
గ్రేటర్ హైదరాబాద్
- ట్విటర్లో మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరిని ఇప్పటికే అన్ని విధాలా ఆదుకున్నామని, ఆయన కుటుంబానికి మరింత అండగా ఉంటామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ‘‘జూన్‌లో కందికొండ కేన్సర్‌తో ఆసుపత్రిలో చేరి వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు మాకు అండగా నిలిచారు. ఇప్పుడు మోతీనగర్‌లో ఉన్న అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా యజమాని ఒత్తిడి తెస్తున్నారు. మాకు చిత్రపురి కాలనీలో నివాసం కల్పించాలి’’ అని కందికొండ కుమార్తె మాతృక ఆదివారం ట్విటర్ ద్వారా కేటీఆర్‌కు విన్నవించారు. గత నెలలోనూ తన తండ్రికి వెన్నెముక శస్త్రచికిత్స చేయించారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. చిత్రపురి కాలనీలో సొంత ఇంటికోసం ఆయన రూ.4.05 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించారని, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా మిగిలిన మొత్తాన్ని చెల్లించలేకపోయారని తెలిపారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. మంత్రి తలసానితో తన కార్యాలయ సిబ్బంది సమన్వయం చేసి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు.