభణను తరచూ ఎలుగెత్తుతోంది.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్‌ మోసాల్లో మూడొంతులకు కేంద్రబిందువుగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా ఎనలేని అప్రతిష్ఠ మూటకట్టుకుంటోంది. బహుమతి గెలుచుకున్నారనో, నయా బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయనో, ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన వస్తుసామగ్రిని కొంటామనో ఫోన్లు చేసి నమ్మించి నిలువునా ముంచేసే ముఠాలు వేలసంఖ్యలో భరత్‌పూర్‌లో ఉన్నాయంటే- అక్కడి నేరసామ్రాజ్య విస్తృతిని తేలిగ్గానే ఊహించవచ్చు. ఆ ప్రాంతంలోని ప్రతి ఊళ్లోనూ ఇంచుమించు ప్రతి ఇంటా ఒక ‘కాల్‌సెంటర్‌’ నిక్షేపంగా నడుస్తున్నట్లు కథనాలు చెబుతున్నా- సాధారణంగా సోదాల్లో దొంగలెవరూ దొరకరు. రహస్య నేలమాళిగలు, అంతకు మించి అదృశ్య రాజకీయ కవచాలు బడాచోరుల్ని బయటకు కనిపించనివ్వవు. ఎన్నికలవేళ స్థానిక పెత్తందారులకు సైబర్‌ నేరగాళ్లు సొమ్ము సర్దుబాటు చేస్తుంటారని, బదులుగా వాళ్ల బాగోగుల్ని నేతాగణం నిష్ఠగా చూసుకుంటారన్నది బహిరంగ రహస్యం. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి దర్యాప్తు బృందాలు వస్తే, ముందుగానే ఆ సమాచారం చేరవేసి కేటుగాళ్లు ఆవలకు జారుకోవడానికి శాయశక్తులా సహకరించే పోలీసు సిబ్బందికీ ఇబ్బడిముబ్బడిగా కాసుల పంట పండుతోందన్నదీ అంతేనిజం. సైబర్‌ నేరాలకు పెట్టింది పేరైన సర్కిళ్ల పరిధిలో కానిస్టేబుల్‌ పోస్టూ లక్షల్లో ధర పలుకుతుండటం, అక్కడ ‘ఇచ్చిపుచ్చుకొనే సంస్కృతి’ ఎంతగా చిలవలు పలవలు వేసుకుపోయిందో విశదం చేస్తుంది. ఎడారినేల ఒక్కటే కాదు- ఝార్ఖండ్‌లోని జామ్‌తాడా, దేవ్‌గఢ్‌ తదితర ప్రాంతాలూ సైబర్‌ నేరగాళ్లకు అడ్డాలుగా జగత్ప్రసిద్ధి చెందుతున్నాయి. దేవ్‌గఢ్‌ జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఫోన్లు చేసి ఎలా టోకరా వెయ్యాలో, ఖాతాల్ని ఏ తీరుగా ఊడ్చెయ్యాలో ఔత్సాహిక మోసగాళ్లకు మెలకువలు తెలియజెప్పే శిక్షణ కేంద్రాలు సైతం పుట్టుకొచ్చాయి!

అనూహ్య లబ్ధి ఏదో చేకూరిందనో, అత్యవసరంగా సాంకేతిక సమస్యను పరిష్కరించాల్సి వచ్చిందనో కట్టుకథ ఏదో చెప్పి గందరగోళపరచి స్థిమితంగా ఆలోచించుకునే అవకాశమివ్వకుండా చేసి- ఆ స్థితిలోని వ్యక్తి ఖాతాను దోచెయ్యడమే, సైబర్‌ నేరగాళ్ల వ్యూహమన్నది నిపుణుల విశ్లేషణ. కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) ప్రక్రియ విధిగా పూర్తయితేనే బ్యాంకింగ్‌ సేవలు పూర్తిగా అందుతాయన్న నిబంధనను అవకాశంగా దొరకబుచ్చుకొని ఉన్నతాధికారులకు, విశ్రాంత సిబ్బందికి సైతం మోసగాళ్లు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఉచితంగా సినిమా వినోదం పొందడానికి, చరవాణి రీఛార్జికి తాము పంపిన వాట్సాప్‌ లింకును పదిమందికి పంపితే చాలునన్న ఎరలకు చిక్కి ఎందరో బాధితుల జాబితాలోకి చేరుతున్నారు. భాగ్యనగరానికి చెందిన ఓ వ్యక్తికి మెయిల్‌ ద్వారా సందేశం పంపి అతడి చరవాణిని హ్యాక్‌చేసి రూ.25 లక్షల రూపాయలు కొట్టేసిన బాగోతం రెండు నెలల క్రితం గగ్గోలు పుట్టించింది. ఎప్పటికప్పుడు కొవిడ్‌ సంబంధిత సమాచారం అందిస్తామన్న సంక్షిప్త సందేశాలు, లింకుల విషయంలో ‘తస్మాత్‌ జాగ్రత్త’ అని ఆమధ్య ఇంటర్‌పోల్‌ హెచ్చరించింది. తన వంతుగా సీబీఐ వివిధ రాష్ట్రాల పోలీస్‌ విభాగాలను, కేంద్ర నిఘా సంస్థలను హెచ్చరించినప్పటికీ- సాధారణ ప్రజానీకానికి కీలక సమాచారం చేరనేలేదు. తూతూమంత్రం జాగ్రత్తలకే యంత్రాంగం పరిమితమవుతుండగా- నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అయిదు వేల సిమ్‌కార్డులు ఉపయోగించి నాలుగు వేల నేరాలకు తెగబడిన ముగ్గురు సభ్యుల హరియాణా ముఠా గుట్టు మొన్న సెప్టెంబరులో రట్టయింది. సైబరాసురుల బారినుంచి పౌరుల్ని సంరక్షించే వ్యవస్థాగత రక్షణ ఛత్రం ఎండమావిని తలపిస్తున్న దశలో- దోచుకున్న వాళ్లకు దోచుకున్నంతగా మారిన స్థితిగతులు తీవ్రాందోళన రేకెత్తిస్తున్నాయి.

సైబర్‌ దాడుల్లో వ్యక్తులే కాదు, వ్యవస్థలూ భారీగా నష్టపోవడం చూస్తున్నాం. ఇటీవల ఇరాన్‌లో సైబర్‌ దాడి పర్యవసానంగా అక్కడి గ్యాస్‌ స్టేషన్లన్నీ ఒక్కుదుటున మూతపడ్డాయి. పెట్రోల్‌ బంకులూ మొరాయించాయి. ఏడాది క్రితం ముంబయి నగరంలో విద్యుత్‌ గ్రిడ్‌ విఫలమై ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయి జనజీవనం స్తంభించింది. దాని వెనక చైనా హస్తం ఉందని అమెరికా సంస్థ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ వెల్లడించింది. సరిహద్దు ఆవలినుంచే కాదు- దేశీయంగానూ కొందరు ప్రబుద్ధుల తోడ్పాటు సైబర్‌ నేరగాళ్లకు కోరలు మొలిపిస్తోంది. డేటింగ్‌, గేమింగ్‌ యాప్‌ల ద్వారా అక్రమంగా కూడగట్టిన వేల కోట్ల రూపాయల సొమ్మును ఉత్తుత్తి కంపెనీల సృష్టితో దేశం వెలుపలికి పంపించిన వైనం- ఎక్కడికక్కడ వర్ధిల్లుతున్న కంతల ఆనవాళ్లను పట్టిస్తోంది. ఆర్థిక నేరాల మూలాలు ఫలానా చోట ఉన్నట్లు పోలీసులు కూపీ లాగుతున్నా, నిందితులెందరో కొరమీనుల్లా చేజారిపోతున్నారు. 2018లో సుమారు 27వేలుగా నమోదైన సైబర్‌ నేరాల సంఖ్య దేశంలో నిరుడు యాభై వేలకు మించిపోయింది. సైబర్‌ సవాళ్లను ఎదుర్కొనే బాధ్యతను అమెరికాలో జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌ఏ) నిభాయిస్తోంది. అదే     తరహాలో ఇక్కడా సైబర్‌ చోరులకు ఉచ్చు బిగించే పకడ్బందీ ఏర్పాట్లు జరగనంతవరకు, ఆన్‌లైన్‌ మాయగాళ్ల అభయారణ్యంగా ఇండియా ‘ఖ్యాతి’ చెక్కుచెదరదు. ఏమంటారు?

- బాలు


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.